Homi J. Bhabha,హోమీ జహంగీర్‌ భాభా

మన పరమాణు విధానానికి ఆద్యుడు! పరమాణు శక్తిని వెలికి తీయగలిగే సామర్థ్యం ఉన్న దేశంగా భారత్‌ను అగ్రదేశాల సరసన నిలపడానికి నాంది పలికాడొక శాస్త్రవేత్త. ఆయనే అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన భారతీయుడు హోమీ జె. భాభా! పుట్టిన రోజు ఇవాళే-1909 అక్టోబర్‌ 30న .

అది 1974 మే 18. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ప్రాంతంలో శాస్త్రవేత్తలు ఓ పరీక్ష నిర్వహించారు. విజయవంతమైన ఆ ప్రయోగం, ప్రపంచంలో న్యూక్లియర్‌ పరిశోధనలు జరిపే దేశాల సరసన భారత్‌ను నిలిపింది. ఆనాటి విజయానికి ఎన్నో ఏళ్ల ముందే బాటలు పరిచిన వ్యక్తిగా, 'భారత పరమాణు విధానానికి పితామహుడి'గా హోమీ జె. భాభా పేరొందారు. ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది.

ముంబైలో 1909 అక్టోబర్‌ 30న ఓ సంపన్న పార్శీ కుటుంబంలో జన్మించిన హోమీ జహంగీర్‌ భాభాకి చిన్నప్పటి నుంచీ పుస్తక పఠనమంటే చాలా ఇష్టం. ఉన్నత చదువుల కోసం లండన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరిన అతడికి అక్కడెన్నో అవార్డులు, ఫెలోషిప్‌లు లభించాయి. ఎలక్ట్రాన్‌-పాసిట్రాన్‌ పరిక్షేపణం (scattering)పై అతడు రాసిన పరిశోధన పత్రం రాయల్‌ సొసైటీ పత్రికలో ప్రచురితమైంది. అందులోని అంశం 'భాభా పరిక్షేపణం'గా ప్రసిద్ధి పొందింది. ఆపై కేవిండిష్‌ లేబరేటరీలో కాస్మిక్‌ కిరణాలపై పరిశోధనలు చేసి డాక్టరేట్‌ సాధించాడు.సెలవులకు భారత్‌ వచ్చిన భాభా రెండో యుద్ధం ప్రారంభమవడంతో తిరిగి ఇంగ్లండ్‌ వెళ్లలేక బెంగుళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో చేరి పరిశోధనలు కొనసాగించారు. ఆ సంస్థ డైరెక్టర్‌, నోబెల్‌ గ్రహీత సర్‌ సి.వి. రామన్‌ నేతృత్వంలో కాస్మిక్‌ కిరణాల జల్లులు (cosmic ray showers) గురించి అధ్యయనం చేయడం, మీసాన్‌ అనే కేంద్రక కణాన్ని గుర్తించడం, దాని ద్వారా ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతానికి రుజువును ఆవిష్కరించడం లాంటి విజయాలు సాధించారు. ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీగా ఎంపికయ్యారు.పారిశ్రామిక వేత్తలైన టాటాలను సంప్రందించి 1945లో ముంబైలో 'టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌'ని స్థాపించారు. స్వతంత్రం వచ్చాక తొలి ప్రధాని నెహ్రూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం దిశను నిర్దేశించే బాధ్యతలను భాభాపై పెట్టారు. ఫలితంగా 1948లో భాభా ఛైర్మన్‌గా 'అటామిక్‌ ఎనర్జీ కమిషన్‌' ఏర్పడింది. అప్పటి నుంచే దేశంలో న్యూక్లియర్‌ ఎనర్జీ పరిశోధనలు ఊపందుకున్నాయి. ట్రాంబేలో మూడు అటామిక్‌ రియాక్టర్లు, యురేనియం ముడి ఖనిజాన్ని శుద్ధి చేసే ప్లాంట్లు సిద్ధమయ్యాయి. దేశంలోని తొలి పరమాణు విద్యుత్‌ కేంద్రం తారాపూర్‌లో మొదలైంది. ఎలక్ట్రానిక్స్‌, అంతరిక్షయానం, రేడియో అస్ట్రానమీ, మైక్రోబయాలజీల్లో పరిశోధనలను భాభా ప్రోత్సహించారు. పరమాణు శక్తి శాంతియుత వినియోగంపై ఏర్పడిన అంతర్జాతీయ కమిటీలు, సదస్సులలో దేశ ప్రతినిధిగా చురుగ్గా పాల్గొనే భాభా ఓ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలవడం విషాదకర అంశం.- ప్రొ||ఈ.వి. సుబ్బారావు