అధ్యాయం - 40
||సీ.|| భక్తితో పిలచిన భక్తుల యిండ్లకు
ఏ రూపముననైన ఏగినీవు
వారి కోర్కెలు దీర్చి వారి చింతలుబాపి
వారి పూజలనంది వారికెరుక
లేకుండవచ్చినా లీలావినోదంబు
గాధలై వ్యాపించె వీధివీధి
దేవుగారింటిలో నుద్యాపనకు నీవు
సన్యాసి వేషాన సద్దుగాక
||తే.గీ.|| ఇంకనిద్దరతోడ్కొని దేవు ఇంటి
భోజనంబులు జేసినా పోల్చలేక
నిందవేయ చెప్పితి వీవు నీదులీల
సకలసద్గుణధామ ఓం సాయిరామ ||152||
||సీ.|| మదిమది నివసించు మనసుల పులకించు
శివశివనీలీల లెవరెరుంగు
నిగనిగలాడేటి నిండైన విగ్రహం
సరిసరిగాంచిన సమయు బాధ
సిరిసిరినగవుల సిరులెన్నొ కురిపించు
యుగయుగముల మేటి యోగిరాజు
మరిమరితలవగా నరమరికలు లేక
బిరబిర యరుదెంచి వరములొసగు
||తే.గీ.|| గరగరనిమేను కమనీయ గాత్రమలరు
మిలమిల మెరయు కన్నుల మేలి చూపు
అణువణువు వెలసిన సాయి ఆత్మభవుడు
సకల సద్గుణ ధామ జై సాయి రామ ||153||
||సీ.|| తనతల్లి చేయు నుద్యాపనంబుకు సాయి
కాహ్వానముగ జోగుకంపె లేఖ
చదువ జోగది విని సాయి నన్నెప్పుడూ
గుర్తుంచుకొని బిల్చు భక్తు లెంత
దూరాన యున్ననూ పరిగెత్తి పోయెద
వలదు నాకే రైలు బండి టాంగ
యు విమాన మీవు నేనును ఇంకొకరు కల్సి
వచ్చెదమన జోగు వ్రాసె లేఖ
||తే.గీ.|| చదివి యానంద పరవశమొందె దేవు
సాయి రాహాత నీమగాం రుయిని దాటి
పోరు ప్రత్యక్షముగయంచు వారి కెరుక
సకల సద్గుణ ధామ జై సాయి రామ ||154||
||సీ.|| ఏ రూపముననైన యేగ సమర్ధుండు
సాయి సర్వాంతర యామితాను
ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా
ధరియించి బెంగాలి వస్త్రములను
సన్యాసి వెడలె గో సమ్రక్షణార్ధమై
చందా వసూళ్ళకోసంబు దహను
స్టేషను మాస్టరు చెంత చేరియడుగ
యూరిలో మామల్తదారునడిగి
||తే.గీ.|| చేయ చెందా వసూళ్లని చెప్పు చుండ
మామలతదారటకు రాగ మాస్టరతని
దేవుకు పరిచయ మొనర్చ నిర్వురపుడు
సకల్ సద్గుణ ధామ జై సాయి రామ ||155||
||సీ.|| కూర్చుండి మాట్లాడుకొనుచుండ నేదియో
వేరొక చందాను యూరిలోన
రోత్తమ శెట్టి యన్నతడు నడుపు చుండ
ఇంకొకటిప్పుడే వేయ పాడి
గాదు నాల్గునెలల తదుపరి రమ్మన
పోయి నెల దినంబులయిన పిదప
దేవింటి ముందర దిగె టాంగలో వచ్చి
చెందాల కనిదేవు సంశయింప
||ఆ.వె.|| కుడువ భోజనంబు కోరి వచ్చితి చంద
వలదనంగ పల్కె స్వాగతంబు
యున్నరిద్దరింక యనగ రమ్మనెగూడ
సకల సుగుణ శీలి సాయి రామ ||156||
||సీ.|| పంపవలె నెటకు వారి కొరకనగ
స్వయము వచ్చెదమేము పనుపవలదు
పండ్రెండు గంటల్కు సరిగ దేవని నట్లు
వచ్చి మువ్వురు భుజియించి వెడలె
ఉద్యాపనయినాక యుత్తరంబును దేవు
వ్రాసె జోగుకు సాయి మోసగించె
ననుచు, జోగు చదివి వినిపించ సాయికి
పోతి సంతర్పణ భోజనముకు
||తే.గీ.|| మువ్వురము భుజియించినా దేవు పోల్చ
లేక మాట తప్పితినంచు వేసె నింద
మాటకై ప్రాణము ఫణము పెట్టెదనిన
సకల సద్గుణ ధామ జై సాయిరామ ||157||
