John Forbes Nash-జాన్‌ నాష్‌

చిన్నతనం నుంచే... గణితంలో ప్రతిభ చూపిన కుర్రాడు...పెరిగి పెద్దయ్యాక... ఆర్థిక శాస్త్రాన్నే మలుపుతిప్పాడు! ఆయన పుట్టిన రోజు ఇవాళే...13-june 1928. ఓశాస్త్రవేత్తనోబెల్‌ బహుమతి అందుకోవడం ఒక విశేషమైతే, అతడి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఆస్కార్‌ బహుమతి పొందడం మరో విశేషం. పరిశోధన, జీవితమూ కూడాఆసక్తికరమైన ఆ శాస్త్రవేత్తే జాన్‌ నాష్‌. ముఫ్పై ఏళ్లకే గణిత సిద్ధాంతాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించి ఆపై మతిస్థిమితం కోల్పోయిన జాన్‌ ముప్ఫై ఏళ్ల తర్వాత తిరిగి పూర్తిగా కోలుకుని నోబెల్‌ బహుమతిని అందుకోవడం విచిత్రం. గణిత, ఆర్థిక రంగాల్లో ఆయన సిద్ధాంతాలు మార్కెట్‌ ఎకనమిక్స్‌, కంప్యూటింగ్‌, ఎవల్యూషనరీ బయోలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎకౌంటింగ్‌ రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. రోజువారీ జీవనంలో క్రీడల నుంచి వ్యాపార, ఆర్థిక, రాజకీయ, న్యాయ, యుద్ధ, దౌత్య వ్యవహారాల్లో కొత్త కోణాలను ఆవిష్కరించాయి.

అమెరికాలోని వెస్ట్‌ వర్జీనియాలో బ్లూఫీల్డ్‌ వద్ద 1928 జూన్‌ 13న పుట్టిన జాన్‌, చిన్నతనం నుంచే గణితంలో చురుగ్గా ఉండేవాడు. ఇరవై రెండేళ్లకే 'గేమ్‌ థియరీ'నినాన్‌కోపరేటివ్‌ గేమ్స్‌ సిద్ధాంతం ద్వారా విస్తృతపరిచి పీహెచ్‌డీ సాధించాడు. ఆయన సిద్ధాంతం 'నాష్‌ ఈక్విలిబ్రియం'గా సుపరిచితం. ఆపై మెసచెసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (MIT)లో చేరి కొన్నాళ్లకే మతిస్థిమితం కోల్పోవడం విషాదకరం. ఆ స్థితిలో 30 ఏళ్లపాటు ఉండి, భార్య ప్రేమ, సపర్యల వల్ల 1990లో తిరిగి పూర్తిగా కోలుకున్న ఈయన అనేక సదస్సుల్లో గణితంపై అనర్గళంగా ఉపన్యాసాలు ఇవ్వడం విశేషం. 1994లో నోబెల్‌ అందుకుని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్త హోదాలో చేరారు.

ఆయన జీవితంపై సిల్వియా నాసర్‌ రచించిన నవల 'ఎ బ్యూటిఫుల్‌ మైండ్‌' ఆధారంగా అదే పేరుతో హాలీవుడ్‌లో నిర్మించిన చలన చిత్రానికి 2002లో ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌అవార్డు లభించింది.

-------------------------------------

courtesy : Enadu telugu news paper