Nikola Tesla , నికొలా టెస్లా

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు (courtesy : Eenadu telugu daily)

నిస్త్రంత్రీ ప్రసారం(wireless communication) పై మార్కోనీ ప్రయోగాలు మొదలెట్టడానికి రెండేళ్లకు ముందే ఆ వ్యవస్థను టెస్లా ఊహించాడు. రోబోటిక్స్‌, రిమోట్‌ కంట్రోల్‌, రాడార్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బాలెస్టిక్స్‌, న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ రంగాల అభివృద్ధికి ఆయన సిద్ధాంతాలే నాంది పలికాయి. ఎంత పేరు సంపాదించినా ధనాపేక్ష లేకపోవడంతో చివరి దశలో పేదరికాన్ని అనుభవిస్తూ 1943లో మరణించాడు. అయస్కాంత అభివాహ సాంద్రత (magnetic flux density) ప్రమాణంగా 'టెస్లా' పేరు, ఆయన గౌరవార్థం పెట్టినదే.

ఆపై కొందరి సహకారంతో సొంత ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని ఏసీ మోటారును మరింత అభివృద్ధి చేసి డైనమో, ప్రేరణ (ఇండక్షన్‌) మోటారు, ట్రాన్స్‌ఫార్మర్‌లకు మేధోహక్కులు పొందాడు. ప్రముఖ విద్యుత్‌ వ్యాపార సంస్థ జార్జి వెస్టింగ్‌హౌస్‌ ఈ పేటెంట్లను కొనుగోలు చేసి, టెస్లా కనిపెట్టిన బహుళ దశల విద్యుత్‌ వ్యవస్థ(poly phase system)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

పారిస్‌, స్ట్రాస్‌బర్గ్‌లలో పని చేసే కాలంలో ఏసీ మోటారును రూపకల్పన చేసిన అతడు దాన్ని ప్రాచుర్యంలోకి తేవడానికి అమెరికా వెళ్లాడు. అప్పటికి అతడి దగ్గర ఉన్నది నాలుగు సెంట్ల నాణేలు, ఒక పొయిట్రీ పుస్తకం, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్‌ ఆల్వా ఎడిసన్‌ను కలిసేందుకు ఉపయోగపడే ఓ పరిచయ పత్రం. ఎడిసన్‌ అతడికి ఉద్యోగమిచ్చినా అతడి ఏసీ విద్యుత్‌ ఆలోచనను సమర్ధించలేదు. అత్యధిక ఓల్టేజి వల్ల ప్రమాదాలు ఏర్పడతాయనేది ఆయన అభిప్రాయం. రాన్రానూ డీసీ, ఏసీ కరెంటులపై వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు పెరగడంతో టెస్లా బయటకి వచ్చేశాడు. రెండేళ్లపాటు రోజుకూలీగా పనిచేస్తూ తన ప్రాజెక్ట్‌ కోసం డబ్బులు కూడబెట్టాడు.

అప్పటి ఆస్ట్రియాలోని (ఇప్పటి క్రొయాటియా) స్మిల్‌జాన్‌ గ్రామంలో 1856 జులై 10న పుట్టిన టెస్లా చిన్నతనం నుంచే ఏకసంథాగ్రాహిగా పేరుపొందాడు. ఏ పుస్తకాన్ని చదివినా దాన్ని పూర్తిగా గుర్తుపెట్టుకోగలిగిన అద్భుత జ్ఞాపకశక్తి అతడి సొంతం. చర్చిలో మతగురువుగా ఉండే తండ్రి తన వృత్తినే చేపట్టమని కోరినా తిరస్కరించిన టెస్లా గణిత, భౌతిక, తత్వ శాస్త్రాలను అధ్యయనం చేశాడు. విశ్వవిద్యాలయంలో ఉండగానే తండ్రి మరణించడంతో డిగ్రీ పొందకుండానే జీవనోపాధి కోసం చిన్నా చితకా వృత్తులను చేపట్టవలసి వచ్చింది. బుడాపెస్ట్‌ టెలిఫోన్‌ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా చేరిన అతడు ఆ తర్వాత చేసిన కృషి వల్ల ఆ దేశపు తొలి టెలిఫోన్‌ వ్యవస్థలో ఇంజినీరుగా ఎదగడం విశేషం.

ఈ పరిస్థితుల్లో ఎక్కువ ఓల్టేజిగల విద్యుత్‌ను సుదూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రసారమయ్యేలా చేసిన ఘనత టెస్లాదే. ఈయన రూపొందించిన మోటారుతో పుట్టిన విద్యుత్‌ను ఆల్టర్‌నేటింగ్‌ కరెంట్‌ (ఏసీ) అంటారు. ఇది అత్యధిక యాంత్రిక శక్తితో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించింది.

విద్యుత్‌ ప్రవాహాలు రెండు రకాలు. ఒకటి బ్యాటరీ ధనధ్రువం నుంచి రుణధ్రువం వరకూ ఒకే దిశలో ప్రయాణించేది. దీన్నే డైరెక్ట్‌ కరెంట్‌ (డీసీ) అంటారు. ఓల్టేజి విలువలు తక్కువగా ఉండే ఈ విద్యుత్‌ పరిమిత ప్రదేశంలో వాడకానికి మాత్రమే పనికొస్తుంది. థామస్‌ ఆల్వా ఎడిసన్‌ కనిపెట్టిన బల్బును వెలిగించింది ఇదే. డైనమో విద్యుత్‌ శక్తిని పుట్టిస్తే, ఆ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చి యంత్రాలను నడపడానికి దోహద పడేలా చేసేది డీసీ మోటారు. అయితే దీని ద్వారా లభించే యాంత్రిక శక్తి చాలా తక్కువ.

విద్యుత్‌ ఉత్పత్తిని సులభతరం చేసి, ఎంత దూరమైనా పంపగలిగే ప్రసార వ్యవస్థను నెలకొల్పిన శాస్త్రవేత్తగా నికొలా టెస్లాను చెప్పుకోవాలి. ఆయన వల్లనే ఈనాడు ప్రపంచమంతా విద్యుత్‌ వెలుగులతో నిండిపోయిందనడంలో సందేహం లేదు.

విద్యుత్‌ వెలుగులు పంచినవాడు! ఈనాడు ప్రతి ఇంట్లోనూ విద్యుత్‌ వెలుగులు విరజిమ్ముతున్నాయన్నా... అనేక విద్యుత్‌ పరికరాలు అడుగడుగునా ఉపయోగపడుతున్నాయన్నా... అందుకు కారకుడు నికొలా టెస్లా! ఆయన పుట్టిన రోజు ఇవాళే! 1856 జులై 10న .