Charles Augustin Coulomb - ఛార్లెస్‌ అగస్టిన్‌ కూలుంబ్‌

సున్నిత శక్తులను కొలిచిన వాడు!--పాఠ్య పుస్తకాల్లో విద్యుదావేశాన్ని కొలిచే ఒక ప్రమాణాన్ని 'కూలుంబ్‌' అంటారని చదువుకుని ఉంటారు కదా? ఇది ఒక శాస్త్రవేత్తకి గౌరవసూచకంగా పెట్టిన పేరే. ఆయనే ఛార్లెస్‌ అగస్టిన్‌ కూలుంబ్‌.

విశ్వంలో ఏ రెండు వస్తువులైనా పరస్పరం ఆకర్షించుకుంటాయనే న్యూటన్‌ గురుత్వాకర్షణ సూత్రం గుర్తుందా? దాని ప్రకారం ఆ వస్తువుల మధ్య ఆకర్షణ బలం వాటి దూరంవర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఈ సూత్రాన్ని విద్యుత్‌, అయస్కాంత శక్తులకు ఆపాదించడమే కాకుండా దాన్ని నిరూపించిన ఘనత కూలుంబ్‌దే. విద్యుత్‌, అయస్కాంత రంగాల్లో విజాతి ఆవేశాల ఆకర్షణ, సజాతి ఆవేశాల వికర్షణకు ఈ సూత్రమే వర్తిస్తుందని ప్రయోగ పూర్వకంగా చూపించగలిగాడు. తద్వారా ప్రకృతిలోని ప్రధాన శక్తులు ఒకే భౌతిక నియమానికి లోబడి ఉంటాయని తేలడంతో సృష్టిలోని సారూప్యత(similarity) స్పష్టమైంది. అలాగే స్థితిశాస్త్రం (statics), ఘర్షణ (friction)లపై ఆయన సిద్ధాంతాలు ఇప్పటికీ ప్రామాణికాలే.

ఫ్రాన్స్‌లోని ఓ పట్టణంలో 1736 జూన్‌ 14న ఓ ధనిక కుటుంబంలో పుట్టిన కూలుంబ్‌ భాష, కళ, తత్వ, గణిత, ఖగోళ, రసాయన, వృక్ష శాస్త్రాలను అభ్యసించాడు. సైన్యంలోఇంజినీరుగా చేరి తొమ్మిదేళ్లపాటు రక్షణ పరికరాల నిర్మాణంలో పాలుపంచుకున్నాడు. ఫ్రెంచి విప్లవం రోజుల్లో ఆస్తినంతా కోల్పోయి పారిస్‌ నుంచి బాయిస్‌ నగరానికి వెళ్లిపరిశోధనల్లో మునిగాడు. నెపోలియన్‌ అధికారం చేపట్టాక విద్యాశాఖాధికారిగా చేరాడు. విద్యుత్‌, అయస్కాంత శక్తులపై తన సిద్ధాంతాలను నిరూపించడానికి ఆయన రూపొందించిన విమోటన త్రాసు (టార్షన్‌ బ్యాలన్స్‌) ఓ గొప్ప విజయం. ఇదెంత సున్నితమైనదంటే, గ్రాములో లక్షవ వంతుకు సమానమైన స్వల్పబలాన్ని కూడా దీంతో కనుక్కోవచ్చు. దీని సాయంతోనే విద్యుదావేశ విలోమ వర్గ నియమాన్ని (Coulomb's inverse square Law in Electricity)ని ప్రతిపాదించాడు. ఆపై అయస్కాంత ధ్రువాల విషయంలో కూడా దీన్ని నిరూపించాడు. విద్యుదావేశాన్ని తొలిసారిగా గణితాత్మకంగా చెప్పగలిగిన ఆయన పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ విద్యుదావేశానికి ప్రమాణంగా కూలుంబ్‌ పేరును పెట్టారు. ఒక ఆంపియర్‌ విలువగల విద్యుత్‌ ప్రవాహాన్ని ఒక సెకను కాలంలో మోసుకుపోయే విద్యుదావేశ పరిమాణమే 'కూలుంబ్‌'!

---------------------------------------------------------------

courtesy : Eenadu telugu daily