||సీ.|| బాబ చెప్పినదంత వ్రాసె దేవుకు జోగు
ఆనందపడె దేవు దాని చదివి
ఇద్దరితో గూడి యింటి కొచ్చిన గూడ
నెరుగక నిందను వేసి తంచు
చేరి పశ్చాత్తాప చిత్తుడై, సన్యాసి
మొదటి రాకచె తాను మోసపోయి
పిదప నిద్దర గూడి విచ్చేసి భుజియించి
నాపోల్చ లేదంచు తపన చెందె
||ఆ.వె.|| సద్గురువును భక్తి శరణువేడిన వారి
ఇంటను శుభ కార్య మేదియైన
జరుగు సవ్యముగను సాయి దీవెనతోడ
సకల సుగుణ శీలి సాయి రామ ||158||
||సీ.|| ఓంసాయి శ్రీసాయి జైసాయి జగదీశ
నిర్మొహత్వవతార నిష్కళంక
హరసాయి శుభసాయి ధర కల్పతరుసాయి
వరదాన గుణశీల పాపనాశ
సురసాయి మహిసాయి సుకుమార గుణసాయి
వ్యాధుల సమసింప వైద్య సాయి
సామజవర సామ్య సాధు సమ్రక్షక
నింబ విటపి ఛాయ నిత్య వాస
||తే.గీ.|| అష్ట సిద్ధులతో నిల నవతరించి
బాధలందాదుకొనునట్టి బాబనీకు
కామధేను కల్పతరులుంగావుసాటి
సకల సద్గుణ ధామ జై సాయి రామ ||159||
||సీ.|| వేకువ ఝాము కంపించి పంతుకు హోళి
పండుగ నాడు బాబా స్వయముగ
నిద్ర లేపియు చెప్పె నీయింట భుజియింప
వచ్చెదన్న నిజము లేచి చూడ
బాబజాడయెలేక భార్యతో చెప్పెనో
సన్యాసి వచ్చు భోజనము కనగ
వచ్చు నెచటి వారెవరనగ పెడదారి
పట్టించ కామెతో వచ్చుబాబ
||తే.గీ.|| యనుచు స్వప్నంబు వివరించ నామె మదిని
పిండి వంటలెన్నొ శిరిడి విడిచి సాయి
బాంద్ర కొచ్చునా! సందేహ పడదొడంగె
సకల సద్గుణ ధామ జై సాయి రామ ||160||
||సీ.|| సందేహ పడుచున్న సతికి హేమాడ్పంతు
పంపవచ్చు బదులెవ్వరినియైన
కొంచెమెక్కుడు వండ కొరతేమి లేదనంగ
పతిచెప్పి నట్టుల వంటజేసె
హోళి పూజయ్యె విస్తళ్లు వేసిరపుడు
పంక్తులు రెండుగా వరుసలందు
పెట్టిరి ముగ్గులు పీట నమర్చిరి
బాబ కొఱకు మధ్య భాగమందు
||ఆ.వె.|| వడ్డనయ్యె దాటె పండ్రెండు గంటలు
జూసి యతిధి కొరకు మూసి తలుపు
యన్న శుద్ధి చేసి నైవేద్య మర్పించె
సకల సుగుణ శీలి సాయి రామ ||161||
||సీ.|| అట్టి సమయమున మెట్లపై సవ్వడి
విని దల్పుతీయ కంపించినారు
ఇద్దరు వ్యక్తులలీమహమ్మదునుమౌ
లాన యుస్ము ముజాఫరనెడి వారు
ఇది నీదు వస్తువు తీసుకొమ్మనుచును
పటమొండు బల్లపై పెట్టినారు
గాంచి హేమాడ్పంతు తెర్చి సాయిని జూచి
కరిగె మనసు కంట కారె నీరు
||ఆ.వె.|| దేహమదిరె బాబ దివ్యపాదములకు
వంగి మ్రొక్కి యెట్లు పటము వచ్చె
ననగ దాని కొంటి మంగడిలోనన్న
సకల సుగుణ శీలి సాయి రామ ||162||
||సీ.|| కనిపెట్టుకొని యుండ్రి జనులంత భోజన
శాల గాన తగిన సమయమందు
వివరించెదము వేగ వెళ్లుడనగ
నభినందనలుదెల్పి యరిగె నపుడు
పటము బాబాయొక్క పీటపైబెట్టియు
వడ్డించి వంటకాల్భక్తితోడ
నైవేద్యమునుబెట్టినాకందరు భుజించి
యానంద పరవశులైరి జనులు
||ఆ.వె.|| ఈవిధముగనట్లు యీవింత జరిగెను
సాయి పంతు కెటుల స్వప్నమందు
తనదు మాట జెప్పె తానిల్పు కొనెనిట్లు
సకల సుగుణ శీలి సాయి రామ ||163||