అధ్యాయం - 39

||సీ.|| సంస్కృత భాషలో సాయికి పరిణతి

లేదన్న భావనా హృదయ మెరిగి

నానాకు పరిప్రశ్ననానార్ధము దెలిపి

గర్వభంగముజేసె విశ్వవిభుడు

అణ్ణసాహెబు సాయికర్పితం జేయక

తినునంచు జూపించి శెనగలచట

భగవదర్పణజేసి భక్తితో నందరూ

భోజనాధికములు భుక్తిముందు


||తే.గీ.|| పిమ్మటాప్రసాదంబును పీడితులకు

ప్రేమమీర పంచి స్వజనమ్ముగూడి

ఆరగించవలెనటంచు యానతిచ్చె

సకల సద్గుణధామ శ్రీ సాయిరామ ||138||


||సీ.|| వివిధ వ్యాఖ్యల గీత నిశదంబుగ చదివి

నాడన్న గర్వంబు నానకుండె

ఒకనాడు మస్జీదులో నొంటిగా నాన

ఒత్తుచూ కాళ్లను నోటిలోన

యేదో గొణుగుచుండ యేమది యన సాయి

సంస్కృత శ్లోకంబు చదువు చుంటి

యే శ్లోకమది యన్న గీతలో నాల్గవా

ధ్యాయముప్పది నాల్గవయది యనుచు


||తే.గీ.|| శ్లోకము చదివి వినిపించె శ్రోత్రియుండు

దాని యర్ధంబు వివరించ మనగ సాయి

చెప్పె తాత్పర్యమును సాయి కపుడు నాన

సకల సద్గుణ ధామ జై సాయి రామ ||139||


||సీ.|| తాత్పర్యమొద్దు ప్రతిపదార్ధ వ్యాకర్ణ

యర్ధ మడుగ సాయి నాన జెప్ప

ప్రశ్నించె ప్రణిపాత యనగ? - సాష్టాంగంబు

యుత్త సాష్టాంగ పడుటయె కాదు

పరిప్రశ్నయన నేమి? ప్రశ్నించుటన మరి

ప్రశ్నన్న పరిప్రశ్నయన్న వేరు

పదములు గాకున్న పరియన్న ప్రత్యయం

ప్రశ్నకు ముందేల వ్యాసుడిచ్చె?


||తే.గీ.|| సేవయన నేది? మేము జేసేది యనగ

యంకిత మనంబు సేయు నిస్వార్ధసేవ

సేవయగు గాని వేరొండు సేవకాదు

సకల సద్గుణ ధామ జై సాయి రామ ||140||


||సీ.|| ఈ ఉపదేక్ష్యంతితే జ్ఞానముకు బదు 

లజ్ఞాన ముంచినట్లైన దాని 

యందర్ధమున్నచో నాక్షేపణేమున్న 

దని సాయి వివరించు మనగ నాన 

జెప్పలేనన, సాయి జెప్పె నిటుల: కృష్ణు 

డర్జును, జ్ఞానుల మరియు తత్త్వ 

దర్శుల ప్రణమిల్లి శుశ్రూషలొనరించి 

ప్రశ్నించు మననేల? జ్ఞానమూర్తి

||తే.గీ.|| తత్త్వదర్శియు, కృష్ణుడు తానుగాడు 

బోధపడకనానయు సిగ్గు చెంది నంత 

తత్త్వ బోధను జేసె సవిస్తరముగ 

సకల సద్గుణ ధామ జై సాయిరామ ||141||


||సీ.|| సద్గురు వేడుము సర్వస్య శరణంబు

ఉత్త సాష్టాంగంబు రిక్త యగును

ఊరకప్రశ్నించి గురు దోష మెంచరా

దాధ్యాత్మికభివృద్ధి కడుగ వలయు

ఇష్టమున్నచొ చేయు లేకున్న మానెడి

దెట్టి గురుని సేవ వెట్టిగాని

తనువు తనదిగాదు తన గురు దేవుల

దన్న భావన సేయు నదియు సేవ


||ఆ.వె.|| యటుల సేయ శ్లోకమందు జెప్పబడిన

జ్ఞానబోధ సేయు ననగ నాన

కర్థమవక దల్చె నజ్ఞాన బోధెట్లు?

