గణాంక శాస్త్రం (స్టాటిస్టిక్స్)లో ప్రపంచ గుర్తింపు పొందే సిద్ధాంతాలు, సూత్రాలు ఆవిష్కరించిన ఆయనకు లభించిన ఎన్నో అవార్డుల్లో 'యూఎస్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్సెస్' కూడా ఒకటి. అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ ఆయన సేవలను వర్ణిస్తూ, 'సీఆర్ రావు చేసిన పరిశోధనలు ఆర్థిక (ఎకానమిక్స్), జన్యు (జెనెటిక్స్), మానవ విజ్ఞాన (ఆంథ్రోపాలజీ), భూగర్భ (జియోలజీ), జనాభా (డెమోగ్రఫీ), జీవ పరిణామ (బయోమెట్రీ) శాస్త్రాలను కూడా ప్రభావితం చేశాయి' అని కొనియాడింది. మన దేశంలోని మేటి పదిమంది భారతీయ శాస్త్రవేత్తల్లో ఒకరుగా ఆయన గుర్తింపు పొందారు.
కర్ణాటక రాష్ట్రంలోని హడగలీలో 1920 సెప్టెంబర్ 10న పదిమంది సంతానంలో ఎనిమిదో వాడిగా పుట్టిన సీఆర్ రావు చదువంతా ఆంధ్రప్రదేశ్లోనే సాగింది. విశాఖపట్నంలోని మిసెస్ ఎ.వి.ఎన్. కాలేజీలో డిగ్రీ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గణితంలో ఎమ్.ఏ. చేసిన ఆయన మార్కులు ఇప్పటికీ ఒక రికార్డే! కోల్కతా ప్రెసిడెన్సీ కాలేజీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో గణాంక శాస్త్రంలో మరో ఎమ్.ఏ.ను బంగారు పతకంతో సాధించారు. ఆపై లండన్లోని కేంబ్రిడ్జ్లో ఆంథ్రోపాలజికల్ మ్యూజియంలో చేరి కింగ్స్ కాలేజీ నుంచి పీహెచ్డీ పొందారు.
ఇరవై ఐదేళ్ల వయసులో ప్రచురించిన 'థియరీ ఆఫ్ ఎస్టిమేషన్' పరిశోధన పత్రం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అలాగే 'ది క్రామర్-రావ్ ఇనీక్వాలిటీ', 'ది ఫిషర్-రావ్ సిద్ధాంతం', 'రావ్-బ్లాక్ వెల్లిశేషన్', 'మల్టీ వేరియట్ ఎనాలసిస్' లాంటి ఎన్నో విలువైన ఫలితాలను అందించారు. ఆయన పరిశోధనలు వైద్యరంగంలో రోగ నిర్ధ్దరణ, మొక్కల పెంపకం, జీవపరిణామంలాంటి అనేక రంగాల్లో గణితాత్మక అధ్యయనాలకు సైతం ఉపయోగపడడం విశేషం.
ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్లో నాలుగు దశాబ్దాలు పనిచేసి రిటైరైన ఆయన అమెరికాలోని పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయాలు, పరిశోధక సంస్థల్లో పాతికేళ్లు పనిచేశారు. ఆయన రాసిన పుస్తకాల్లో కొన్ని అనేక భాషల్లోకి అనువాదమయ్యాయి. 18 దేశాల నుంచి 31 గౌరవ డాక్టరేట్లు పొందిన ఆయన, దేశదేశాల్లోని ఎనిమిది అకాడమీల్లో సభ్యుడు కూడా. ప్రపంచవ్యాప్తంగా అనేక పతకాలు, అవార్డులు పొందిన ఆయన ప్రస్తుతం 'సాంఖ్య' అనే ఇండియన్ స్టాటిస్టికల్ పత్రికకు సంపాదకత్వం వహిస్తున్నారు.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు
హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్శిటీ. కిందటేడాది డిసెంబర్ 30. ఓ భారతీయ శాస్త్రవేత్త పేరు మీద ఒక అంతర్జాతీయ సంస్థ ప్రారంభమైంది. ఆ శాస్త్రవేత్తే కాల్యంపూడి రాధాకృష్ణా రావు. ఆ సంస్థ పేరు 'సి ఆర్ రావు అడ్వాన్స్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్సెస్' (AIMSCS). ఆ రోజే భారతీయ తపాలా శాఖ ఆయన చిత్రంతో పోస్టల్ కవర్ను విడుదల చేసింది. హైదరాబాద్ యూనివర్శిటీ ఉండే మార్గానికి ఆయన పేరే పెట్టారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్ అందుకున్న ఆయన ఇప్పటికీ చురుగ్గా పనిచేస్తుండడం విశేషం.
గణాంక శాస్త్రంలో గణనీయమైన ఘనత! ఆరు ఖండాల్లోని 18 దేశాల నుంచి... గౌరవ డాక్టరేట్లు! 14 పుస్తకాలతో పాటు... 400 పరిశోధన పత్రాలు! దేశంలో ప్రతిష్ఠాత్మకమైన... పద్మవిభూషణ్! ఇవన్నీ ఓ భారతీయ శాస్త్రవేత్త పరిచయ వాక్యాలే! ఆయన పుట్టిన రోజు ఇవాళే-1920 సెప్టెంబర్ 10న.