Beerbal Sahni

వృక్షాల చరిత్ర వెల్లడించినవాడు! వృక్ష శిలాజాల పరిశోధనలో ప్రపంచ గుర్తింపు పొందిన భారతీయ శాస్త్రవేత్త బీర్‌బల్‌ సాహ్ని. ఆయన పుట్టిన రోజు ఇవాళే!స్వాతంత్య్రం వచ్చిన అనంతరం మన దేశ మొదటి విద్యాశాఖ మంత్రి అబుల్‌ కలామ్‌ ఆజాద్‌, కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిగా ఓ వ్యక్తిని ఎంపిక చేశారు. కానీ ఆ అవకాశాన్ని ఆ వ్యక్తి సున్నితంగా తిరస్కరించాడు. 'నేను పరిశోధనకే జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్నాను. వేరే బాధ్యతలు స్వీకరించలేను' అనేది ఆయన జవాబు. ప్రభుత్వంలో ఉన్నత హోదాను సైతం కాదనుకున్న ఆ వ్యక్తే, ఆ తర్వాత దేశం గర్వించే శాస్త్రవేత్తగా ఎదిగారు. ఆయనే బీర్‌బల్‌ సాహ్ని.మన దేశంలో లుప్త వృక్ష శాస్త్రం (Palaeobotany) అభివృద్ధికి ఆయనే కారకులు. పాలియోబోటనీ అంటే ప్రాచీన కాలపు మొక్కల శిలాజాలపై పరిశోధనలు చేయడం. ప్రపంచంలోనే మొట్టమొదటి పాలియోబోటనీ పరిశోధనా సంస్థను భారతదేశంలో స్థాపించిన శాస్త్రవేత్తగా ఆయన పేరొందారు. లక్షల ఏళ్ల కిందట వాతావరణ పరిస్థితులు, ఖండాల కదలికలు, భూగర్భంలో బొగ్గు, చమురు నిక్షేపాల ఉనికి లాంటి ఎన్నో విషయాలపై ఆయన పరిశోధనలు అంతర్జాతీయ గుర్తింపును పొందాయి.ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న పంజాబు ప్రాంతం సహారాంపూర్‌ జిల్లాలో బెహరా గ్రామంలో 1891 నవంబరు 14న పుట్టిన బీర్‌బల్‌ సాహ్ని, చిన్నప్పటి నుంచే చదువులో చురుకు. తండ్రి ప్రొఫెసర్‌, స్వాతంత్య్ర సమరయోధుడవడంతో నెహ్రూ, గోఖలే, సరోజినీనాయుడులాంటి వాళ్లు ఇంటికి వస్తుండేవారు. ఫలితంగా సాహ్నీకి దేశభక్తితో పాటు క్రమశిక్షణ అలవడింది. ప్రకృతి ప్రేమికుడైన తండ్రితో పర్వత ప్రాంతాలకు వెళుతూ రంగు రాళ్లను, మొక్కలను సేకరిస్తూ వృక్ష, భూగర్భశాస్త్రాలపై ఆసక్తి పెంచుకున్నాడు.

లాహోర్‌, పంజాబ్‌ యూనివర్సిటీలలో చదువుకున్న సాహ్నీ ఉన్నత విద్యకు లండన్‌ వెళ్లి, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. లండన్‌ యూనివర్సిటీ నుంచి, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ నుంచి కూడా డియస్సీ డిగ్రీ పొందిన మొదటి భారతీయుడు ఈయనే. తిరిగి వచ్చిన తరువాత లక్నో యూనివర్సిటీకి తొలి బాటనీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ, మొదటిసారిగా పాలియో బాటనీని భారతీయ విశ్వ విద్యాలయాల్లో ప్రవేశపెట్టారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలియోబాటనీని స్థాపించి, ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీగా ఎన్నికయ్యారు.

పర్వత శ్రేణుల్లోని రాళ్ల పొరల మధ్య నిక్షిప్తమై ఉండే మొక్కల శిలాజాలను వెలికి తీసి పరిశోధించడం ద్వారా ఆయన కొత్త వృక్ష జాతుల ఉనికిని కనుక్కొగలిగారు. భూమి లోపల ఉండే శిలాద్రవంపై ఖండాలు నీటిలో తెప్పల్లాగా కదులుతూ ఉంటాయనే సిద్ధాంతానికి ఆయన పరిశోధనలు ఊతమిచ్చాయి. అనేక శిలా ప్రదేశాల వయసును నిర్ధరించారు. పురాతన నాణాల ముద్రణ గురించి కూడా ఎన్నో వివరాలను అందించగలిగారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌, ఇంటర్నేషనల్‌ బొటానికల్‌ కాంగ్రెస్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1949, ఏప్రిల్‌ 10న మరణించారు.

- ఈ.వి.సుబ్బారావు