Richard Feynman,రిచర్డ్‌ ఫేన్‌మాన్

రిచర్డ్‌ ఫేన్‌మాన్

మూడేళ్ల వరకూ మాటలే రాలేదు... ఆపై అడిగినవన్నీ ప్రశ్నలే... ఆ ఉత్సుకత వల్లనే చదువులో చురుగ్గా ఎదిగాడు... పెద్దయ్యాక ఐన్‌స్టీన్‌ తర్వాత అంతటి మేధావిగా పేరొందాడు... అతడే రిచర్డ్‌ ఫేన్‌మాన్‌! పుట్టిన రోజు ఇవాళే-1918 మే 11.

అమెరికా అంతరిక్ష నౌక ఛాలెంజర్‌ పైకి ఎగిరిన కొద్ది సేపటికే పేలిపోయిన సంగతి తెలుసుగా? 1986లో జరిగిన ఈ ప్రమాదానికి కారణం కనిపెట్టడం ఎంత కష్టమో ఆలోచించండి. ఆ పరిశోధన బృందంలో ముఖ్యుడైన రిచర్డ్‌ ఫేన్‌మాన్‌ సహేతుకమైన కారణాన్ని ప్రయోగాత్మకంగా వివరించి ప్రశంసలు పొందాడు. వ్యోమనౌకను రోదసిలోకి పంపించే బూస్టర్‌ రాకెట్‌కి ఉన్న రబ్బరు ఓ-రింగ్‌ సీళ్లే ప్రమాదానికి కారణమని గుర్తించాడు. ఛాలెంజర్‌ను ప్రయోగించే రోజు ఉదయం ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెంటిగ్రేడు కన్నా తక్కువ కావడం వల్ల సీళ్లు సంకోంచించి స్థితి స్థాపకతను కోల్పోయాయని, అందువల్ల ఇంధన వాయువు లీకయి మండడంతో ట్యాంక్‌ అత్యధిక ఉష్ణోగ్రతకు చేరుకుని బద్దలైందని చెప్పాడు. రబ్బరు సీళ్లను మంచు నీరున్న గ్లాసులో వేసి అవెలా బలహీనమవుతాయో చూపించాడు కూడా.

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో 1918 మే 11న పుట్టిన రిచర్డ్‌ ఫిలిప్స్‌ ఫేన్‌మాన్‌కు మూడేళ్ల వరకూ మాటలే రాకపోయినా, ఆపై చురుగ్గా ఎదిగాడు. బాల్యంలో ఎక్కడ పజిల్స్‌ కనిపించినా పూరించేవాడు. రేడియోల్లాంటి పరికరాలను బాగు చేస్తూ ఉండేవాడు. గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో తను చదివే తరగతులకన్నా ఎంతో ముందుండేవాడు. మెసెచ్యుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (MIT)లో డిగ్రీ పూర్తి చేశాక, పీహెచ్‌డీ చేశాడు. ఇరవై ఏళ్లకల్లా ప్రముఖ అమెరికన్‌ సైద్ధాంతిక శాస్త్రవేత్తల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు.

ద్రవ్యం (matter)పై కాంతి (light) ప్రభావాన్ని వివరించే 'క్వాంటమ్‌ ఎలక్ట్రో డైనమిక్స్‌' అంశంలో పరిశోధనకు ఫేన్‌మాన్‌ తన 47వ ఏట నోబెల్‌ బహుమతిని అందుకున్నాడు. ఈ శాస్త్రంలో ఇతడు గణితం ఆధారంగా చేసిన వివరణలు 'ఫేన్‌మాన్‌ డయాగ్రమ్స్‌'గా పేరొందాయి. ఇంకా క్వాంటమ్‌ మెకానిక్స్‌, పార్టికిల్‌ ఫిజిక్స్‌, నానోటెక్నాలజీ రంగాలలో కూడా తనదైన ముద్ర వేసిన ఈయన చక్కని అధ్యాపకుడు కూడా. ఆయన వెలువరించిన 'ద ఫేన్‌మాన్‌ లెక్చర్స్‌ ఇన్‌ ఫిజిక్స్‌' సైన్స్‌ విద్యార్థులకు ప్రామాణికం. ఆయన రచించిన 'స్యూర్‌లీ యు ఆర్‌ జోకింగ్‌ ఫేన్‌మాన్‌', 'వాట్‌ డు యు కేర్‌ వాట్‌ అదర్‌ పీపుల్‌ థింక్‌?' గ్రంథాలు ఆయనెంత మేధావో చెబుతాయి. గాయకుడు, చిత్రకారుడు కూడా అయిన ఈయన అణుబాంబు నిర్మాణ బృందంలోనూ సభ్యుడు.