ఆధునిక పరికరాలు లేని కాలంలోనే అంతరిక్షంలోని అద్భుతాలను ఆవిష్కరించిన ఖగోళ శాస్త్రవేత్త సర్ ఫ్రెడెరిక్ విలియం హెర్చెల్. వరుణ (యురేనస్) గ్రహాన్ని కనుక్కొన్న ఈయన పుట్టిన రోజు ఇవాళే... 1738 నవంబరు 15న.
మొదట మిలటరీలోని బ్యాండు మేళంలో పనిచేసిన వ్యక్తి, తన పరిశోధనలతో ప్రపంచంలోని మేటి ఖగోళశాస్త్రవేత్తలలో ఒకరిగా ఎదిగారు. అతడే సర్ ఫ్రెడెరిక్ విలియం హెర్చెల్. తొమ్మిది గ్రహాలలో ఒకటైన యురేనస్‌తో పాటు దానికున్న రెండు ఉపగ్రహాలను, శని, గురు గ్రహాలకు చెందిన రెండేసి ఉపగ్రహాలను కనుక్కున్నారు. స్వయంగా రూపొందించుకున్న టెలిస్కోపులతోనే ఆయన నక్షత్రమండలాల (గెలాక్సీలు) ఆకారాలతో పాటు, విశ్వం స్వరూపాన్ని కూడా అంచనా వేయడం విశేషం. దాదాపు 2500 నక్షత్ర సముచ్ఛయా (నెబ్యులా)లను, వాటికి సంబంధించిన సిద్ధాంతాలను వెలువరించారు. సూర్యుని చలన మార్గాన్ని నిర్ధరించి, పరారుణ ఉష్ణతరంగాల ఉనికిని చెప్పినది కూడా ఆయనే. ఆయన సుమారు 400కు పైగా టెలిస్కోపులను తయారుచేశారు.జర్మనీలోని హోనోవర్‌లో 1738 నవంబరు 15న జన్మించిన విలియం చిన్నప్పట్నించే వయోలిన్ వాయించడం నేర్చుకున్నాడు. తండ్రితో కొంతకాలం మిలటరీ బ్యాండ్‌లో పనిచేసి, తరువాత అన్నతో ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. కొన్నేళ్లపాటు సంగీతం మీదనే ఆధారపడి బతికిన ఇతడు తరువాత ఖగోళశాస్త్రంపై ఆసక్తిని పెంచుకుని టెలిస్కోపులతో అంతరిక్ష పరిశీలన చేసేవాడు. అలా 1781లో యురేనస్‌ను కనుగొన్నాడు. ఆ ఏడాదే కోప్లీ అవార్డుతో పాటు, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా ఎంపికయ్యారు. 'సర్' బిరుదును కూడా పొందారు. అప్పటి చక్రవర్తి జార్జి3 ఆయన్ను 'రాజ ఖగోళ పరిశీలకుడి' (రాయల్ ఆస్ట్రానమర్)గా నియమించాడు. కొద్దికాలానికే యురేనస్, శని, గురుగ్రహాల ఉపగ్రహాలను కూడా కనుగొన్నారు. చంద్రునిపై గల పర్వతాలను చూడడమే కాదు, వాటి ఎత్తును కూడా కనుగొన్నారు. ప్రతిష్ఠాత్మకమైన నైట్‌హుడ్ సహా అనేక పురస్కారాలు పొందిన ఆయన, 1822 ఆగస్టు 25న తన 84వ ఏట మరణించారు.