Antony van Leeuwenhoek , ఆంటోనీ ల్యూవెన్‌ హోక్

సూక్ష్మలోకం చూపించినవాడు! బుట్టలల్లి జీవించే కుటుంబంలో పుట్టాడు... చదువుసంధ్యలు పెద్దగా లేవు... చిన్న వ్యాపారంతో ఉపాధి మొదలెట్టాడు... అలాంటి వ్యక్తి శాస్త్రవేత్త అయి అంతవరకూ తెలియని లోకాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడని వూహించగలమా? అతడే - ఆంటోనీ ల్యూవెన్‌ హోక్‌. 'మైక్రోస్కోప్‌'ను కనిపెట్టినవాడు. పుట్టిన రోజు ఇవాళే!1632 అక్టోబరు 24న.

కంటికి కనిపించని వాటిని కూడా చూపించే సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్‌) ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జీవ శాస్త్ర పరిశోధనలు, వైద్యరంగంలో రోగనిర్దారణ పరీక్షలు సహా అనేక రకాలుగా ఉపయోగపడుతున్న ఈ పరికరాన్ని కనిపెట్టడం ద్వారా 'మైక్రో బయాలజీ' అనే కొత్త శాస్త్ర అధ్యాయానికి తెర తీసిన వ్యక్తిగా ఆంటోనీ ల్యూవెన్‌ హోక్‌ పేరొందాడు. స్వయంగా తయారు చేసుకున్న మైక్రోస్కోపుల సాయంతో ప్రపంచంలోనే తొలిసారిగా ఏకకణ జీవుల్ని, సూక్ష్మజీవుల్ని, చర్మ నిర్మాణం, రక్తనాళికల్లో రక్త ప్రవాహం సహా అనేకదృశ్యాలను చూడగలిగాడు.హాలెండ్‌లోని డెఫ్ట్‌లో 1632 అక్టోబరు 24న బుట్టలు అల్లుకుని జీవించే కుటుంబంలో పుట్టిన ఆంటోనీ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. కుటుంబంతో ఆమ్‌స్టర్‌డామ్‌ నగరానికి వెళ్లిన అతడు ఓ బట్టల దుకాణంలో గుమాస్తాగా చేరాడు. వివాహానంతరం డెఫ్ట్‌ తిరిగి వచ్చి స్వంతంగా చిన్న బట్టల దుకాణాన్ని ప్రారంభించాడు. ఆరోజుల్లో ఉండే భూతద్దాల పట్ల ఆకర్షితుడై రకరకాల కటకాల తయారీలో ప్రయోగాలు చేసేవాడు. అలా సున్నితమైన కటకాలను రూపొందించి ఒక స్టాండుకు బిగించి మొట్టమొదటి సరళ సూక్ష్మదర్శిని (simple microscope)ని తయారు చేయగలిగాడు.ఆ మైక్రోస్కోపుతో అన్నింటినీ పరిశీలించడమే అతడి పనిగా మారింది. ఒక దశలో ఇరుగుపొరుగువారు అతడిని పిచ్చివాడిగా జమకట్టారు. ఆ పరిశీలనల వల్ల అతడు చర్మంపై స్వేదగ్రంథులను, జంతువుల కళ్లను, వెంట్రుకలను, కీటకాల నోటి భాగాలను ఇలా ఎన్నో గమనించి నోట్స్‌ రాసుకున్నాడు. మురికి నీటిలో సూక్ష్మజీవుల్ని తొలిసారిగా చూసి, వాటి జీవన విధానాన్ని పరిశీలించాడు. తన వేలిని సూదితో గుచ్చుకుని రక్తాన్ని పరిశీలించి రక్తకణాలను చూడగలిగాడు. ఈ పరిశీలనలను లండన్‌లోని రాయల్‌ సొసైటీకి పంపేవాడు. మొదట్లో నమ్మని అక్కడి శాస్త్రవేత్తలు ఆ తర్వాత అతడి పరిశోధనలు ఎంత విలువైనవో గ్రహించారు. అతడిని 'ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ'గా గుర్తించారు. ఇతడిని కలుసుకోడానికి రష్యా పాలకుడు పీటర్‌ ది గ్రేట్‌, బ్రిటన్‌ రాణివంటి ప్రముఖులు వచ్చి మైక్రోస్కోపులో చూసి ఆశ్చర్యపడేవారు.ఆంటోనీ సరళ సూక్ష్మదర్శిని తర్వాత సంయుక్త సూక్ష్మదర్శిని (compound microscope)గా రూపాంతరం చెందింది. దాని ద్వారా సూక్ష్మ జీవుల్ని 2500 రెట్లు పెద్దవిగా చూడగలిగారు. ఇప్పుడు లక్షరెట్లు పెద్దవిగా చూపించే ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపులు ఉన్నాయి.