Nicolas Copernicus

ఎన్నో డిగ్రీలు పొందాడు.. మరెన్నో భాషలు నేర్చాడు.. సైన్స్‌నే మలుపు తిప్పిన సిద్ధాంతాన్ని.. ప్రతిపాదించాడు! అతడే కోపర్నికస్‌! ఆయన పుట్టింది ఈ రోజే!ఒక విషయాన్ని అందరూ నమ్ముతున్నప్పడు, మతం కూడా దాన్ని సమర్ధిస్తున్నప్పుడు, దానికి వ్యతిరేకంగా చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి? ఎంత పరిశోధన చేసుండాలి? నికొలాస్‌ కోపర్నికస్‌ అనే ఓ శాస్త్రవేత్త అంతటి ధైర్యస్థుడే. అంతటి పరిశోధకుడే.'సూర్యుడు తూర్పున ఉదయించి, పడమరలో అస్తమిస్తున్నాడు కాబట్టి కదలిక లేనిది భూమే. దాని చుట్టూ సూర్యుడే తిరుగుతున్నాడు' అని అందరూ గట్టిగా నమ్మే రోజుల్లో పుట్టిన కోపర్నికస్‌ ఓ కొత్త సిద్ధాంతాన్ని ప్రకటించాడు. అదే 'సూర్యకేంద్రక సిద్ధాంతం'. సూర్యుడి చుట్టూ భూమి, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయనేదే ఆ సిద్ధాంతం. టెలిస్కోపు లాంటి ఆధునిక పరికరాలేవీలేని ఆ రోజుల్లోనే అతడిలా చెప్పడం వెనుక ఎంతో పరిశీలన ఉంది.పోలెండ్‌లోని టోరన్‌ నగరంలో 1473 ఫిబ్రవరి 19న ధనవంతుల బిడ్డగా నలుగురి సంతానంలో చివరివాడిగా పుట్టిన కోపర్నికస్‌ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. మేనమామ సంరక్షణలో ఎదిగిన అతడు వేదాంత, ఖగోళ, భూగోళ, గణిత శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. ఇటలీ వెళ్లి న్యాయశాస్త్రాన్ని, డాక్టరేట్‌ను కూడా చేసినా చదువు మీద మక్కువ తగ్గక వైద్యవిద్యను కూడా అభ్యసించడం విశేషం. డిగ్రీలతో పాటు లాటిన్‌, పోలిష్‌, జర్మన్‌, గ్రీకు, ఇటాలియన్‌ భాషల్లో పట్టు సాధించాడు. మేనమామ అనారోగ్యానికి గురి కావడంతో ఆయన స్థానంలో ముప్ఫై ఏళ్లకే మతబోధకుడయ్యాడు. చర్చి ఆవరణలో ఉండే ఒక గోపురంపై నుంచి రాత్రివేళ ఆకాశంలో నక్షత్రాలను పరిశీలిస్తూ రాసుకుంటూ ఉండేవాడు. ఆ పరిశోధనలకు గణితాన్ని జోడించి నక్షత్రాలు, గ్రహాల చలనాలకు సంబంధించిన మ్యాపులను రూపొందించి సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. భూమి గుండ్రంగా ఉంటుందని నిర్ధరించినవాడు కూడా అతడే. ఆపై 'ఆన్‌ ద రివల్యూషన్‌ ఆఫ్‌ ద సెలెస్టియల్‌ స్ఫియర్స్‌' అనే గ్రంథాన్ని రచించాడు.

మత బోధకుడిగా ఉంటూ మతవిశ్వాసాలకు వ్యతిరేకమైన విషయాన్ని చెప్పిన కోపర్నికస్‌ సిద్ధాంతాన్ని, ఆ తర్వాతి రోజుల్లో గెలీలియో టెలిస్కోపు ద్వారా నిరూపించాడు. ఆపై కెప్లర్‌ గ్రహగమన సూత్రాలకు, న్యూటన్‌ విశ్వ గురుత్వ నియమానికి కూడా ఈ సిద్ధాంతమే పునాది కావడం విశేషం.

================================================================

Source:-ప్రొ||ఈ.వి. సుబ్బారావు