శ్రీమన్మహాదేవి శ్రీ పార్వతీ దేవి
దివ్య కారుణ్య వారాశి శ్రీరాశి లక్ష్మీ మహోల్లాసీ దేవీ,
ఉమాశంభు రాణి మహాదేవనుతీ,
సదాచంద్రకాంతీ జగద్ధాత్రీ,
నీకీర్తి వర్ణింపగా శక్యమే!!
చిలకలా కులుకవే కులుకులా చిలకవే వెన్నెలా మొలకవే మేలు శృంగార పూబంతివే
పల్లవాపాణివే బంధురశ్రేణివే ఎల్లలోకాలకున్ దల్లివే,
భాగ్య పూగొమ్మవే నీవు మా అమ్మవే
నిన్ను నీగల్మీ నీబల్మిలో నెంచినన్
ఆడితే తప్పవే, మెచ్చితే ఇచ్చినన్
శాశ్వతంబైన భోగంబు భాగ్యంబు నానందమున్ దెచ్చి మాకిత్తువే
మమ్ము గాపాడవే శుద్ధిగా కోరు మా కోర్కెలన్ దీర్పవే
నేర్పునన్ సన్మంగళాకారి మందార మందార వల్లి
భవత్పాదపద్మంబులన్నమ్ముటంగాదె
శ్రీ రుక్మిణీ సత్యభామాది నారీమణుల్ పుణ్యకాంతామణుల్
గాక పేరొంది కోర్కెలన్ గడుమున్ మేలొందినారమ్మ
దక్షధ్వంసంబునకు పార్వతీ దేవివై లోకముల్గావుటంజేసి
మాయందరున్నిన్ను గొల్వంగ నీ పూజసేయంగ
నీపాద పద్మంబులన్నమ్మి యున్నాము
ముమ్మాటికిన్సత్యమోయమ్మ బ్రోవంగ రావమ్మ
జై లోకమాతా దయాభూత సంపత్కరసమేత
మహేశ్వరీ కృపారాశి కామేశ్వరి దేవీ
మమ్మున్ గృపంజూడు దయాంభోనిధి,
కృపాకల్పవల్లీ దేవీ నమస్తే నమస్తే నమోన్నమః