అధ్యాయం - 37

||సీ|| ఒక రోజు మస్జీదు నొక రోజు సావడి

శయనించు చుండును సాయి విభుడు

సావడి నిద్రించు సమయాన భక్తులు

మస్జీదు గుమికూడి మంటపమున

భజన చేసి పిదప భజన బృందము వెనుక 

గా రథము కుడి ప్రక్కనట తులసి

బృందావనంబుకు ముందరుండును బాబ

భజన సేయుచు మధ్య భక్తులపుడు


||తే.గీ.|| చేరి దివిటీలు బెత్తాలు చేత పట్టి

చేసి జయజయ ధ్వానాలు వాసిగాను

శ్యామ కర్ణను హయరాజ మమరియుండు

సకల సద్గుణ ధామ జై సాయి రామ ||118||


||సీ|| తాత్యకేలూతతో సాయిని లేపగా

కాలితో ధునిలోకి కట్టె దోసి

దీపంబు కుడిచేత నార్పి బయట కొచ్చు

సరికి భక్తులచట బార్లుదీరు

యెడమ చేతిని తాత్య కుడిచేతిని మహళ్స

పట్టి గొడుగు తలపైన జోగు

యడుగులకు పరచి మడుగులింకొందరు

సోభయాత్ర వెడలు విభవ మొప్ప


||తే.గీ.|| చెరి సావడి బాబ యుత్తరకు దిరిగి

బాలభానుని పోలిక వెలుగు చుండ

దీసి పూల్గులాల్పొడి జల్లు దీక్షితుండు

సకల సద్గుణ ధామ జై సాయి రామ ||119||


||సీ|| అటుసాయి నిటు సాయి ఎటుచూసినటు సాయి

చేయుచు కనువందు చెన్నుమీర

యటుచూసి నిటుచూసి యారాట పడవద్దు

నీచిత్తమందుండు నిలకడగను

సాయినామ జపము సతతంబు సేయని

దర్శనంబు లభించు ధాత్రియందు

యీరూప మారూప మిదియది యనలేము

యేదేని రూపాన యేగుదెంచు


||తే.గీ.|| ఇక్కటుల బాపి రక్షించు నెచ్చటైన

బాధలం దాదుకొను నాత్మబంధు వలెను

చిత్త మలరించు చుండు సన్మిత్రువలెను

సకల సద్గుణ ధామ జై సాయి రామ ||120||


||సీ|| సమలంకృతంబైన సావడి విభవంబు

వర్ణింప జాలరే పండితులును

తెల్లని పై కప్పు నిలువుటద్దమ్ములు

రంగు దీపాలతో హంగులమర

సావడి చేరగా సాయికంటెను ముందు

తాలోనకేగిన తాత్య వడిగ

పరచి తివాసి బాలీసు నేర్పర్చి

బాబ కూర్చున్నంత భక్తులచట


||తే.గీ.|| చేరి పలువిధంబుల పూజ చేయుచుండ

కలితురాయి కిరీటంబు తలనమర్చి

పాదములు వెండి పళ్ళెరంబందు నుంచి

సకల సద్గుణధామ జై సాయి రామ ||121||


||సీ|| భక్తితో కడిగిన పాద తీర్థంబును

తలలజల్లు కొనుచు తనివి తీర

గిర్రున తిరిగేటి తీరైన రంగుల

కుచ్చులతోనున్న గొడుగు పట్టి

నానాసాహెబు నిల్వనచటున్న భక్తులు

విసన కర్రలతోడ విసరుచుండ

శ్యామ చిలుమును తయ్యారు పరచియివ్వ

తాత్య పీల్చి నదియు సాయి కిచ్చు


||తే.గీ.|| సాయి పీల్చి పిదప మహళ్సాకు నిచ్చు

పిమ్మటది యితరులకు లభించు చుండె

బాబ స్పర్శకు చిలుమయ్యె పావనంబు

సకల సద్గుణ ధామ జై సాయి రామ ||122||


||సీ|| ఉత్సవానంతరమ్ముత్సాహమున సాయి

మెడలోన పువ్వుల దండవేసి

చేతికిత్తురు పూల చెండులు వేరుగా

బాపు సాహెబు జోగుయపుడు లేచి

సర్వలాంచనముల సాయి కారతి నివ్వ

మ్రోగు భజంత్రీలు బాగుగాను

హారతైన పిదప నాశీస్సులందిన

వరభక్త జనమెల్ల తరలిపోవ


||తే.గీ.|| తాత్యకూడ వెడల సాయి తనదు శయ్య

నేబదరువది దుప్పట్లు వేసిపైన

చేరి యోగనిద్రనుదేలు చిన్మయుండు

సకల సద్గుణ ధామ జై సాయి రామ ||123||


||సీ|| యోగము లందు నెన్నగ భక్తి యోగము

నుత్తమంబై యొప్పు నుర్వియందు

భాగ్యమెంతయు నున్న భక్తి హీనులకది

యుపయోగ పడబోదు ఊర్ధ్వగతికి

కవిగాని బలిగాని కాల గతిని దాటి

పోలేడు యెందునా పుడమి హద్దు

భక్తి యోగములోన బాధలెన్నొగలవు

భవ బంధ ముక్తికి బాటలవియె


||తే.గీ.|| భక్తి పరుని మనసు పావనమై యుండు

భక్తి కలుగ పాప భీతి కలుగు

భక్తిలేని వాడు భవపాశబద్ధుడు

సకల సుగుణ శీలి సాయి రామ ||124||


అధ్యాయం - 38