అధ్యాయం - 45
||సీ.|| హృదయ పుర్వకము దేహేంద్రియములతోడ
మనము బాబాయందు వినయమొప్ప
సేవానిరతితోడ సేయు ధ్యానముగాని
పూజగాని పరమ పుణ్య ప్రదము
యాత్మ శుద్ధితొ పరమాత్మ, భక్తిగొలువ,
స్వీకరించును నీదు సేవలన్ని
యిందేదియును లయ మొందింపలేనిచో
ధ్యానంబు పూజయు వ్యర్థమగును
||ఆ.వె.|| వరలు నీదు భక్తి వరశిరో హంసంబు
భగవదైక్యమొందు భక్తులెపుడు
భేషజంబులేల? వేషంబులవియేల
సకల సుగుణ శీలి సాయి రామ ||190||
||సీ.|| కాక సాహెబు నిత్యమేకనాథుని భాగ
వతము చదువబల్కె బాబ గాన
చదువు చుండె తనదు శక్తి వంచనలేక
దీక్షితింటను కాక దీక్షతోడ
చదువు చున్నంతలోపదునొక్క స్కంథమ్ము
నాద్వితీయాధ్యాయ మందునున్న
వృషభకుటుంబమ్ము విజ్ఞులు నవనాథు
లైనట్టి కవి, హరి, యంతరిక్ష
||తే.గీ.|| అవిరుహోత్ర దృమిళ పిప్ప లాయ నప్ర
బుద్ధ కరభజన చమస్సు బోధ చేసె
సహజ మగుభక్తి ధర్మమ్ము జనక విభుకు
సకల సద్గుణ ధామ జై సాయిరామ ||191||
||సీ.|| పల్కె నిరుత్సాహ పడి కాక పారాయ
ణంతాన శ్యామతో నవవిధాల
భక్తి మార్గము గూర్చి భాగవతము నందు
నవనాథులు వచించి నట్టి భక్తి
మనవంటి మూర్ఖు లెట్లా చరింతు రనేక
జన్మలెత్తిన గూడ సాధ్యపడదు
యనగ శ్యామ పలికె మన యదృష్టవశము
పొంది బాబా వంటి పూర్ణ యోగి
||తే.గీ.|| చెందనేల చిరాకు నిశ్చింత తోడ
నిశ్చలంబైన విస్వాస నియతి తోడ
సద్గురుని కొలిచెడి వార్కి సాధ్యమనుచు
సకల సద్గుణ ధామ జై సాయి రామ ||192||
||సీ.|| సంతుష్టి పడలేదు శ్యామ చెప్పినగాని
కలిగి యాందోళన కలతజెందె
వెదకుచు శ్యామాను ఉదయంబు మరునాడు
పాఖాడెయను వాడు వచ్చెనటకు
చేరి శ్యామ దరికి చెవిలొ నేదియో చెప్ప
దొడగ నాటంకమేర్పడగ కాక
యడిగె విషయము పురాణ పఠనమాపి
స్వప్న దృశ్యము చెప్పె శ్యామ యపుడు
||తే.గీ.|| వినుము పాఖాడె స్వప్నంబు విదితమగును
గురుని పాదాలు భక్తితో గొల్చు వార్కి
లక్షితంబైన భక్తి సురక్షితంబు
సకల సద్గుణ ధామ జై సాయిరామ ||193||
అ45||సీ.|| ఆ స్వప్న దృశ్యంబు వివరించె పాఖాడె
రత్నాలు తాపిన రమ్యమైన
నీటిలో సగమున్న మేటి సింహాసనో
పరిని కూర్చొని బాబ పక్క శ్యామ
నిలచి యప్పుడు నాతొ పలికె బాబా పాద
ములపైన తల పెట్టి మ్రొక్కుమనుచు
నీటిలో పాదాల నెట్లు మ్రొక్కుదనగ
శ్యామ చెప్పగ పైకి సాయి తీసె
||తే.గీ.|| పాదముల వెంటనే మ్రొక్కి పైకి లేవ
బాబ దీవించి యొక పట్టు పంచె దాన
మిమ్ము శ్యామ కని పలికె నింపుగాను
సకల సద్గుణ ధామ జై సాయిరామ ||194||
||సీ.|| పట్టు ధోవతి తెచ్చి పాఖాడె కాకాను
శ్యామ కివ్వగ వేడ సాయి తనకు
నేసలహా నివ్వ లేదని శ్యామా ని
రాకరించగ రెండు వ్రాసి చీట్లు
బాబ పాదుకలుంచి బాలు నొక్కని చేత
తీయించగా వచ్చె "తీసుకొనుము"
యన ధోవతిని తీసుకొన ఇద్దరూ సంత
సంబందె కాక సంశయము దీరె
||తే.గీ.|| హృదయ పూర్వకముగ సద్గురు దలవంగ
మనము కోరిన వీడేరు మదిని గురుని
భోధ మననంబు సేయ సద్బుద్ధి కలుగు
సకల సద్గుణ ధామ జై సాయిరామ ||195||
||సీ.|| కలదు జానెడు కర్ర బల్ల వెడల్పును
నాలుగు మూరలు కలదు నిడివి
చివరల నాలుగు చిరు దీప ప్రమిదలు
వెలిగించి దానిపై విశ్రమించు
గడచె కొన్నాళ్ళిట్లు గాని బాబా దాని
విరచి ముక్కలు చేసి పారవేసె
బల్ల మహిమ సాయి వర్ణించగా కాక
ఇంకొక బల్ల వేయించె దనెను
||తే.గీ.|| విడచి దిగువ మహళ్స నొక్కండ నేను
పండె దెట్లన్న వేరొక్క బల్ల కూడ
వేసెద మహాళ్స కననిట్లు విశద పరిచె
సకల సద్గుణ ధామ జై సాయిరామ ||196||
||సీ.|| భక్త మహాళ్సెట్లు పండుకో గలడంత
యెత్తున బల్లపై యెన్నడైన
తెరచిన కన్నుల నిద్రించ గలవాడు
పుణ్య మెక్కుడు గల్గు పురుషుడైన
గాక నిద్రించ శక్యంబె నెవరికైన
బల్లపైనను సాయి పండు విధము
జూడ గోరుచు గుమి గూడు చుండ విసిగి
విరచె బల్ల ననుచు విశద పడును
||ఆ.వె.|| బల్లపైన సాయి పండు దృశ్యము జూచి
తీర వలయు పైన దేవతలును
ఏది యెట్టులైన యదియు బాబా లీల
సకల సుగుణ శీలి సాయి రామ ||197||
||సీ.|| చతురత తో సాయి చిత్రంగ తనవారు
ఎంత దూరమునున్న ఎట్టులున్న
వద్దకు లాగుచూ వారి బాధలు తీర్చి
ఐశ్వర్య సుఖములు అనుభవించు
తరి మోక్ష మార్గమ్ము దారిలో నడిపించి
ఇహపర సౌఖ్యాల నిచ్చు చుండు
తనభక్తు లెవరెంత దవ్వుల నుండినా
వారి యోగక్షేమ మరయు చుండు
||తే.గీ.|| భక్తులకు ముందుగా బాబ బయలు వెడలి
యేదొ నొక రూప మచ్చోట చేరుకొనును
ఉండి వెంబడి రక్షించు చుండు నెపుడు
సకల సద్గుణ ధామ జై సాయిరామ ||198||