Stephen William Hawking , స్టీఫెన్ హాకింగ్

హాకింగ్‌ జీవితంజీవించిఉన్న భౌతిక శాస్త్రవేత్తల్లో అత్యంత ప్రతిభావంతుడిగా ప్రఖ్యాతి పొందిన హాకింగ్‌ శారీరకంగా కదలలేని పరిస్థితుల్లోనే అనేక పరిశోధనలు గావించి మహత్తర ఆవిష్కరణలు చేశారన్న విషయం తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన రాసిన 'కాలం సంక్షిప్త చరిత్ర' కోటి కాపీలు అమ్ముడుపోవడమే కాదు, ప్రజల్లో ఖగోళ భౌతిక శాస్త్రం పట్ల గొప్ప ఆదరణ పెంపొందించింది. ఈ గ్రంథం ఆధారంగా అదే పేరుతో సినిమా కూడా తీశారు. గ్రంథం మాదిరిగా సినిమా కూడా ఆదరణ పొందింది. కాలం ప్రారంభం, కృష్ణ బిలాలు (బ్లాక్‌హోల్స్‌), సింగులారిటీ వంటి విషయాలపై ఆయన పరిశోధనలు సాగాయి. 1968-70 కాలంలో ఆయన ''సింగులారిటీ థీరమ్‌'' ప్రతిపాదిస్తూ పత్రాన్ని రూపొందించారు. 1974లో పేలిపోతున్న బ్లాక్‌ హోల్స్‌లో క్వాంటమ్‌ ఎవాపరైజేషన్‌ భావాలను రూపొందించారు. దీనికి ''హాకింగ్‌ రేడియేషన్‌'' అని పేరుపెట్టారు. ఇవన్నీ చాలా గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణలు. 'కాలం సంక్షిప్త చరిత్ర'లో ఆయన పేర్కొన్న అనేక అంశాలను గణిత శాస్త్ర సూత్రీకరణల ద్వారా నిరూపించాడు. కాలం ప్రారంభంలో విశ్వ నమూనాను తయారుచేశారు. బ్లాక్‌హోల్‌ పరిశోధనలకుగాను ఆయనకు నోబుల్‌ బహుమతి రావాలి. కాని ఏ సూత్రమైనా ప్రయోగాల ద్వారా నిరూపితమైతేనే నోబుల్‌ బహుమతి ఇవ్వాలన్న నిబంధన ఉంది. హాకింగ్‌ సూత్రం ప్రయోగాత్మకంగా నిరూపించడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ నిరూపితమైనా నిరూపించిన వారికి ఆ బహుమతి అందుతుంది. అందువల్ల హాకింగ్‌కు సాంకేతిక కారణాల రీత్యా నోబుల్‌ బహుమతి వచ్చే అవకాశం లేదు. బహుమతులతో నిమిత్తం లేకుండా హాకింగ్‌ పరిశోధనలు మానవాళి ఆలోచనల్లో తెచ్చిన మార్పులు ఎనలేనిది. 1942 జనవరి 8న ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించిన హాకింగ్‌ వయస్సు ఇప్పుడు 68 ఏళ్లు. 30 ఏళ్ల పాటు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రాచార్యునిగా పనిచేశారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆయన పదవీ విరమణ చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక మనవరాలు ఉన్నారు.హాకింగ్‌ తల్లి ఇసబెల్‌ హాకింగ్‌ బ్రిటిష్‌ కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు. అందువల్ల చిన్నప్పటినుండి హాకింగ్‌కు అభ్యుదయ భావాలు అబ్బాయి. 13వ ఏట హాకింగ్‌ తత్వవేత్త, గణిత శాస్త్రవేత్త బెర్ట్రాండ్‌ రస్సెల్‌ను ఆదర్శంగా తీసుకున్నాడు. కేంబ్రిడ్జ్‌లో చదువుతుండగానే తన 20వ ఏట జేన్‌ వైల్డ్‌తో ఆయనకు పరిచయం ఏర్పడి తరువాత వివాహానికి దారితీసింది. విశేషమేమంటే జేన్‌ను కలుసుకున్న రెండు మాసాలకే 1963 ఆరంభంలో ఆయనకు ఎఎల్‌ఎస్‌ అనే భయంకరమైన నరాల వ్యాధి ఉన్నట్లు తేలింది. ఎమ్యోట్రోఫిక్‌ లేటరల్‌ స్క్లెరోసిస్‌ అనే ఈ వ్యాధి సోకినవారు రెండేళ్లకన్నా ఎక్కువ కాలం బతకరు. మహా అయితే నాలుగేళ్ల కన్నా ఎక్కువ బతికినవారు ప్రపంచంలో లేరు. కాని హాకింగ్‌కు ఈ వ్యాధి వచ్చి ఇప్పటికి 47 ఏళ్లు అయింది. ఇదో గొప్ప విషయం. ఈ వ్యాధి సోకిన వారిలో ఒక్కో అంగం క్షీణించిపోతుంది. యువకునిగా ఉన్నప్పుడు గుర్రపు స్వారీ అంటే ఇష్టపడే హాకింగ్‌ క్రమంగా కాళ్లు, చేతులు, గొంతు పడిపోయాయి. చివరికి పూర్తిగా పక్షవాతం వచ్చి శరీరం కదపలేని స్థితికి చేరుకున్నారు. ఆయన మాట్లాడలేడు. ఎలక్ట్రానిక్‌ వాయిస్‌ సింథసైజర్‌ ద్వారా మాత్రమే ఏ విషయమైనా చెప్పగలుగుతాడు.జేన్‌తో వివాహం తన జీవితాన్ని మార్చేసిందని హాకింగ్‌ స్వయంగా చెబుతాడు. 1965లో జేన్‌తో హాకింగ్‌ వివాహం జరిగింది. సాహిత్యంలో డాక్టరేట్‌ పట్టా పొందిన జేన్‌ హాకింగ్‌కు అన్ని విధాలా అండగా నిలిచారు.