అధ్యాయం - 2
||సీ.|| శ్రీపదంబులవాలు పీడితులంబ్రోవ
వెలసితి వీషిర్డి పురమునందు
జనుల బాధలు దీర్ప జయ సాయి వైనావు
భవ్య రోగాలన్ని పారదరిమి
సంకట స్థితియందు శంకరుండైవచ్చి
గాచిరక్షించినా ఘనుడవయ్య
శ్రద్ధయు సహనంబులతి ముఖ్యమనియంచు
యుక్తిగా జెప్పి తాయునికిచాటి
||గీ.|| మూఢులన్ గాచి రక్షింపవేడుకొనగ
షిర్డి వాసుల సేవకై పరిఢవించి
విశ్వమానవ కళ్యాణ వీధి వెలయు
సకల సద్గుణధామ శ్రీసాయిరామ ||3||
|| సీ.|| మాయశక్తి యనంతమా మాయ శక్తిన
ధిగమించ తరముగా దిల నెవరికి
మాయలోనే పుట్టి మాయలోనే పెర్గి
మాయ యందే లీనమగును మనిషి
పరగ బ్రహ్మకునైన నరయ శక్యముగాదు
మానవు లేపాటి మాయ ముందు
బడుగు జీవులెటుల బ్రహ్మైక్యయోగము
అష్టాంగ యోగంబు లాచరించు
||గీ.|| భక్త వశవర్తి భగవంతు పాదములను
భక్తి తోడ పూజింప నీ శక్తి పెరిగి
మాయ దాటంగ తోడ్పడు మహిని నేడు
సకల సద్గుణ ధామ జై సాయి రామ ||4||