సకల సుగుణ శీలి సాయి రామ ||142||


||సీ.|| జ్ఞానబోధనగ నజ్ఞానంబు నశియింప

చేయుటే ననుమాట చెప్పదలచి

పరమాత్మ, అర్జునా!నిద్రయు, స్వప్నంబు

పోనాడ మిగిలేది జ్ఞానమనియె

చీకటి నశియింప జేసెదమన్నచో

వెలుగు గూర్చియనియె తెలుసుకొనుము

ద్వైతము నశియింప వలయునీవద్వైత

స్థితి పొందవలెనన్న రీతిగాను


||తే.గీ.|| ద్వైతమున యుండి యద్వైత స్థితిని గూర్చి

చెప్ప జాలరే గురువులు శిష్యులకును

యెన్న గురుశిష్య భేదంబు జ్ఞానమొకటె

సకల సద్గుణ ధామ జై సాయి రామ ||143||


||సీ.|| గురువు మాదిరి శిష్యుడును జ్ఞాన మూర్తియే

గాని భేదములెన్న గలవు పెక్కు

సద్గురు లెన్నంగ నిర్గుణ సచ్చిదా

నందమయుండు ననంత మూర్తి

విషయ గ్రహణతీరు వేదాంత భావంబు

గొప్ప సాక్షాత్కారమొప్పుచుండు

మానవాతీతమౌ ఘన శక్తుయుక్తులు

సాధనచే గాని సాధ్యపడవు


||తే.గీ.|| జన్మజన్మాంతరజ్ఞాన తిమిర మణగి

శుద్ధ చైతన్య ముందన్న బోధ వలన

తోలగి యానితాంతభ్రమ కలుగు శాంతి

సకల సద్గుణ ధామ జై సాయిరామ ||144||


||సీ.|| జన్మ జన్మాల యజ్ఞాన వశము చేత

తాను "నికృష్ట జీవి"నని దల్చు

శిష్యుని మనసెర్గి చేరదీసి గురువు

నీవె శక్తియుతుడ నీవె దైవ

మైశ్వర్య శాలివి యనుచు బోధించ నా

భ్రమపోయి శిష్యుడు క్రమముగాను

జీవుడు కాదు నేదేవుడనుచును శ

రీరాత్మలును రెండు వేరువేరు

||తే.గీ.|| యన్న సత్యము గ్రహియించి యాచరించు

జ్ఞానమూర్తగు జీవికి జ్ఞాన మేల

వలయునజ్ఞానము నశియింప వలయుననియె

సకల సద్గుణ ధామ జై సాయిరామ ||145||


||సీ.|| సకుటుంబముగ బాపు సాహెబు బుట్టి తా

శిరిడి నుండగ నొక్కసారి మదిని

స్వంత భవనమున్న బాగుండు శిర్డియం

దనుకొన్నినాళ్ళ యనంతరంబు

స్వప్న దృశ్యము నొక్కవాడ మందిర సమే

తంబుగా నిర్మించ తనకు చెప్పె

బుట్టి మేల్కొని గాంచి బోరున విలపించు

శ్యామను కారణం బేమి యనగ


||తే.గీ.|| స్వప్న దృశ్యంబు వివరించ, వినిన పిదప

నుభయు లాస్వప్న వృత్తంతమొక్కటనుచు

వాడ నిర్మించ నిశ్చయంబయ్యెనపుడె

సకల సద్గుణ ధామ జై సాయి రామ ||146||


||సీ.|| నిర్మించగావాడ నిశ్చయంబయినంత

ప్లాను వ్రాసిరి శ్యామ, బాపులపుడు

కాక సాహెబు దీక్షితుకి జూప నా ప్లాను

యామోదమును దెల్పె, నపుడు సాయి

