James Chadwick

పరమాణువులో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయనుకునే రోజుల్లో న్యూట్రాన్‌ అనే మరో కణం కూడా ఉందని నిరూపించిన శాస్త్రవేత్త జేమ్స్‌ చాడ్విక్‌. తద్వారా నోబెల్‌ బహుమతిని సాధించిన ఆయన పుట్టినది ఈరోజే - 1891 అక్టోబర్‌ 20న.పరమాణువు అనేది మొదట ఒక ఊహ. తర్వాత సిద్ధాంతం. ఆపై కచ్చితమైన నమూనా. ఇలా శాస్త్రలోకం పరమాణువులోకి తొంగి చూసిన కొద్దీ కొత్త విషయాలు బయట పడుతూ వచ్చాయి. పదార్థానికి మూలకణం పరమాణువే అనుకునే దశ నుంచి, దానిలో అంతర్భాగంగా మరిన్ని సూక్ష్మకణాలు ఉన్నాయని తెలిసే అవగాహన కలగడం వెనుక ఏళ్లకేళ్ల పరిశోధనలు ఉన్నాయి. ఇదంతా ఎందరో శాస్త్రవేత్తల కృషి ఫలితం. ఆ పరిణామ క్రమంలో పరమాణువు నిర్మాణానికి న్యూట్రాన్‌ ఆవిష్కరణ ద్వారా సంపూర్ణత్వం చేకూర్చిన శాస్త్రవేత్తగా జేమ్స్‌ చాడ్విక్‌ పేరు పొందాడు. ఆయన పరిశోధన వల్ల పరమాణువులో నిక్షిప్తమైన శక్తి వినియోగానికి మార్గాలు ఏర్పడ్డాయి.ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో 1891 అక్టోబర్‌ 20న ఓ లాండ్రీ యజమాని కొడుకుగా పుట్టిన జేమ్స్‌ చాడ్విక్‌ భౌతికశాస్త్రంలో ఆనర్స్‌ డిగ్రీ పొంది ప్రొఫెసర్‌ రూథర్‌ఫర్డ్‌ వద్ద లాబరేటరీ అసిస్టెంట్‌గా చేరాడు. రేడియో ధార్మికత, ఆల్ఫా కిరణాలపై పరిశోధనలు జరిపిన ఫలితంగా ఎమ్మెస్సీ డిగ్రీ సాధించాడు. ఆపై స్కాలర్‌షిప్‌పై బెర్లిన్‌ వెళ్లి మరిన్ని పరిశోధనలు జరిపాడు. ఇంగ్లండ్‌ తిరిగి వచ్చాక కేంబ్రిడ్జిలోని కేవిండిష్‌ లాబరేటరీలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరి పదమూడేళ్లు పనిచేశాడు. ఇక్కడే డాక్టరేట్‌ డిగ్రీ పొందిన చాడ్విక్‌, 1932లో పరమాణువులో ఎలాంటి విద్యుదావేశం లేని న్యూట్రాన్లు ఉంటాయని ప్రకటించి వాటి ఉనికిని నిరూపించాడు. అంతవరకూ శాస్త్రవేత్తలు పరమాణువులో ధనావేశమున్న ప్రోటాన్‌, రుణావేశమున్న ఎలక్ట్రాన్‌ మాత్రమే ఉంటాయనుకునేవారు. అయితే ఇవి పరమాణువులు ప్రదర్శించే కొన్ని లక్షణాలను పూర్తిగా వివరించలేకపోవడమే కాకుండా, పరమాణు భారాన్ని కూడా లెక్క కట్టలేకపోయాయి. న్యూట్రాన్ల ఆవిష్కరణ వల్ల చాడ్విక్‌కు 1935లో నోబెల్‌ బహుమతి లభించింది. న్యూట్రాన్‌కు మూలకాల కేంద్రకాలను విఘటనం చేయగల సామర్థ్యం ఉండడంతో ఒక మూలకాన్ని మరో మూలకంగా మార్చే ప్రక్రియ (ట్రాన్స్‌మ్యుటేషన్‌ ఆఫ్‌ ఎలిమెంట్స్‌)కీ, పరమాణు శక్తిని వెలువరించే కేంద్రక విచ్ఛిత్తి (న్యూక్లియర్‌ ఫ్యూజన్‌)కీ సాధనం లభించింది.

లివర్‌పూల్‌ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా చేరిన చాడ్విక్‌ బ్రిటన్‌లో తొలి పార్టికిల్‌ యాక్సిలరేటర్‌ సైక్లోట్రాన్‌ను నెలకొల్పడంలో కీలకపాత్ర వహించాడు. తొలి అణుబాంబు తయారీలో బ్రిటిష్‌ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించాడు. ఈ సేవలకు గుర్తింపుగా బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను 'నైట్‌హుడ్‌'తో సత్కరించింది. తిరిగి కేంబ్రిడ్జికి వచ్చి పదవీవిరమణ వరకూ అక్కడే ప్రొఫెసర్‌గా వ్యవహరించారు.