అధ్యాయం - 32

||సీ.|| అశ్వత్థ వృక్ష సాదృశ్య సంసారంబు

దాని నధిగమింప దారి జూపు

సద్గురుండవుసరంబగునన్న సత్యంబు

బాబాతనయనుభవంబు తెలిపె

పండితుల్నల్వురుం భగవదన్వేషణ

కడవులందిరుగుచు నడ్డదారి

నొకవర్తకుడు మమ్ముల కలసి యెటుపోవు

చుంటిరే పనిమీద నుంటి రనగ

||ఆ.వె.|| యడవి వెదుకమేము యరుదెంచినామంచు

ఎందుకోసమన్న దేమి లేదు

యనగ ధ్యేయరహతయన్వేషణదియేల

సకల సుగుణ శీలి సాయి రామ ||79||


||సీ.|| అతడు కనికరించి యడవుల సంగతి

వివరంగ తెలియక వెంటనెవరు

లేక యిచ్ఛారీతి నేగరాదొక మార్గ

దర్శి కావలె మీరహస్య మేమి

చెప్పనక్కరలేదు చేయుడు భోజనం

విశ్రమించిన పిదప దిరుగవచ్చు

మృదువైన వాక్కులు వృధ చేసి పోతిమి

దారితప్పటునిటు తిరిగి బయలు

||ఆ.వె.|| దేరినచటి కేగు దెంచితి మెటులనో

వర్తకుండు మరల వచ్చి కలిసి

యుత్త కడుపు నేమియుపలబ్ధి కలుగనెన్

సకల సుగుణ శీలి సాయిరామ ||80||


||సీ.|| వడ్డించు విస్తరిన్వలదని ద్రోయుట

ధర్మముగాదు పదార్ధములను

యర్పించ శుభమగునను సూక్తి పాటించి

తినుడని బతిమాల తిరిగి మువ్వు

రటులె పోవగ జూడ యాకలితోనుంటి

బంజార ప్రేమకుం బరవశించి

పెట్టిన భోజనం బ్రీతిగా భుజియించి

నీరు ద్రాగంగ మాగురువు గారు

||ఆ.వె.|| యచట నుండ జూచి యాశ్చర్యపడునంత

విషయమడుగ నేను విశదపరచ

విశ్వసించి రండు విజయంబు కలుగనెన్

సకల సుగుణ శీలి సాయి రామ ||81||


||సీ.|| తక్కిన మువ్వురు తమదారి పోవంగ

గురునాజ్ఞతలదాల్చి వారికపుడు

గౌరవంబుగ నమస్కారంబు చేయగా

వచ్చిరి తోడ్కొని బావికడకు

కట్టికాళ్లను రెండుచెట్లకు త్రాడుతో

వ్రేలాడ తలక్రిందు వేగులాడ

నీటిమట్టముపైన నీరందకుండంగ

సరిమూడు యడుగుల దూరముంచి

||ఆ.వె.|| యాగివచ్చి రపుడు నాల్గైదు గంటలు

యనిరి పైకి దీసి యున్న దెటుల?

సంతసంబు ననగ సంతుష్టి చెందిరి

సకల సుగుణ శీలి సాయి రామ ||82||


||సీ.|| చేతవీపును దట్టి చేర్చి వారిబడిని

చేరి నాతల్లితండ్రి మరచిపోతి

నాకు వేరే స్పృహలేకనే పోయె నా

యభిమానమావిరై యాత్మజ్ఞాన

ముదయించె నింద్రియమ్ములు కేంద్రీకృతములై

నేత్రాంచలములందు గురుని దివ్య

రూపదర్శనమున యపురూపయానంద

యనుభూతి పొందితి యచట నేను

||ఆ.వె.|| జ్ఞాన భక్తి కర్మ ధ్యాన యోగాదులు

మనకు నేర్పి దైవ మందు చేర్చు

గురువులందు బోధ గురువులు వేరయా

సకల సుగుణ శీలి సాయి రామ ||83||


||సీ.|| భుక్తి కొరకు నాడు పూర్వాశ్రమంబున

వెదకుచు బీద్గాము వెళ్లినపుడు

బట్టపై నల్లిక పనిదొర్కె కష్టించి

చేసినంతెజమాని చేరదీసి

మునుముగ్గురికి నిచ్చు మొత్తమంప్ కు రెట్టింపు

నాకిచ్చె నాతండు నారునూర్లు

నిండు దుస్తుల నివ్వ వాడకుండుంచితి

ఎవరిచ్చునదిగాని దైవమిచ్చు

||ఆ.వె.|| దాన పోల్చలేము దేనినైనను నాదు

ప్రభువు తీస్కొనమన ప్రజలు నన్ను

తెమ్ముతెమ్మననుట తెల్వితక్కువ గాదె

సకల సుగుణ శీలి సాయి రామ ||84||


||సీ.|| ఎవరని పిల్చేను శివశంకరుండనా

శిగపైన లేదాయె శిరుల గంగ

మెడలోన కనరావు మేటి పన్నగములు

తలపైన కనరాడు కలువరేడు

ఆదివిష్ణువనంగ నటలక్ష్మిలేదాయె

శంఖు చక్రాదుల జాడలేదు

పవళింప శేష తల్పంబు లేదచ్చోట

జానెడు బల్లయే పానుపయ్యె

||ఆ.వె.|| ఉండనిల్లు లేదు యునికి మసీదులో

ఊదితోనె యొరుల నుద్ధరించు

జనుల హృదయమందు చక్కగా నెల్కోన్న

సకల సుగుణ శీలి సాయి రామ ||85||


||సీ.|| ఉత్తకడుపునజేయు పనులేవైననూ

సఫలీకృతముగావు,నుపవసింప

బనిలేదు యెవరికీ యను సూక్తి దెల్పుచూ

ఉపవాస దీక్షతో నున్న గోఖ

లేగారి భార్యను విరమింప జేసి దా

దాభట్టు నింటిలో బొబ్బటులను

జేసి పిల్లలకిచ్చి వాసిగా భుజియింప

మని జెప్పి నోదార్చి యనియెనిటుల

||ఆ.వె.|| శక్తిలేక మనిషి భక్తి సాధనమెట్లు?

శక్తి ఎటుల కలుగు భుక్తిలేక

భుక్తితోడ జీవ శక్తులు పనిజేయు

సకల సుగుణశీలి సాయిరామ ||86||


అధ్యాయం - 33