ముందర పెట్టగా మోదంబు తెలుపగా

వెంటనారంభించె కట్టుటయును

పర్యవేక్షణ శ్యామ సేయగా బావియు,

భూమ్యుపరిగృహంబు భూగృహంబు


||ఆ.వె.|| పూర్తికాగ లెండి పోయి వచ్చునపుడు

యిచ్చి సలహ మార్పు జేయు సాయి

జూడ మిగత పనిని జోగును నియమించె

సకల సుగుణ శీలి సాయి రామ ||147||


||సీ.|| నిర్మాణమందున్న సమయాన మదిలోన

తట్టె నాలోచన బుట్టి కొకటి

సువిశాల హాలులో చుట్టు గదులు మధ్య

మోహనాకారుండు మురళి ధరుని

ప్రతిమ ప్రతిష్టించు నత్యంత యాశతో

సాయికీసంగతి శ్యామ ద్వార

వినిపించగా సాయి తనజేయి జూపుచూ

వాడ పూర్తయినంత వచ్చెదటకు


||తే.గీ.|| ననుచు సంతోషమున యాటలాడుకొనుచు

కౌగిలించుకు నొకరొండు కలసిమెలసి

వాడమనలకే నుపయోగపడవలెననె

సకల సద్గుణ ధామ జై సాయిరామ ||148||


||సీ.|| సాయి పల్కులు విన్న శ్యామ దేవస్థాన

మధ్య నిర్మించు నామందిరముకు

యది తగ్గ సమయమా యనుచు వేడగ సాయి

సమ్మతించినయంత శ్యామ వెడలి

కొబ్బరి కాయను కొట్టి యారంభించి

బాపుకీ విషయంబు చెప్పినంత

యానందమున బాపు మనసులో సాయికి

ప్రణుతించి తనవాడ పావనంబు


||తే.గీ.|| సాయి చేయగలండని సత్వరమున

పూర్తి చేసి మురళిధరు ప్రతిమకాజ్ఞ

యిచ్చి పూర్తికాక మునుపె వింత జరిగె

సకల సద్గుణ ధామ జై సాయి రామ ||149||


||సీ.|| ఇంతలో జ్వరమొచ్చె వింతగా సాయికి

కాయంబు విడచుట కాయమయ్యె

భక్తులందరు చింతపడిరేమగునేమంచు

బాపు సాహెబు కూడ బాధ పడియె

బాబ తనదువాడ పావనం జేయక

యేసమాధిని పొందునేమొ యనుచు

భక్తులంత విచార గ్రస్తులై చెంతనే

కూర్చోని సేవలందించు చుండ


||తే.గీ.|| కొందరేమొ మస్జీదులో గుంపు గూడి

మరికొందరు లోగిళ్ల యరుగులందు

సాయి యారోగ్యమును గూర్చి చర్చజేయ

సకల సద్గుణ ధామ జై సాయిరామ ||150||


||సీ.|| మదుపు పెట్టిన లక్ష వ్యర్ధమగునటంచు

బాపు చింతిలి యుండ వాడ గూర్చి

తన సమాధికి ముందు "నన్నుంచుడా రాతి 

మందిర" మను సాయి  మాటలపుడు

యూరటకల్గించె బుట్టితో పాటుగా

యందరకును సకాలంబులోన

ఇంతలో బాబా పవిత్ర శరీరంబు

మందిర మధ్య సమాధి సేయ


||తే.గీ.|| మురళిధరు ప్రతిష్టించు మందిరము నందు

సాయినే సమాధియొనర్చ - సాయినాధు

డే మన మురళిధరుడంచు నెరుగవలయు

సకల సద్గుణ ధామ జై సాయి రామ ||151||


అధ్యాయం - 40