అధ్యాయం - 25
||సీ.|| పత్తిలో జట్టి వ్యాపార భాగస్తుండు
గాలబ్ధి పొందంగ వలయునంచు
మిత్రుడొకడు వ్రాయ పత్రమత్తరి బాబ
సలహాను వేడగా శ్యామకంపె
దాయొక్క పత్రమద్దాని సాయికి జూప
నాకాశముకెగుర నాశతగదు
దైవమిచ్చినది సదా తృప్తి కొరకు గా
న జదువుమన లేఖనదియెకలదు
||ఆ.వె.|| సర్వ మెరిగి మమ్ము సోధించగానేల
కావుమయ్య దాము కరుణతోడ
నిన్ను కోరె సలహ నిర్ణయంబికనీదె
సకల సుగుణ శీలి సాయి రామ ||42||
||సీ.|| ఆయాస పడవద్దు నార్జించ లక్షలు
లోటన్నమాటాతడింట లేద
నియు చెప్పగా శ్యామ వ్రాయగా నొకపరి
లేఖ జూచిన దాము వికలమైన
మనసు దిటవు జేసికొని తానె బాబతో
స్వయముగా మాట్లాడ రయమునేగి
షిర్డి బాబ పాదసేవ చెయుచునంత
రంగాన వ్యాపార లాభమందు
||తే.గీ.|| కొంత యివ్వగా మది దల్చి నంతలోనె
ఇష్టపడలేను ప్రాపంచ విషయ వాంచ
లందగుల్కొనంగన దాము వదిలె నాశ
సకల సద్గుణ ధామ జై సాయిరామ ||43||
||సీ.|| జనన మరణంబుల చక్రంబు నుండి త
ప్పించి మాకిహపరంబిచ్ఛు వాడు
ఇంద్రియ మనములనిచ్చా ప్రవృత్తి నుం
డి మరల్చి భక్తి భావమ్ము కలుగ
జేసెడి వాడు దుశ్చేష్టలయందు వి
రక్తి కల్గించి యాసక్తి పెంచి
ధ్యానంబు నందు తదనుగుణంబుగ మార్చు
సద్గురు సాయికి సాటి గలరె
||తే.గీ.|| జన్మ జన్మాంత కృతపాప కర్మ ఫలము
పరిహరించి కామితములత్తరి నొసంగి
సర్వదా భక్తుల క్షేమ మరయు చుండు
సకల సద్గుణ ధామ జై సాయి రామ ||44||