John Dalton , జాన్‌ డాల్టన్

పరమాణు ధర్మాలపై పట్టు! బడిలో చదివే ఓ విద్యార్థి అందరి కంటే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. కానీ ఆ బడికే హెడ్మాస్టర్‌ కాగలడా? అలాంటి అవకాశాన్ని పొందిన బాల మేధావే జాన్‌ డాల్టన్‌! ఆయన పుట్టిన రోజు ఇవాళే - 1766 సెప్టెంబర్‌ 6న

ఇంగ్లండులో ఓ మారుమూల గ్రామంలోని ఓ స్కూల్లో హెడ్మాస్టర్‌ను నియమించడానికి ఇంటర్వ్యూ జరపాలని నిర్ణయించారు. ఆ స్కూల్లో తెలివైన విద్యార్థిగా పేరొందిన ఓ కుర్రాడిని కూడా కమిటీ సభ్యుల్లో ఒకడిగా చేర్చుకున్నారు. ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులెవరూ ఆ కుర్రాడు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దాంతో ఆ స్కూలు యాజమాన్యం ఆ కుర్రాడినే హెడ్మాస్టర్‌గా ఉండమని కోరింది. అలా తను చదివే స్కూలుకి తనే హెడ్మాస్టర్‌గా బాధ్యతలు చేపట్టిన బాలమేధావే జాన్‌ డాల్టన్‌! పెద్దయ్యాక ద్రవ్యం, పరమాణువులు, రసాయనిక చర్యలపై అనేక పరిశోధనలు చేసి పరమాణు సిద్ధాంతానికి పునాదులు వేసిన శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాడు. రసాయన శాస్త్రం అభివృద్ధికి, పదార్థాలన్నింటికీ విద్యుత్‌ ధర్మం ఉందనడానికి, అణుశక్తి వినియోగానికి డాల్టన్‌ పరమాణు సిద్ధాంతమే బాటలు పరిచింది.

ఇంగ్లండ్‌లోని ఈగల్స్‌ ఫీల్డ్‌ గ్రామంలో ఓ పేద చేనేత కార్మికుడి అయిదుగురి సంతానంలో ఒకడుగా 1766 సెప్టెంబర్‌ 6న పుట్టిన డాల్టన్‌ చిన్నతనంలోనే సైన్స్‌, గణితం, ఇంగ్లిషుల్లో పట్టు సాధించాడు. వాతావరణ శాస్త్రం (మెట్రియాలజీ)పై ఆసక్తి పెంచుకుని పరిశీలనకు కావలసిన పరికరాలను స్వయంగా రూపొందించుకున్నాడు. వాతావరణ పీడనం, ఉష్ణోగ్రత, గాలి వేగం, తేమ లాంటి విషయాలను రోజూ నమోదు చేసుకోవడాన్ని ప్రారంభించి జీవితాంతం కొనసాగించాడు. చనిపోయే చివరి రోజు వరకు ఆయన నమోదు చేసిన అంశాలు 2 లక్షల పైమాటే! స్కూల్లో పిల్లలకు చదువు చెప్పడం, తండ్రికి సాయపడడంతో పాటు లాటిన్‌, గ్రీకు భాషలు నేర్చుకున్నాడు.

ఇరవై ఏడేళ్లకల్లా కళాశాల అధ్యాపకునిగా చేరినా పరిశోధనలు మానలేదు. ఇంగ్లండ్‌లోని కొండలు, లోయలు, పట్టణాలు తదితర ఎన్నో ప్రాంతాల్లో వాతావరణాన్ని పరిశీలించి, ఎక్కడైనా గాలి సమ్మేళనం (composition) ఒకేలా ఉందని తేల్చుకున్నాడు. అలా ఆయన చేసిన పరిశోధనల ఫలితంగా 'పాక్షిక పీడన సిద్ధాంతం' (Theory of Partial Pressures) చెప్పగలిగాడు. ఆపై రసాయన చర్యలపై దృష్టి సారించి పరమాణు సిద్ధాంతాన్ని అందించాడు. పరమాణువులు ఎలా సంపర్కం చెందుతాయో తెలిపేలా మూలకాలకి డాల్టన్‌ ఏర్పరిచిన సంకేతాలకు ఇప్పటికీ ప్రాధాన్యత ఉంది.

అలాగే మూలకాలు సమ్మేళనంగా ఏర్పడే అంశానికి సంబంధించి 'నిర్దుష్ట అనుపాత నియమం' (Law of Definite proportions), బహుళ అనుపాత నియమం (Law of multiple proportions) నిర్వచించాడు. వాతావరణ పీడనాన్ని సూచించే భారమితి (Barometer), తేమని తెలిపే హైగ్రోమీటర్‌, మేఘాలు ఏర్పడే విధానాలు, వర్షపాతం, భాష్పీభవనం, తుషారస్థానం (Dew Point) గురించిన పరిశోధనలు డాల్టన్‌వే. తన పరిశోధనలకు ఎన్నో డాక్టరేట్లు, పురస్కారాలు పొందాడు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు