William Harvay

గుండె గుట్టు విప్పి చెప్పినవాడు! సంపన్నమైన కుటుంబం... విలాసవంతమైన జీవితం... అయినా ఓ యువకుడు... చదువును విస్మరించలేదు... వైద్యుడైనా పరిశోధన ఆపలేదు... అందుకు ఫలితంగా... వైద్యరంగాన్నే మలుపు తిప్పాడు!ఇప్పటి వైద్యులు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. గుండెలో కృత్రిమ వాల్వులను కూడా అమరుస్తున్నారు. కానీ నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం ఒక శాస్త్రవేత్త, గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని వివరించకపోయి ఉంటే ఈ అద్భుతాలు సాధ్యమయ్యేవి కావని చెప్పవచ్చు. హృద్రోగుల ఆయుర్దాయం పెరగడానికి దోహదపడే విషయాలు చాటిచెప్పిన ఆ శాస్త్రవేత్త విలియం హార్వే. ఆయన పుట్టిన రోజు ఇవాళే.విలియం హార్వే ఇంగ్లండులోని ఫోక్‌స్టోన్‌లో 1578 ఏప్రిల్‌ 1న సంపన్నుడైన పట్టణ మేయరుకు పదిమంది సంతానంలో ఒకడిగా పుట్టాడు. పదిహేనవ యేట కేంబ్రిడ్జిలోని సైన్స్‌ కాలేజీలో చేరాడు. ఆపై వైద్య విద్య కోసం ఇటలీలోని పాడువా వైద్య విద్యాలయంలో చేరాడు. అక్కడి నుంచి లండన్‌ తిరిగి వచ్చాక ఇంగ్లండ్‌ రాజు మొదటి ఛార్లెస్‌ కొలువులో ఆస్థాన వైద్యుడిగా నియమితుడయ్యాడు. అంతటి హోదాలో ఉన్న సంపన్నుడెవరైనా విలాసంగా జీవితం గడిపేస్తారేమో కానీ, విలియం హార్వే మాత్రం కొత్త విషయాలు తెలుసుకోడానికి పరిశోధకుడిగా మారాడు.

మానవ శరీరంపై ఆసక్తి పెంచుకున్న హార్వే అనేక జంతువుల శరీర అంతర్భాగాలను క్షుణ్ణంగా పరిశీలించి గుండె పనితీరు, రక్త ప్రసరణ విధానాలను గమనించాడు. చనిపోయిన ఖైదీల శరీరాలను అడుగడుగునా పరిశీలించడం ద్వారా గుండె ఒక పంపులాగా పనిచేస్తుందని, శరీరంలో సిరలు, ధమనుల ద్వారా రక్తం వలయాకారంలో ప్రవహిస్తుందని తెలుసుకున్నాడు. రక్తం ప్రవహించే మార్గంలో వాల్వులు ఎలా పనిచేస్తాయో కనిపెట్టాడు. మనిషి గుండె నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందో, ఎంత రక్తాన్ని పంప్‌ చేస్తుందో చెప్పగలిగాడు. తన పరిశీలనలతో రెండు అమూల్యమైన గ్రంథాలను వెలువరించాడు. వైద్య రంగానికి ఎనలేని మేలు చేసిన హార్వే పేరు ప్రతి మనిషి గుండె చప్పుడులో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.