వాల్మీకివారి రామాయణంలో శబరీమాత రామలక్ష్మణుల పాదాలకు నమస్కరించి, అర్ఘ్య పాద్యాలు ఇచ్చాక రాములవారు శబరీమాతను తపస్సు ఎలా సాగుతుందని, క్రోధాన్ని నిగ్రహించుకోగల్గుతున్నావా? మొదలైన వివరాలన్ని అడిగాక ఆమె ఎంతో సంతోషించి ఈ రోజు నా జన్మ సార్థకం అయింది, నా తపస్సు ఫలించింది అని ఎంతో సంతోషంగా చెప్పి, తాను సేవించిన మహర్షుల తపో వైభవం, వాళ్ళు తనకు ఇచ్చిన instructions గురించి చెప్పి, "మయా తు వివిధం వన్యం సంచితం పురుషర్షభ| తవార్థే పురుషవ్యాఘ్ర పంపయాః తీరసమ్భవం|| అని తాను వనంలో సేకరించిన వస్తువులను సమర్పించింది. ఇక్కడ వాల్మీకి మహర్షి వివిధం వన్యం అన్నారే తప్ప అవి పళ్ళా , కాయలా? కందమూలాలా? పుట్టతేనెయా? అని చెప్పలే. ఇవన్ని అడవిలో దొరికేవి కాబట్టి. సో, ఇక్కడ ఎంగిలి ప్రసక్తే లేదు. విజ్ఞానే తాం నిత్యం అబహిష్కృతాం, అని కూడా చెప్తారు వాల్మీకి, అంటే ఆధ్యాత్మిక నియమాలను, విధులను, జ్ఞానాన్ని ఎప్పుడూ అనుసరించేది అని అర్థం. ఇక్కడ రాములవారు తిన్నారో? లేదో? సస్పెన్స్, (రాములవారు కొద్దిగా తీసుకొనే ఉంటారు, ఆయన ఎవ్వర్ని బాధ పెట్టరుగా, అదీ చెప్పలే) ఎందుకంటే వెంటనే ఆయన నాకు మీ ఆశ్రమం అంతా చూపించమని అడుగుతారు. ఆ తల్లి ఆశ్రమ ప్రాంగణం అంతా చూపించి, ప్రతీది వివరించడంలో ఆమె ప్రాజ్ఞత, గురువులపై అత్యంత శ్రద్ధావిశ్వాసాలు , స్వామిపై అనన్య భక్తి వెల్లడి అవుతాయి.
ఇక తులసీదాసుగారి రామాయణంలో, "కంద మూల ఫల సురస అతి దిఏ రామ కహుఁ ఆని| ప్రేమ సహిత ప్రభు ఖాఏ బారంబార బఖాని|| శబరీమాత చాలా రసవంతమైన, రుచికరమైన దుంపలు, వేర్లను, పండ్లను తెచ్చి సమర్పించినదని, ప్రభువులు వాటిని పదే పదే ప్రశంసిస్తూ ప్రేమతో తిన్నారని మాత్రమే ఉన్నది. తరువాత ఆమె తమ గురువుల గురించి, నవ విధ భక్తి గురించి స్వామికి అభివర్ణిస్తుంది. అంటే ఇక్కడకూడా ఆమె గుహుడు, సుమంతుని లా ఎంతో సంస్కారవంతంగా వ్యవహరిస్తుంది.
ఆధ్యాత్మ రామాయణంలో, "సంగృహీతాని దివ్యాని... ఫలాని అమృతకల్పాని దదౌ రామాయ భక్తితః" అనే ఉంది. వీటి అన్నింటిలో కూడా ఆ తల్లి చక్కగా వాళ్ళ పాదాలు కడిగి, నీళ్ళు తలపై చల్లుకొని భక్తితో తాను సేకరించిన పదార్థాలు అర్పిస్తుంది. ఇందులో అయితే నేను కొన్ని వేల సంవత్సరాలనుండి మాగురువుల సేవ చేస్తూ ఇక్కడే ఉన్నాను, (....గురవో మే.... శుశ్రూషాణాం తేషాం కుర్వతీ...బహు వర్ష సహస్రాణి..)అని ఉంది. అంత సంస్కారవంతుల సాంగత్యంలో, పురాణాలు వింటూ, వారి సేవ చేస్తూ కొన్ని వేల ఏళ్ళు నివసించిన వ్యక్తికి ఎంగిలి ఏమిటో తెలియదా? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని గురువుల ద్వారా తెలిసిన ఆమె రాములవారికి తాను రుచి చూసి ఇస్తారా?
రంగనాథ రామాయణంలో కూడా, "వనమూల ఫలములు వలనొప్ప తెచ్చి యిచ్చిన భుజియించి".. అని ఉన్నదే తప్ప టేస్ట్ చూసి ఇచ్చినట్టు లేదు, డాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు అన్నారే తప్ప పాపం! ఏమయ్యా! కూచొని ఆవిడ ఎంగిలి తిన్నావు, అన్నారా? రామదాసుగారు.
మొల్ల రామాయణంలో శబరి పవిత్ర రూపాన్ని వర్ణించి, ఆమెను చూస్తేనే పాపాలు దగ్ధం అవుతాయని వర్ణించి, రామలక్ష్మణులను భక్తితోపూజించినదనే వర్ణించారు మొల్ల.
స్కందపురాణం, బ్రహ్మఖండంలోని ధర్మారణ్య ఖండంలో, "అగ్రతః ప్రయయౌ రామో లక్ష్మణః తత్పదానుగః| పంపాభ్యాశం అనుప్రాప్య శబరీం అనుగృహ్య చ|| అని, పంపాతీరంలో శబరిని అనుగ్రహించారన్నట్టే ఉంది, పళ్ళు గట్రా ఆఫర్ చేసినట్లు ఆ వివరాలు లేవు.
