అధ్యాయం - 42

||సీ.|| సెప్టెంబరిరువది యెన్మిది పందొమ్మి

దొందల పదునెన్మిదొక్క సారి

జ్వరమొచ్చె కొంచెము బాబాకు నయ్యది

రెండు మూడు దినములుండె గాని

వదలి భోజనమును బలహీనుడైనాడు

పదియునేడవ రోజు పర్వదినము

నాడు విజయ దశమ పరాహ్ణమున రెండు

ముప్పది నిమిషాల కుర్వివీడి


||తే.గీ.|| చనియె నూర్ధ్వలోకాల గతిని చరించి

బాబ భౌతికకాయంబు వదిలె ననెడు

మాట కార్చిచ్చు వలె ప్రాకె నోట నోట

సకల సద్గుణ ధామ జై సాయి రామ ||174||


||సీ.|| నిర్యాణ సమయంబు సాయి సూచించెను

ఇరువత్సరంబుల కరయ ముందు

నొక విజయ దశమి సకల జనులు చేరి

గ్రామ సీమోల్లంఘనమ్మొనర్చి

వచ్చిన వారిపై బాబా హఠాత్తుగా

కోపించి తీసి లంగోటి, కఫని,

తలగుడ్డ, లనుచించి తగమండుధునివైచి

హెచ్చిన కనుదోయి నిల్చియరిచె


||తే.గీ.|| తరచి జూచి నన్ను తగ హిందువో మహ్మ

దీయ కులమువాడొ తేల్చ మనగ

బాబా గాంచి జనులు భయముతో వణకిరి

సకల సుగుణ శీలి సాయి రామ ||175||


||సీ.|| సాహసించగలేక సాయి దరికి చేర

మిన్న కుండి రచట జనము లెల్ల

భాగోజి యను కుష్ఠు రోగ భక్తుడు లేచి

లంగోటి కట్టి యిట్లనియె బాబ!

గ్రామ సీమోల్లంఘనము నాడిదేమనంగ

పటకాను నేలపై కొట్టి చెప్పె

నాదుసీమోల్లంఘనమ్మీ దినంబంచు

కోపించ వివశులై కూర్మితోడ


||తే.గీ.|| చావడుత్సవమెట్లు చేయవలెననగ

శాంతి జెందెను యంతనుత్సవము జరిగె

గాని కనరైరి సాయి సూచనలు వారు

సకల సద్గుణ ధామ జై సాయి రామ ||176||


||సీ.|| నిత్య సేవలు జేయ నీకు లక్ష్మీబాయి

ఏమిపుణ్యము చేసె నేమియెఱుక

తొమ్మిది నాణేలు పిమ్మటిస్తివి నీవు

నవవిధి భక్తికి నిర్వచనము

బాయజా సేవకూ బదులుగా మనసాయి

తాత్యాను బ్రతికించి తాను వెడలె

బూటి కలలు కన్న మురళీధరాలయం

సాయికి నిలయంబు సన్నుతింప


||ఆ.వె.|| మురళి ధరుడువీవె ముమ్మూర్తులా సాయి

దయను జూపి మమ్ము ధర్మ పథము

నందు నడచు నటుల నర్ధించు చున్నాము

సకల సుగుణ శీలి సాయిరామ ||177||


||సీ.|| సర్వ జీవవ్యాపి సచ్ఛిదానందుండు

తనదు చర్యల ద్వార తగిన రీతి

నీతి బోధించుచు నిత్య జీవితమున

ఆధ్యాత్మ తత్త్వసారంబు తెలిపె

ప్రేమతో లక్ష్మియు పెట్టిన రొట్టెను

తినకుండ పెట్టె నోశునకమునకు

కినంక బూనిన లక్ష్మి కెరిగించె సాయంత

ప్రాణులు వేరైన యాకలొకటె


||తే.గీ.|| చేరియాకలి గొన్నట్టి జీవి కొసగు

ఓగిర మదియె నీకిచ్చు నుత్తమ గతి

యన్న సత్యమ్ము బోధించె నందరికిని

సకల సద్గుణ ధామ జై సాయి రామ ||178||


అధ్యాయం - 43,44