George Stephenson - జార్జ్‌ స్టీఫెన్‌సన్

ఆ కాలంలో గనుల నుంచి తవ్విన బొగ్గును గుర్రపుబండ్లపై తరలించేవారు. అందులో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. అప్పటికే ఆవిరితో పనిచేసే రకరకాల యంత్రాలు వాడుకలో ఉండేవి. వీటిని గమనించిన స్టీఫెన్‌సన్‌ ఆవిరి శక్తితో నడిచే ఇంజన్‌ సాయంతో ప్రత్యేకంగా వేసిన పట్టాలపై బొగ్గు వ్యాగన్లను లాగే పథకాన్ని అధికారులకు సమర్పించి మెప్పించాడు. వారి అనుమతితో రాత్రింబవళ్లు పదినెలల పాటు శ్రమించి ప్రతి విభాగాన్ని స్వయంగా తయారు చేసుకుని ఇంజిన్‌ను రూపొందించగలిగాడు. దాన్ని తొలిసారిగా 1814లో బొగ్గు వ్యాగన్లను లాగడానికి పరీక్షించాడు. ఆపై దానికి మెరుగులు దిద్ది ప్రత్యేక రైలు మార్గాన్ని నిర్మించి 1825 సెప్టెంబర్‌ 27న ప్రపంచంలోనే తొలిసారిగా ప్రయాణికులతో రైలుబండిని నడిపించాడు. ఇంజన్‌, వ్యాగన్లకు గాడితో కూడిన చక్రాలను రూపొందించింది కూడా అతడే. పట్టాల మధ్య అతడు నిర్ణయించిన దూరాన్నే ఇప్పటికీ వాడుతుండడం విశేషం.

ఇంగ్లండులోని ఓ కుగ్రామంలో 1781 జూన్‌ 9న పుట్టిన స్టీఫెన్‌సన్‌ వూహతెలిసిన దగ్గర్నుంచి పశువులను కాసేవాడు. బొగ్గుగనిలో ఫైర్‌మాన్‌గా పనిచేసే తండ్రి సంపాదన అంతంతమాత్రం కావడం వల్ల బడికి వెళ్లే దారేలేదు. పద్నాలుగేళ్లకల్లా తండ్రి పనిచేసే గనిలోనే ఇంజన్‌మాన్‌గా చేరాడు. చదవడం, రాయడం రాకపోయినా యంత్రాలు పనిచేసే తీరును ఆసక్తిగా గమనిస్తూ, మరమ్మతులు చేస్తూ వాటి తయారీపై పూర్తి అవగాహన పెంచుకున్నాడు. చెప్పులు, బట్టలు కుట్టడం దగ్గర్నుంచి వాచీల రిపేరు వరకు ఎన్నో పనులు చేస్తుండేవాడు. చదువు ప్రాముఖ్యతను గుర్తించి రాత్రి పాఠశాలలో చేరి రాయడం, చదవడం, లెక్కలు చేయడం నేర్చుకున్నాడు.

చుక్‌చుక్‌మంటూ పట్టాలపై పొగ చిమ్ముతూ పరిగెత్తే రైలు బండి వెనుక ఓ నిరక్షరాస్యుడి కృషి ఉందంటే నమ్మగలమా? చదువుకోడానికి వీలుకాని పేద కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తి ప్రపంచానికి తొలి రైలు ప్రయాణాన్ని చవి చూపించాడంటే ఆశ్చర్యపోకుండా ఉండగలమా? అతడే జార్జ్‌ స్టీఫెన్‌సన్‌. రైలు మార్గాలకు ఆద్యుడిగా పేరొందిన ఇతడు కూలి పనుల నుంచి ఇంజినీరుగా, శాస్త్రవేత్తగా ఎదగడానికి కారణం సడలని పట్టుదల, నిరంతర కృషే.

చదువుకోని వాడు... పశువులను కాచేవాడు... శాస్త్రవేత్త కాగలడా? అదే సాధించాడు జార్జ్‌ స్టీఫెన్‌సన్‌! ఆయన పుట్టిన రోజు ఇవాళే! - 1781 జూన్‌ 9న

ఆపై స్టీఫెన్‌సన్‌ మాంచెస్టర్‌, లివర్‌పూల్‌ల మధ్య తొలి రైలు మార్గాన్ని నిర్మించాడు. రైలింజన్‌ల సామర్థ్యాన్ని పెంచుతూ అనేక నమూనాలను చేశాడు. రైలుమార్గంలో నదులపై నిర్మించే వంతెన నమూనాలను, మలుపుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వేగాల పరిమితులను నిర్ధరిస్తూ ప్రయోగాలు చేశాడు. ఆ ఫలితాలు ఇప్పటికీ ప్రామాణికమే. ఆపై ఆయన ప్రపంచంలోని అనేక రైల్వే కంపెనీలకు కన్సల్టింగ్‌ ఇంజినీర్‌గా వ్యవహరించారు. లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్స్‌కు తొలి అధ్యక్షుడు ఆయనే.

courtesy Eenadu telugu daily - ప్రొ||ఈ.వి. సుబ్బారావు