William Henry Bragg

స్ఫటిక నిర్మాణాలను కనుగొన్నవాడు!

ఒక పాఠశాలలో ఎంతో మంది పిల్లలు చదువుతారు. కానీ ఆ పాఠశాలలో ఒక భవనానికి అతడి పేరును పెట్టేంత గొప్పదనాన్ని సాధించేవారు ఎంత మంది ఉంటారు? ఆ ఘనతను పొందిన శాస్త్రవేత్తే సర్‌ హెన్రీ విలియం బ్రేగ్‌. ఆయన పుట్టిన రోజు ఇవాళే!

ప్రపంచ ప్రఖ్యాతమైన నోబెల్‌ బహుమతిని కొడుకుతో కలిసి అందుకున్న శాస్త్రవేత్తగా సర్‌ హెన్రీ విలియం బ్రాగ్‌ గుర్తింపు పొందారు. పాతికేళ్ల కొడుకు లారెన్స్‌ బ్రాగ్‌తో కలిసి 1915లో నోబెల్‌ బహుమతిని అందుకున్న యాభైమూడేళ్ల విలియం బ్రాగ్‌, 'ఈ బహుమతి వల్ల కలిగే సంతోషం కన్నా, దాన్ని కొడుకుతో కలిసి అందుకుంటున్నందుకు గర్వంగా ఉంది. ఇది నాకు మాత్రమే దక్కిన గౌరవం' అనగానే చప్పట్లు మార్మోగాయి.

ఎక్స్‌ కిరణాలను ఉపయోగించి స్ఫటికాల నిర్మాణాన్ని నిర్ధరించిన పరిశోధనకు తండ్రీకొడుకులిద్దరికీ ఈ బహుమతి లభించింది. భౌతిక శాస్త్రంలో ఈ విభాగాన్ని ఎక్స్‌రే స్ఫటికీకరణము (X-ray crystallography) అంటారు. స్ఫటికాల్లో కంటికి కనిపించని అంతర్గత నిర్మాణాలను (structure of crystals) విశ్లేషించడం ద్వారా ఘనస్థితి భౌతిక శాస్త్రం (solid state physics) అనే కొత్త విభాగం ఏర్పడింది. ఎలక్ట్రానిక్‌ రంగంలో విప్లవాన్ని తెచ్చిన 'ట్రాన్సిస్టర్‌' ఆవిష్కరణకు ఈ పరిశోధన దోహదపడింది. జీవశాస్త్రంలో ప్రోటీన్ల, విటమిన్ల, డిఎన్‌ఏ అణువుల ఆకృతులను అధ్యయనం చేయడానికి సాధనమైంది.

ఇంగ్లండ్‌లోని వెస్ట్‌వర్డ్‌లో 1862 జులై 2న పుట్టిన పుట్టిన హెన్రీ ఏడేళ్ల వయసులో తల్లిని కోల్పోయాడు. చదువులో చురుగ్గా ఉంటూ గణితంలో పట్టు సాధించాడు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో స్కాలర్‌గా చేరి పట్టభద్రుడై ఆపై ఆస్ట్రేలియాలోని అడిలాయిడ్‌లో 23 ఏళ్లకే ప్రొఫెసర్‌ పదవి పొందాడు. అక్కడ విద్యార్థులకు బోధించడం కోసం భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేసిన హెన్రీ అందులో ఆసక్తి పెంచుకున్నాడు. ఇంగ్లండ్‌ తిరిగి వచ్చి లీడ్స్‌, లండన్‌ విశ్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా వ్యవహరించాడు.

ఎక్స్‌రేలకు వివర్తన ధర్మం (Diffraction) ఉందని చెప్పడమేకాకుండా, వాటి తరంగదైర్ఘ్యాన్ని కొలిచే ఎక్స్‌రే స్పెక్ట్రామీటర్‌ను రూపొందించాడు. దీంతోనే తన కొడుకుతో కలిసి అనేక స్ఫటికాల అంతర్గత నిర్మాణాలను ఆవిష్కరించాడు.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జలాంతర్గాముల ఉనికిని శబ్దతరంగాల సాయంతో కనిపెట్టే పరికరాలను కూడా రూపొందించిన హెన్రీ, బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి నైట్‌హుడ్‌లాంటి గౌరవ పురస్కారాలు పొందారు. దాదాపు 16 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. అణుధార్మికత, ఎక్స్‌రేల వంటి అంశాలపై ఎన్నో పుస్తకాలు రచించిన ఆయనకు గౌరవ సూచకంగా ఎన్నో భవనాలకు ఆయన పేరు పెట్టారు. వాటిలో ఆయన చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల కూడా ఉంది.