పరమాణువులో కేంద్రకం ఉంటుందని, దాని చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయని పాఠాల్లో చదువుకుని ఉంటారు. ఆ పరమాణు నమూనాని వందేళ్ల క్రితం చాటి చెప్పిన శాస్త్రవేత్తే ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్. ఆయన పుట్టిన రోజు ఇవాళే-1871 ఆగస్టు 30న .కేంద్రక భౌతిక శాస్త్రం (Nuclear Physics) అనేది ప్రస్తుతం ఎంతో ప్రాధాన్యత ఉన్న విభాగం. దానికి ఆద్యుడుగా నిలిచి, కేంద్రక భౌతిక శాస్త్ర పితామహుడిగా పేరొందిన వాడే ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ (Ernest Rutherford). నోబెల్ బహుమతి గ్రహీత అయిన ఈయన రేడియో ధార్మిక పదార్థాలు, వికిరణాలు, పరమాణు సంఖ్య, సెకనులో లక్షోవంతును కొలవగలిగే పరికరాలు, మూలకాల పరివర్తన లాంటి ఎన్నో సిద్ధాంతాలు, ఆవిష్కరణలకు దోహదం చేశారు.
న్యూజిలాండ్‌లోని నెల్సన్‌లో 1871 ఆగస్టు 30న ఓ వ్యవసాయదారుడి 12 మంది సంతానంలో నాలుగో వాడిగా పుట్టిన రూథర్‌ఫర్డ్‌కి చిన్నతనంలోనే సైన్స్ పట్ల అభిరుచి ఏర్పడింది. పదేళ్లకే ఎలిమెంటరీ ఫిజిక్స్ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివేశాడు. న్యూజిలాండ్ విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్‌తో చేరిన అతడు బీఏ, ఎమ్‌ఏ, బీఎస్సీ డిగ్రీలు సాధించాడు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తూనే అత్యంత దూరం నుంచి విద్యుదయస్కాంత తరంగాలను కనిపెట్టి ప్రపంచ రికార్డు సాధించాడు. ఇరవై ఏడేళ్ల వయసులోనే కెనడాలోని మెగిల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరి పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. అక్కడే యురేనియం,థోరియంలాంటి రేడియోధార్మిక పదార్థాలు వెలువరించే ఆల్ఫా, బీటా వికిరణాలను ఆవిష్కరించాడు. రేడియో ధార్మిక విచ్ఛిత్తి (Radio active decay) నియమాలను ప్రతిపాదించాడు. ఒక రేడియో ధార్మిక పదార్థంలో ఉండే సగం పరమాణువులు విచ్ఛిత్తి చెందడానికి పట్టే 'అర్థ జీవిత కాలం' (Half Life Period) ను నిర్వచించాడు. ఈ సూత్రం ప్రకారం భూమి వయస్సును కూడా కనుగొనవచ్చని చెప్పాడు. అలాగే కృత్రిమ మూలకాల పరివర్తన ద్వారా నైట్రోజన్‌ను, ఆక్సిజన్‌గా మార్చవచ్చని తెలిపాడు. ఈ పరిశోధనలకు 1908లో నోబెల్ అందుకున్నాడు.కెనడా నుంచి ఇంగ్లండ్ తిరిగి వచ్చిన తర్వాత సన్నని బంగారు రేకుపై ధనావేశమున్న ఆల్ఫాకిరణాలను ప్రసరింపజేసినప్పుడు కొన్ని వెనక్కి తిరిగి రావడాన్ని గమనించాడు. అందుకు కారణం పరమాణువుల కేంద్రకంలో ఉండే ప్రోటాన్లు వాటిని వికర్షించడమేనని కనుగొన్నాడు. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే, పరమాణువుల్లోని కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయని ప్రతిపాదించాడు. ఇదే రూథర్‌ఫర్డ్ పరమాణు నమూనాగా పేరొందింది. ఆ తర్వాత కేంద్రకంలో ప్రోటాన్లతో పాటు న్యూట్రాన్లు ఉంటాయని ఊహించాడు. ఆయన శిష్యుల్లో చాలా మంది నోబెల్ బహుమతులు సాధించడం విశేషం. అనేక అవార్డులు సాధించిన ఆయన గౌరవార్థం 104 అణుసంఖ్య ఉన్న మూలకానికి రూథర్‌ఫోర్డియం అని పేరు పెట్టారు.