జన్యువుల గుట్టు విప్పినవాడు! ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి పరిశోధనశాలలో ప్రయోగాలు మొదలు పెట్టిన ఓ కుర్రాడు, పెరిగి పెద్దయి జన్యుశాస్త్రాన్ని మలుపు తిప్పాడు. అతడే హాల్డేన్. పుట్టిన రోజు ఇవాళే- 1892 నవంబరు 5న .
మానవుల పుట్టుక, పెరుగుదలల్లో ముఖ్య పాత్ర వహించేవి జన్యువులని చదువుకుని ఉంటారు. అవి ఎలా పనిచేస్తాయో, ఎలాంటి మార్పులకు గురవుతాయో వివరించిన వ్యక్తిగా జె.బి.ఎస్. హాల్డేన్ పేరుపొందాడు. జీవ, జన్యు శాస్త్రవేత్తగా, గణిత పరిశోధకుడిగా, సాహస సైనికుడిగా, బహుభాషా కోవిదుడిగా, సాహితీవేత్తగా, విప్లవకారుడిగా ఆయన బహుముఖంగా ప్రతిభ చూపారు. భారతదేశం పట్ల ఆకర్షితుడై ఇక్కడే స్థిరపడడం విశేషం.ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో 1892 నవంబరు 5న పుట్టిన జాన్ బర్టన్ సాండర్‌సన్ హాల్డేన్ చురుకైన విద్యార్థి. శాస్త్రవేత్త అయిన తండ్రి పరిశోధనలను పరిశీలిస్తూ ఎదిగిన అతడు ఎనిమిదేళ్లకే ప్రయోగాల్లో పాల్గొనేవాడు. లాటిన్, గ్రీకు, ఫ్రెంచి, జర్మన్ భాషల్లో పట్టు సాధించిన అతడు పదహారేళ్లకే గణితంలో ప్రతిష్ఠాత్మకమైన రస్సెల్ ప్రైజ్ సాధించాడు.మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా పాల్గొన్న అతడు ధైర్య సాహసాలతో శత్రు శిబిరాలలోకి చొరబడి రహస్యాలను గ్రహిస్తూ, బాంబులతో దెబ్బతీస్తూ 'రాంబో'గా పేరొందాడు. యుద్ధానంతరం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం (బయోకెమిస్ట్రీ)లో అధ్యయనం చేశాడు. ఆపై జన్యుశాస్త్రం పట్ల ఆకర్షితుడై వంశపారంపర్య పరివర్తనలపై (Heridity Mutations) పరిశోధన చేసి 'ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ'గా ఎన్నికయ్యారు. లండన్‌లోని యూనివర్శిటీ కళాశాలలో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఫిజియాలజీ, వైద్య, పరిణామ, జన్యు, జీవరసాయన, గణిత, కాస్మాలజీ శాస్రాల్లో ఆయన సిద్ధాంతాలకు ప్రాముఖ్యత ఉంది. జన్యుశాస్త్రానికి గణితాన్ని అనుసంధానించిన ఘనత ఆయనదే. తద్వారా మానవ జన్యువులలో (Human Genes) పరివర్తన (mutation) రేటును నిర్ణయించారు. అంటే ఒక శిశువుకు తల్లిదండ్రులలో లేని స్వభావం ఏర్పడడం. ఒక తరంలోని ప్రతి యాభై వేల మందిలో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉందని వివరించారు.భూమిపై జీవం ఎలా ఏర్పడిందో వివరించిన ఆయన సిద్ధాంతాలు ఎంజైమ్ కెమిస్ట్రీలో నియమాలు (Laws)గా రూపొందాయి.టిటనస్, మూర్ఛవ్యాధులకు నివారణ కనుగొని మానవాళికి మేలు చేశారు. విప్లవకారుడిగా కూడా పేరుతెచ్చుకున్న ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరి అనేక వ్యాసాల్ని రాశారు. పార్టీలోంచి బయటికి వచ్చి పిల్లల కథల పుస్తకాలు రాశారు. పరిశోధనల్లో భాగంగా భారతదేశం వచ్చి వేదాంత, ఆధ్యాత్మిక, జీవన విధానాలకు ఆకర్షితుడై 1957 నుంచి ఇక్కడే ఉండిపోయారు. మొదట కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి, భువనేశ్వర్‌లోని జెనిటిక్స్ అండ్ బయోమెట్రి లాబోరేటరీకి డైరెక్టరుగా పనిచేశారు. క్యాన్సర్ వల్ల 1964లో చనిపోయిన ఆయన పేరును కలకత్తాలోని ఓ ప్రాంతానికి పెట్టారు.-ప్రొ||ఈ.వి. సుబ్బారావు