Albert Einstein

ఐన్‌స్టీన్‌ పేరు వినగానే మనకు సాపేక్ష సిద్ధాంతమే గుర్తుకు వస్తుంది. గొప్ప శాస్త్రవేత్తగా గౌరవభావం కలుగుతుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎన్నో చిక్కు సమస్యలకు జవాబులు చెప్పిన ఈయన సామాజిక, రాజకీయ సమస్యలకూ పలు రకాల పరిష్కారాలు చూపారు. శాస్త్రవేత్తగానే కాకుండా రాజకీయవేత్తగానూ, సామాజికవేత్తగానూ ప్రఖ్యాతిగాంచారు. ప్రపంచశాంతి, మానవాభివృద్ధి కోసం పరితపించిన ఐన్‌స్టీన్‌ ఈ రెండో పార్శ్వం గురించి నేడు చాలా కొద్ది మందికే తెలుసు. తన సమకాలీన సమాజం, ప్రపంచంలో జరిగిన వివిధ ఘటనలకు ఆయన స్పందించిన తీరు, ప్రపంచ శాంతి కోసం చేసిన కృషి, మానవాభ్యున్నతికోసం ప్రయత్నించిన తీరు ఆయన ఎంతటి మహోన్నతుడన్నది తెలుపుతుంది. ప్రపంచీకరణ పేరిట సామ్రాజ్యవాదులు సృష్టిస్తున్న ఆక్రమణల అలజడులతో కుదేలవుతున్న ప్రస్తుత ప్రపంచానికి అంతటి మహానుభావుడి అవసరం ఎంతో అర్థమవుతుంది. మన మధ్యన ఇప్పుడాయన లేకపోయినా ఆ వ్యక్తిత్వాన్ని, కృషిని ఆదర్శంగా తీసుకుంటే ఎంతో మంది ఐన్‌స్టీన్‌లు తయారు కావచ్చు. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించే ఐన్‌స్టీన్‌ జర్మనీలో అతిగా వేళ్లూనుకున్న జాతీయ వాదాన్ని నిరసిస్తూ 'అది మానవత్వానికి మచ్చ' అని అభివర్ణించాడు. నాడు ఆయన చెప్పిన ఈ విషయం ప్రస్తుతం పలు దేశాల్లో వికృతరూపం చూపుతున్న జాతీయవాదాన్ని అంతం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. ఆయుధ పరిశ్రమను 'జాతీయ వాదం వెనుకనున్న దుష్టశక్తి' అని ప్రకటించిన ఆయన శాంతి గురించి నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తిగా, వామపక్షవాదిగా, అంతర్జాతీయ దృక్పథంగల విజ్ఞుడిగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. ఫాసిజానికి వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం కొనసాగించాడు. రెండో ప్రపంచ యుద్ధం చివరలో జపాన్‌పై అమెరికా అణుబాంబును వేయడాన్ని ఐన్‌స్టీన్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు. అటు తర్వాత అణ్వాయుధాలు, ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు, సంస్థలకూ గట్టి మద్దతునిచ్చాడు. ఈ క్రమంలో ఆయన అమెరికాలోనూ పలు అవమానాల పాలయ్యాడు. కష్టనష్టాలెన్ని ఎదురైనా ఏమాత్రమూ వెనుకంజ వేయకుండా శాస్త్రీయ వికాసం, సామాజిక పురోగతి, శాంతిసామరస్యంతో కూడిన ప్రపంచం కోసం అడుగడుగునా కృషి చేసిన ధన్యజీవి ఐన్‌స్టీన్‌