Michael Faraday , మైకేల్‌ ఫారడే

విద్యుత్‌ పరికరాలన్నీ ఆయన చలవే! - కుమ్మరి కొడుకు... పేద కుటుంబం... చదువు అంతంత మాత్రం... అయినా ఓ కుర్రాడు శాస్త్రవేత్త కాగలిగాడు. కారణం పుస్తక పఠనమే. అతడే విద్యుత్‌ వినియోగానికి బాటలు వేసిన మైకేల్‌ ఫారడే! పుట్టినరోజు ఇవాళే - 1791 సెప్టెంబర్‌ 22న .ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న విద్యుత్‌ పరికరాలను చూడండి. ఎయిర్‌ కండిషనర్‌, ఫ్రిజ్‌, వాషింగ్‌ మిషన్‌, టీవీ, కంప్యూటర్‌... ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయంటే దానికి కారణం ఆల్టర్నేటింగ్‌ కరెంట్‌ (ఏసీ) వినియోగమే. దానిని ఆవిష్కరించి మనం ఇప్పుడు పొందుతున్న సౌకర్యాలకు దారి చూపి 'ఫాదర్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ'గా పేరొందిన శాస్త్రవేత్తే మైకేల్‌ ఫారడే. విద్యుదయస్కాంత, విద్యుత్‌రసాయనిక రంగాల్లో కూడా ఆయన కృషి మరువలేనిది. 'అప్పటికి నోబెల్‌ లేదు కానీ, ఉండి ఉంటే కనీసం ఆరు వచ్చేవి' అని శాస్త్రవేత్తలే కొనియాడే వ్యక్తిగా పేరుతెచ్చుకున్నాడు.లండన్‌ దగ్గర ఓ కుగ్రామంలో అతి పేద కుటుంబంలో 1791 సెప్టెంబర్‌ 22న పుట్టిన ఫారడే చదువు ప్రాథమిక స్థాయి దాటలేదు. కుమ్మరి పనిలో ఉండే తండ్రికి చదివించే స్థోమత లేకపోవడంతో చిన్నప్పుడే ఫారడే పేపర్లు పంచే పనిలో చేరాడు. ఆ పనిలో ఉంటూనే పత్రికల్లో వచ్చే విషయాలన్నీ ఆసక్తిగా చదివేవాడు. ఆపై మంచి పుస్తకాలు అందుబాటులో ఉంటాయనే ఉద్దేశంతో బైండింగ్‌ దుకాణంలో చేరాడు. అక్కడికొచ్చే పుస్తకాలను ఇంటికి తెచ్చుకుని రాత్రంతా మేలుకుని కొవ్వొత్తి వెలుగులో చదివేవాడు. అలా 'ఎన్‌సైక్లోపిడియా ఆఫ్‌ బ్రిటానికా', 'కాన్వర్‌జేషన్స్‌ ఆన్‌ కెమిస్ట్రీ' లాంటి వాటిని కూడా చదివి స్ఫూర్తి పొందాడు. సైన్స్‌ పట్ల అభిరుచి పెంచుకుని శాస్త్రవేత్తల ఉపన్యాసాలకు హాజరై శ్రద్ధగా వినేవాడు. ఓసారి హంఫ్రీడేవీ ప్రసంగం వింటూ రాసుకున్న అంశాలను కూర్చి, వాటికి బొమ్మలను చేర్చి, చక్కగా బైండ్‌ చేసి ఆయన చిరునామాకు పంపించాడు. వాటిని చూసి ఎవరో శాస్త్రవేత్త కావచ్చనుకున్న ఆయన, ఫారడేని చూసి ఆశ్చర్యపోయారు.ఫారడేలో ఆసక్తిని గమనించిన డేవీ అతడిని తన ప్రయోగశాలలో సహాయకుడిగా చేర్చుకున్నారు. పనులు చేస్తూనే ఫారడే అక్కడి రసాయనాలతో ప్రయోగాలు చేసేవాడు. అలా కెమిస్ట్రీ, మెటలర్జీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఎలక్ట్రాలసిస్‌లలో ప్రపంచాన్ని అబ్బురపరిచే ప్రయోగాలు చేశాడు. ఆయన ఆవిష్కరణల్లో విద్యుదయస్కాంత ప్రేరణ నియమం (Law of electromagnetic induction), విద్యుత్‌ బలరేఖలు (Electric Lines of force), క్లోరిన్‌ వాయువు ద్రవీకరణ, పదార్థాల అయస్కాంత ధర్మాలు అతి ముఖ్యమైనవి.అయస్కాంత శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చవచ్చని నిరూపించి విద్యుత్‌ జనరేటర్‌, డైనమోల తయారీకి కారకుడయ్యాడు. బెంజీన్‌, బున్‌సెన్‌ బర్నర్‌,కళ్లద్దాలుగా ఉపయోగపడే గాజు రకాలు లాంటివెన్నో కనుగొన్నాడు. బ్రిటన్‌ అత్యున్నత పురస్కారమైన నైట్‌హుడ్‌, అనేక గౌరవ డాక్టరేట్లు వచ్చినా సున్నితంగా తిరస్కరించిన నిరాడంబరుడు. -ప్రొ||ఈ.వి. సుబ్బారావు -ఈనాడు హాహ్ బుజ్జీ _ సౌజన్యము తో - సేకరణ : డా.శేషగిరిరావు