అధ్యాయం - 5

||సీ.|| చాందు పాటీలు యశ్వంబుకై వెదకుచు

నీకంట పడినంత నీటివాగు

దరిని చూడమనంగ గరికమేయుచునున్న

నశ్వంబు గాంచి నానంద పడుచు

సాయిని దర్శించి సాదరంబుగ వేడె

తన గ్రుహసీమ పావనము సేయ

నేలపటక కొట్టి నీట చప్పి (దడిపి)

చువ్వ గ్రుచ్చగ నిప్పు రవ్వ లెగిసె

||గీ.|| చిలుము నంటించి పీల్చి పాటీలుకిచ్చి

కూడనేగె ధూవ్ చాందుతో కొలది నాళ్లు

తిరిగి పెండ్లి బృందము తోడ షిరిడి చేరె

సకల సద్గుణధామ జై సాయి రామ ||11||


||సీ.|| చినిగిన వస్త్రంబు చినిగిన చొక్కాయి

శిరమున బట్టయు చిన్ని కర్ర

పాదములకు రక్ష పాదుకలొప్పారు

కూర్చుండగలదొక గోనె గద్దె

మట్టి పాత్ర జలంబు మరియొక గ్లాసును

జేయ భిక్షాటనా జోలెయొకటి

కర్ర బల్ల వెడల్పు కలదొక జానెడు

పవళింపు కదిసాయి పాన్పు యగును

||గీ.|| పాడుబడినట్టి మస్జీదు వాసమయ్యె

అగ్ని నిత్యంబు ధునియందు అవధరించి

బ్రహ్మ యజ్ఙంబు జేసిన బ్రాహ్మణుండు

సకల సద్గుణ ధామ జై సాయిరామ ||12||


||సీ.|| బాయి కృష్ణాజను భక్తుడొకడు వచ్చి

బాబాను దర్శించి భాగ్యమలర

సాయినాధుని గోరె సమ్మతి, యక్కల

కోటకుం బోయి వచ్చుటకు నంత

నా మహారాజిప్పు డచ్చోట లేరయ్య

షిర్డి యందున్నారు వారు నేనె

యన బాయికృష్ణజీ ప్రణమిల్లి సాయికి

విరమించి పయనంబు విశ్రమించె

||గీ.|| పిమ్మటాతండు షిర్డికి వీలుకొలది

వచ్చి పోవుచు సాయిని భక్తి తోడ

సేవ చేయుచు తరియించె జీవితమున

సకల సద్గుణ ధామ జై సాయి రామ ||13||


||సీ.|| నింబవిటవి ఛాయ నెన్నగధ్యానంబు

దీక్షతో సల్పిన దక్షుడతడు

సాధు సజ్జన భక్త సందోహములతోడ

ఆనందకేళీ విలాస గతుల

భక్తి వైరాగ్యాది భావనాదుల తోడ

జ్ఞాన జ్యోతుల కాంతిమేనవెలయ

సంసార మను భవసాగరమీదంగ

చేయూతనిచ్చెడు చెలిమికాడు

||గీ.|| రమ్య రసరమ్య సత్కళారామ రామ

ఘన ఘనాఘన గంభీర మానసంబు

ఖండ ఖండాంతరాఖండలుండు సాటి

సకల సద్గుణధామ జై సాయిరామ ||14||


||సీ.|| నిను విమర్శించేటి నీచాత్ములకు నీవు

వక్రబుద్ధిని మాంపి సక్రమముగ

సన్మార్గ వర్తన సచ్ఛీలతలు నేర్పి

మతసామరస్యంబు మహిని నిల్పి

నీదు భక్తుల యింట నిత్య కళ్యాణంబు

లేమి యనెడుమాట లేక యుండు

నీరూప దర్శనం నిజముగ కల్గించు

శాంతి సౌభాగ్యంబు సంతతమును

||గీ.|| నీటి దీపాలు వెలిగించి నిశ్చలముగ

సాహుకార్ల మదమడంచి సాయి విభుడు

జ్ఞాన జ్యోతుల వెలిగించె మానసముల

సకల సద్గుణధామ జై సాయిరామ ||15||


||సీ.|| గురు శిష్య సంబంధ గూఢార్ధమును జెప్ప

శిష్యుడై జౌహర్కు షిర్డి విడచి

రాహాతలో నహరహము కపట గురు

సేవలు చేయుచూ, షిర్డి జనుల

కోరిక మేరకుం గురునితో పాటుగా

షిర్డి జేరిన యట్టి సిద్ధ పురుషు

సేవించి, జౌహర్ను దేవిదాసు కడకు

గొంపోవ నచ్చోట గుట్టు విడెను

||గీ.|| వాదమున నోడి జౌహరు పారిపోయి

అనతి కాలాన గనంపు గొని సాయి మహిమ

తిరిగి వేడెను శరణంబు షిర్డి విభుని

సకల సద్గుణ ధామ జై సాయిరామ ||16||

అధ్యాయం - 6