అధ్యాయం - 47
||సీ.|| ఉదయంబు వాహ్యాళి నదియొడ్డు నొకనాడు
చేరి స్నానము చేసి చెట్ల నీడ
చిలుము చేయుచు నుండ చెంతకొచ్చె నొకండు
వెలిగించి నాకిచ్చె చిలుము నపుడు
బెకబెక శభ్ధంబు వినివాడు ఏమది
యనునొక్క మండూక మనుభవించు
కర్మ ఫలము పూర్వ జన్మ సంచిత మన్న
బోయి జూడగ సర్ప మోకటి దాని
||ఆ.వె.|| పట్టి మ్రింగుచుండ పరుగున వాడొచ్చి
చెప్పి నంత నేను చేరి యటకు
రక్షకుండ దాని భక్షింప నెట్లోర్తు
ననుచు పలికె సాయి ఆత్మ విభుడు ||204||
||సీ.|| నీకు పశ్చాత్తాప మేలేద సర్పమై
ఓ వీర భద్రప్ప ఓపు మింక
నీ శత్రువగు చెన్న బసవప్ప నీ కప్ప
జన్మనైనను వీడి జాలి చూపు
మనుటయే తడవుగా నా సర్ప మా కప్ప
వీడి నీట మునిగి వేడలి పోయె
కప్పయు పొదలోకి గంతులేయుచు పోయె
నదియెల్ల గమనించి నాత డపుడు
||ఆ.వె.|| బాబ నడిగె దీని భావమేమని యంచు
వినుట కాత్ర పడుచు వివరములను
చిలుము పీల్చి సాయి నీడను జేరి
చిత్రమైన కథను చెప్ప దొడగె ||205||
||సీ.|| మా యూరి చెంతను మహదేవునాలయం
బాడు పడగ గ్రామ ప్రజలు దాని
బాగు చేయగ దల్చి తగ ప్రోగు చేసినా
ధనమంత నా యూరి ధనికు చేత
కోరి వారందరూ కోశాధి కారిగా
నియమించి పెట్టిరి న్యాయముగను
పరమ లోభి యగుట మరమత్తులకు నందు
తక్కువ వెచ్చించి తక్కినదియు
||ఆ.వె.|| తనదు కోశ మందు తగ దాచు కొనినాడు
గ్రామ వాసులంత కలసి వాని
లెక్కలడుగ తప్పు లెక్కలు జూపించె
ననుచు పలికె సాయి ఆత్మ విభుడు ||206||
||సీ.|| మరికొంతవిత్తమ్ము మరలవసూల్జేసి
చెప్పిరిటులవాని చేత పెట్టి
వెచ్చించి ఈ ధనం బెటులైన మందిర
మభివృద్ధి గావించు మనుచు వెడలె
పుచ్చుకొని ధనమ్ము పూర్వ రీతినియుండె
ఇల్లాలి కలలోన ఈశ్వరుండు
గుడికి కట్ట మనెను గోపుర మద్దాని
కిత్తునూరింతలు విత్తమనుచు
||తే.గీ.|| స్వప్నదృశ్యంబు వినివాడు భార్యతోడ
అట్టి కలనాకు రాలేదనంచు పలికి
ఉత్త స్వప్నంబు అదినమ్మ గూడదనెను
సకల సద్గుణ ధామ జై సాయిరామ ||207||
||సీ.|| నేల పవిత్రమ్ము గాలి పవిత్రమ్ము
నీరు పవిత్రమ్ము నిప్పు గూడ
పాంచ భౌతిక మైన పావన దేహంబు
నాశ్రయించెడి అంతరాత్మ కూడ
పరమ పవిత్రమ్ము పరగ నీ బుధ్దియు
నఙ్నాన మనసు నహంబు లనెడు
పంచేంద్రియంబులు వంచించు చుండును
వాటి నదుపులోన పెట్టు కొనుము
||ఆ.వె.|| నీదు ధర్మ బుధ్ది నిన్ను రక్షించును
నీదు దుష్ట బుధ్ది నిన్ను చెరచు
వక్ర బుధ్ది నీదు వంశంబునకు చేటు
సకల సుగుణ శీలి సాయి రామ ||208||