Johann Gregor Mendel , జోహన్‌ గ్రెగర్‌ మెండెల్‌

జన్యు శాస్త్రానికి ఆద్యుడు!-- చిన్నప్పుడు తోట పని చేశాడు. తేనెటీగలు పెంచాడు. పెద్దయ్యాక మతబోధకుడిగా స్థిరపడ్డాడు. అయినా నిరంతర అధ్యయనం, పరిశీలనల వల్ల శాస్త్రవేత్త అయ్యాడు. ఆయన పుట్టిన రోజు ఇవాళే!1822 జులై 20నఓశాస్త్రవేత్త చేసిన పరిశోధనను ఆయన జీవించి ఉండగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆయన కనుగొన్న సూత్రాలు ఆయన మరణానంతరం ఓ కొత్త శాస్త్రం ఆవిర్భావానికి నాందిగా నిలిచాయి. వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలపై ప్రయోగాలు చేసి తర్వాతి కాలంలో 'ఫాదర్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌'గా కీర్తి పొందిన ఆ శాస్త్రవేత్తే జోహన్‌ గ్రెగర్‌ మెండెల్‌ (Johann Gregor Mendel).అప్పటి ఆస్ట్రియా (ఇప్పటి జెకోస్లోవేకియా)లోని మొరావియాలో ఓ రైతు కుటుంబంలో 1822 జులై 20న పుట్టిన జోహన్‌ గ్రెగర్‌ బాల్యమంతా తండ్రి వెంట పొలాల్లో గడిచింది. తోటలు, తేనెటీగల పెంపకంలో చురుగ్గా ఉండే అతడికి ప్రకృతి అధ్యయనం, సునిశిత పరిశీలన సహజంగానే అలవడ్డాయి. హైస్కూలు కోసం పట్నానికి వెళ్లినా తండ్రికి జరిగిన ప్రమాదం వల్ల తిరిగి రావడంతో చదువుకు ఆటంకం ఏర్పడింది.ఆపై ఉపాధ్యాయుడి సలహాపై క్రైస్తవ సన్యాసిగా మారడానికి నిర్ణయించుకుని మఠంలో చేరాడు. ఆ విధంగా 21వ ఏటనే 'గ్రిగర్‌' పేరును స్వీకరించి మఠాధిపతిగా మారాడు. సైన్స్‌ పట్ల అభిరుచితో ఎన్నోపుస్తకాలు చదివేవాడు.

మఠంలోని తోటలో బఠానీ మొక్కలపై ఉత్సుకతతో ఆయన చేసిన పరిశోధన ఫలితాలే వంశపారంపర్య సిద్ధాంతానికి (Theory of Heridity) మూల సూత్రాలుగా తర్వాతి కాలంలో పేరొందాయి. ఈ మొక్కల్లో పొడుగు, పొట్టి రకాలకు అంట్లు కట్టి, వాటిని కొన్ని తరాల పాటు పెంచి, ఏ తరానికి ఆ తరం వాటి లక్షణాలను నమోదు చేసుకుంటూ తన పరిశీలనలను సూత్రీకరించగలిగాడు. దాదాపు 30,000 మొక్కలపై ఆయన జరిపిన ప్రయోగాలే మెండల్‌ నియంత్రణ నియమం (Law of Dominance), ఖండీకరణ నియమం (Law of Segregation)గా పేరొందాయి.

మనుషుల్లో తరతరాల్లో కనిపించే పోలికలు, లక్షణాలు ఎలా సంక్రమించే అవకాశం ఉందనే విషయాలను కూడా ఈ సూత్రాలు విశదీకరించగలిగాయి.దాదాపు 30 ఏళ్ల తర్వాత వంశపారంపర్యతపై పరిశోధనలు చేసిన కొందరు శాస్త్రవేత్తలు, జోహన్‌ సూత్రాలను చదివితే కానీ తాము పొందిన ఫలితాలను అర్థం చేసుకోలేకపోయారంటే ఇవెంత ప్రాముఖ్యతను పొందాయో తెలుస్తుంది.