Edward Jenner-ఎడ్వర్డ్‌ జెన్నర్‌

పద్నాలుగేళ్లకే వైద్యంపై మక్కువ... ఎనిమిదేళ్ల పాటు అభ్యాసం... ఆపై నిరంతర అధ్యయనం.. ఫలితం... మహమ్మారిపై విజయం... మానవాళికి మహోపకారం! అది సాధించిన శాస్త్రవేత్త పుట్టింది ఈ రోజే!--1749 మే 17నమశూచి పేరు వింటేనే ఒకప్పుడు అందరూ ఉలిక్కిపడేవారు. కారణం అది సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించేవారు. అలా 1700 నుంచి 1800 సంవత్సరాల మధ్య కాలంలో ఈ వ్యాధి సోకి చనిపోయిన వారి సంఖ్య 6 కోట్లకు పైమాటే! అలాంటి మశూచి (స్మాల్‌పాక్స్‌) ఈనాడు ఎక్కడా కనబడడం లేదంటే దానికి కారణం ఓ శాస్త్రవేత్త పరిశోధనే. అతడే ఎడ్వర్డ్‌ జెన్నర్‌. 'ప్రపంచంలో అత్యధికుల ప్రాణాలు కాపాడిన వ్యక్తి' గుర్తింపును పొందిన వ్యక్తి.ఇంగ్లండ్‌లోని బెర్కిలీలో 1749 మే 17న ఓ క్రైస్తవ మతాధికారికి పుట్టినఎడ్వర్డ్‌ జెన్నెర్‌, వైద్య విద్యపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఆ రోజుల్లో డాక్టర్‌ కావాలంటే, మరో పెద్ద వైద్యుడి దగ్గర శిక్షణ పొందే అవకాశం ఉండేది. అలా 14 ఏళ్లకే ఓ శస్త్ర చికిత్సకారుడు (సర్జన్‌) వద్ద ఎనిమిదేళ్ల పాటు అభ్యాసం చేశాడు. ఆపై లండన్‌ సెయింట్‌ జార్జి ఆసుపత్రిలో జాన్‌ హంటర్‌ వద్ద వైద్యాన్ని అధ్యయనం చేశాడు. ఆ శాస్త్రంలో డిగ్రీ పొందిన తర్వాత సామాన్యుల కోసం స్వగ్రామంలో వైద్యవృత్తిని ప్రారంభించాడు.ఆ సమయంలోనే జెన్నర్‌ దృష్టి మశూచిపై పడింది. ఆవులకు కూడా మశూచి లాంటి వ్యాధి సంక్రమిస్తుంది. దానిని 'గోమశూచి' (cowpox)అంటారు. ఇది ఆవుల నుంచి పశువుల కాపరులకు సోకేది. ఇది ప్రమాదకరం కాకపోవడమే కాకుండా, ఒకసారి వచ్చి తగ్గిన వారికి స్మాల్‌పాక్స్‌ రాకపోవడాన్ని జెన్నర్‌ గమనించాడు. దాంతో కౌపాక్స్‌కి కారకమయ్యే వైరస్‌ను కొందరి ఆరోగ్యవంతులకు వారి అనుమతితోనే సూక్ష్మమైన మోతాదులో ఎక్కించేవాడు. వారికి కౌపాక్స్‌ వచ్చి తగ్గిన తర్వాత స్మాల్‌పాక్స్‌ వైరస్‌ను సూక్ష్మ స్థాయిలో ఎక్కించి పరీక్షించేవాడు. చిత్రంగా వారికి మశూచి సోకలేదు. ఇలా చేసిన పరిశోధన ఫలితాలను ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఆ పరిశోధన ఫలితంగానే ఈనాటికీ కౌపాక్స్‌ మోతాదును టీకాల ద్వారా ఎక్కించడం ద్వారా మశూచి రాకుండా ఉండే రోగనిరోధక శక్తిని కల్పిస్తున్నారు. మశూచిని మట్టికరిపించాడు!

జెన్నర్‌ను బ్రిటిష్‌ పార్లమెంట్‌ 'నైట్‌' బిరుదుతో సన్మానించింది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ఇస్తే, రష్యా చక్రవర్తి ఉంగరాన్ని బహూకరించాడు. ఫ్రాన్స్‌ అధినేత నెపోలియన్‌ దేశంలో అందరూ మశూచి టీకాలు వేయించుకోవాలని శాసనం చేశాడు. అమెరికన్‌ ప్రభుత్వం అనేక బహుమతులు అందించింది.