అధ్యాయం - 48
||సీ.|| న్యాయ పరీక్ష కధ్యయనంబు గావించు
విద్యార్ధులకు మధ్య వాద మందు
షిరిడి సాయి మహిమ షేవడే వివరించి
వారి ఆశీర్వాద బలము చేత
తన కృతార్దత నిశ్చితంబని తెల్పగా
స్నేహితుండగు సపత్నేకరంత
వాని తో పాటు బాబ నవహేళన జేసె
పిదప దినంబులు పదియు గడచె
||ఆ.వె.|| సాగె న్యాయ వృత్తి సంసార మది సాగె
పుత్రు డొకడు కల్గి పితరు డయ్యె
గొంతు వ్యాధి తోడ కొమరుని గోల్పోయె
చింత తోడ చిత్త శాంతి బోయె ||209||
||సీ.|| చిత్త శాంతి కొరకు క్షేత్రముల్దిరుగగా
కడకు నొక్క దినము కదిలె మదిని
అలనాడు తనమిత్రు డన్న మాటలు బట్టి
సాయి మహిమ దల్చి పయన మయ్యె
పత్నీ సమేత సపత్నేకరుడంత
సాయిని దర్శించి శాంతి బడసె
మొదట బాబా వాని పొమ్మని కసిరినా
చేరదీసి పిదప చింత దీర్చె
||ఆ.వె.|| తప్పు గతము నందు తనవల్ల ననిదెల్సి
భక్తి ఇనుమ డించె బాబపైన
పొందె మరల తనదు పోయిన తనయుని
సకల సుగుణ శీలి సాయిరామ ||210||