fredrik august kekulé,ఫ్రెడ్రిక్‌ అగస్ట్‌ కెకూలే

రసాయనిక నిర్మాణాల ఇంజినీర్‌!

భవన నిర్మాణాలను చేపట్టే ఇంజినీరు కావాలనుకున్న ఓ వ్యక్తి, శాస్త్రవేత్తగా మారి అణువుల రసాయన నిర్మాణాలను ఆవిష్కరించాడు. ఆయన పుట్టిన రోజు ఇవాళే!

మీ పాఠాల్లో ఆర్గానిక్‌ కెమిస్ట్రీని చదువుకుని ఉంటారు. ఆ శాస్త్రానికి అంత ప్రాముఖ్యత చేకూరడం వెనుక ఓ శాస్త్రవేత్తను తప్పక తల్చుకోవాలి. ఆయనే జర్మనీకి చెందిన ఫ్రెడ్రిక్‌ అగస్ట్‌ కెకూలే. భవన నిర్మాణంలో ఇటుకలు, సిమెంటు పాత్ర ఎలాంటిదో, రసాయన శాస్త్రంలో పరమాణువుల, వేలన్సీ బాండ్ల పాత్ర అలాంటిది. అణువుల రసాయన నిర్మాణాలను నిర్థ్దరించడం ద్వారా కెకూలే ఆ శాస్త్ర అభివృద్ధికి ఎంతో దోహద పడ్డాడు. పరిశోధనల్లో ఆయనకు కలలు కూడా ఉపయోగపడడం ఓ విచిత్రం!

ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో కార్బన్‌ పరమాణువు ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది మిగతా మూలకాలతో సంయోగం చెందడం ద్వారా అనేక పదార్థాలను ఎలా ఉత్పన్నం చేస్తుందో కెకూలె విశ్లేషించి చెప్పగలిగాడు. ఆయన పరిశోధనల వల్ల రసాయనిక చర్యల్లో జరిగే అణుమార్పులను శాస్త్రవేత్తలు అర్థం చేసుకోగలిగారు. తద్వారా ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ అనే కొత్త శాస్త్రాలు ఆవిర్భవించాయి.

జర్మనీలోని డామ్‌స్టాట్‌లో 1829 సెప్టెంబర్‌ 7న పుట్టిన కెకూలే, తండ్రి సూచనపై ఆర్కిటెక్చర్‌ (భవన నిర్మాణ విద్య) చదివాడు. ఆపై రసాయన శాస్త్రంపై మక్కువ పెంచుకుని, ఇరవై మూడేళ్లకల్లా డాక్టరేట్‌ సాధించాడు. లండన్‌ విశ్వవిద్యాలయంలోని రసాయన పరిశోధనాలయంలో జీతం లేకుండానే కొన్నాళ్లు పనిచేశాడు. ఇరవై తొమ్మిదేళ్లకే ప్రొఫెసర్‌గా బాధ్యతలు స్వీకరించి ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పరిశోధనలు చేశాడు.

ఒక పరమాణువు, ఇతర పరమాణువులతో కలిసే సంయోగ సామర్థ్యాన్ని వేలన్సీ (సంయోగత) అని, అలా కలిపే బంధాన్ని వేలన్సీ బాండ్‌ అని అంటారు. అణువుల రసాయన నిర్మాణాలను కనిపెట్టడంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఓసారి కెకూలే బస్సులో ప్రయాణిస్తూ నిద్రలోకి జారుకున్నప్పుడు కలలో కార్బన్‌ పరమాణువులు ఒకదాని చుట్టూ మరొకటి గుండ్రంగా తిరుగుతూ సంకృత శృంఖలాలను (closed chains) పోలిన ఆకారాలలో కనిపించాయిట. ఆ తర్వాత పరిశోధనల్లో ఆయన కార్బన్‌ పరమాణువులు తమలో తామే కాకుండా మిగతా పరమాణువులతో కలిసినప్పుడు కూడా ఇలాంటి గొలుసుల బంధాలనే ఏర్పరుస్తాయని తేలింది. దీని వల్ల రసాయన చర్యల్లో పాల్గొనే పరమాణువుల బంధాలను ఫార్ములాలుగా కాకుండా తొలిసారిగా త్రీడైమన్షనల్‌ రూపంలో అర్థం చేసుకునే వీలు కలిగింది. ఇలా పరిశోధనలు కొనసాగిస్తున్న కెకూలేకు బెంజీన్‌ కొరుకుడు పడలేదు. వేలన్సీ నియమాలకు లోబడని దాని అణునిర్మాణం గురించి ఆలోచిస్తూ అలసిపోయి నిద్రపోయిన కెకూలేకు మళ్లీ కల వచ్చింది. కలలో ఓ పాము తన తోకను తానే నోటితో పట్టుకున్నట్టు కనిపించింది. దాంతో బెంజీన్‌ నిర్మాణం ఆయనకు స్ఫురించింది. తర్వాతి కాలంలో శాస్త్రవేత్తలు డీఎన్‌ఏ నిర్మాణాన్ని కనిపెట్టడంలోను, ఆవర్తన పట్టిక ఆవిష్కరణలోను కెకూలే పరిశోధనలే మార్గం చూపాయి.