Robert Geoffrey Edwards,రాబర్ట్‌ ఎడ్వర్డ్స్‌

అపరబ్రహ్మకు వైద్యంలో నోబెల్‌--బ్రిటన్‌ శాస్త్రవేత్త ఎడ్వర్డ్స్‌కు(Robert Geoffrey Edwards) పురస్కారం......తానంలేని దంపతుల జీవితంలో ఆనందం నింపారు

సంతానం లేని లక్షలాది దంపతుల పాలిట కల్పతరువైన టెస్ట్‌ట్యూబ్‌ బేబీ (ఇన్‌-విట్రో ఫర్టిలైజేషన్‌) విధాన సృష్టికర్త రాబర్ట్‌ ఎడ్వర్డ్స్‌.. 2010 సంవత్సరానికి గాను వైద్యశాస్త్రంలో నోబెల్‌ బహుమతిని గెల్చుకున్నారు. 85 ఏళ్ల ఎడ్వర్డ్స్‌.. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ ఎమిరిటస్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ బహుమతి కింద ఆయన 15 లక్షల డాలర్లు అందుకోనున్నారు.పుట్టిన రోజు -27 సెప్తెంబర్ 1925.

1950 నుంచే ఎడ్వర్డ్స్‌.. ఐవీఎఫ్‌ విధానంపై గైనకాలజిస్టు ప్యాట్రిక్‌ స్టెప్‌టో (Patrick Steptoe (1913 – 1988))తో కలిసి ప్రయోగాలు నిర్వహించారు. ఈ విధానంలో ఆయన.. అండాన్ని శుక్ర కణంతో శరీరం వెలుపలే ఫలదీకరణ చేయించి, మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో వారు అనేక విమర్శలు, సవాళ్లు ఎదుర్కొన్నారు. ఇది అనైతిక విధానమంటూ మతపెద్దలు మండిపడ్డారు. వీటన్నింటినీ ఎడ్వర్డ్స్‌, ప్యాట్రిక్‌లు అధిగమించారు. వీరిద్దరి పరిశోధనలు ఫలించి 1978, జులై 25న ప్రపంచంలోనే తొలిసారిగా బ్రిటన్‌లో లూయీ బ్రౌన్‌ అనే టెస్ట్‌ట్యూబ్‌ బేబీ జన్మించింది. సంతాన సాఫల్య చికిత్స విధానంలో ఇది విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ఆ తరువాత వీరిద్దరూ.. కేంబ్రిడ్జ్‌లోని బోర్న్‌హాల్‌ ఐవీఎఫ్‌ క్లినిక్‌ స్థాపించారు. అప్పటి నుంచి వేల మంది జంటలు సంతానాన్ని పొందారు. ఎడ్వర్డ్స్‌కు నోబెల్‌ బహుమతి ప్రకటించడంపై బార్న్‌ హాల్‌ క్లినిక్‌ హర్షం వ్యక్తంచేసింది. వాస్తవానికి నోబెల్‌ బహుమతిని ప్యాట్రిక్‌ కూడా పంచుకోవాల్సింది. అయితే ఆయన 1988లో చనిపోయారు.''ఎడ్వర్డ్స్‌ సాధించిన ఘనత వల్ల సంతానలేమికి కొత్త చికిత్స అందుబాటులోకి వచ్చినట్లయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంటల్లో 10 శాతం మందికి ఈ సమస్య ఉంది. ఐవీఎఫ్‌ విధానం వల్ల దాదాపు 40 లక్షల మంది శిశువులు పుట్టారు. ఈ విధానం ఫలదీకరణ సమస్యలున్న దంపతుల్లో హర్షాతిరేకాలను నింపుతోంది'' అని నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ ఎంపిక కమిటీ స్టాక్‌హోంలో పేర్కొంది.ప్రస్తుతం ఎడ్వర్డ్స్‌ తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. బహుమతి లభించడంపై స్పందించే స్థితిలోకూడా లేరు. నోబెల్‌ బహుమతి లభించిన విషయాన్ని ఎడ్వర్డ్స్‌ సతీమణికి తెలిపినట్లు ఎంపిక కమిటీ సభ్యుడు గోరాన్‌ హాన్సన్‌ చెప్పారు. ఎడ్వర్డ్స్‌కు నోబెల్‌ దక్కడంపై అంతర్జాతీయ ఫలదీకరణ సంస్థల సమాఖ్య మాజీ అధ్యక్షుడు బాసిల్‌ టార్లాట్జిస్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ గౌరవానికి ఆయన తగిన వ్యక్తని కొనియాడారు.సంప్రదాయం ప్రకారం వైద్య విభాగంలో నోబెల్‌ బహుమతిని మొదట ప్రకటిస్తారు. ఈసారి అదే పద్ధతిని పాటించారు. మంగళవారం భౌతిక శాస్త్రంలోను, బుధవారం రసాయన శాస్త్రంలోను, గురువారం సాహిత్యంలోను, శాంతి బహుమతిని శుక్రవారం, ఈ నెల 11న ఆర్థికశాస్త్రంలో బహుమతిని వెల్లడిస్తారు. డైనమైట్‌ను కనుగొన్న వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీద ఈ బహుమతిని ఏర్పాటు చేశారు.