పద్మ పురాణంలో, ఉత్తరఖండలో శబరి గురించి ఉంది, ...ఫలాని చ సుగంధీని మూలాని మధురాణి చ|| నివేదయామాస తదా రాఘవాభ్యాం దృఢవ్రతా| ఫలాని ఆస్వాద్య కాకుత్స్థః తస్యై ముక్తిం దదౌ పరాం| అని ఉన్నది . ఇక్కడ ఫలాని ఆస్వాద్య అనేది కొంచం ట్రిక్కీ గా ఉందేమో, ఫలాని ఆస్వాద్య కాకుత్స్థః-రాముడు పళ్ళు తిని ముక్తి ప్రసాదించారు, ఫలాని ఆస్వాద్య నివేదయామాస అంటే వాటిని టేస్ట్ చేసి బాగున్నాయి అనుకున్నాక, “స్వామీ! బాగున్నాయి తినండి” అని శబరి అని ఉండొచ్చా? అలానే అయినా, జస్ట్ ఇమాజిన్ ఆవకాయకి కాయలు ఏరుతున్నాం, అన్నీ పటపటా కొరికి చూస్తామా? వాటి రూపురేఖా విలాసాలతో మనకు తెల్సిపోతుంది కదా, పోనీ, చాకుతో చిన్న ముక్క కోసి చూస్తాం, అదికూడా ఏదో ఒక్క కాయ, అంతేగా, అడవిలో కందమూల ఫలాలు తినేవాళ్ళ దగ్గర చాకు గట్రా ఉండవా? రోజూ కోసేవాళ్ళకి, ఏరేవాళ్ళకి ఏ పళ్ళు ఎలాంటివో అనుభవమే చెప్తుందిగా, దాని కోసం కొరికి చూడాలా? శ్రీరామా! పైగా ఆవిడ వయసేంటి, పళ్ళు నోట్లోవి ఉన్నాయో లేవో కూడా తెలియదు, కొరకడం ఎలా?
లక్ష్మీ నారాయణ సంహిత మొదటి ఖండంలో "ఫలాని చ సుపక్వాని మూలాని మధురాణి చ|| స్వయం ఆస్వాద్య, మాధుర్యం పరీక్ష్య పరిభక్ష్య చ | పశ్చాత్ నివేదయామాస శబరీ ప్రాణదాయినే || అని ఉంది, అంటే తాను తీసుకు వచ్చిన ఫలాలు కందమూలాలు రుచి చూసి ఇచ్చినట్టుగా ఉంది, అయినా నోటితో కొరికి తిని ఇచ్చిందని ఆ మహాతల్లిని అనవచ్చా? ఏ చాకుతోనో కోసి చూడొచ్చు, లేదా మొత్తం lot లోంచి (మనం fruits' shop లో చెయ్యమా? అలాగే చూసి ఇచ్చారేమో?) అయినా పూర్వకాలపు లెక్క ప్రకారం ఇది ఎంగిలే .
కొరికి రుచి చూసి ఇచ్చింది అనే ఎంగిలి ప్రసక్తి ఎలా? ఎక్కడనుండి ఆవిర్భవించింది? కలియుగంలో ముస్లింల ఇంగ్లీషువాళ్ళ పరిపాలనాకాలంలో వాళ్ళ దగ్గరనుండి నేర్చుకొని అనుకరించిన వాటిలో ఇది ఒకటై ఉండవచ్చు. వాళ్ళకి ఇలాంటి పట్టింపులు లేవు, ఆంగ్లంలో ఉచ్చిష్టము-> ఎంగిలి అనే పదమే లేదు.
ఇంతకుముందు దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏ గారెలో బూరెలో ఒకటి ఇవ్వమ్మా, అంటే, తప్పు, ఎంగిలి చేయకూడదు, అని చెప్పేవాళ్ళు, మొత్తం లాట్ లోంచి ఒక్కటి తిన్నా మొత్తం ఎంగిలి అయినట్టే లెక్కగా. పాపం, ఆవిడ ఏ గోరుతోనో చాకుతోనో గిల్లి ఆ! భేష్,భేష్! నన్డ్రాహ ఇరుకు, బాగుంది అని అనుకొని పెట్టిందనడానికి కూడా ఆస్కారం లేదు, ఎందుకంటే బాల్యంనుండి ఆశ్రమంలో మతంగ మహర్షి సేవలో గడిపిన ఆ తల్లికి రుచి చూసి పెట్టే కుసంస్కారం ఉంటుందా? నారదులవారు తమ పూర్వ జన్మలో ఒక దాసీ కొడుకట, చిన్న పిల్లవాడు, నాలుగు నెలలు, చాతుర్మాస్యంలో ఉన్న మహర్షులకు సేవ చేస్తూ వాళ్ళ మాటలు మంత్రాలు వారి ఆచరణ విని వారి జీవనశైలి చూసి ప్రభావితుడై తల్లి పాముకాటుతో మరణించగానే కనీసం ఏడవకుండా విరక్తితో అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసి మెల్లగా నారదునిగా మారారు, అది వాళ్ళ వాళ్ళ సంస్కారబలం కదా! శబరీ మాత కూడా చిన్నప్పటినుండే మతంగ మహర్షి ఆశ్రమంలో, వారి శిష్యుల మధ్య పెరిగారు కదా, ఇలా చేస్తారా? అయితే కన్నప్ప గురించి చెప్పినపుడు మల్లాది గురువుగారు ఒకటే అన్నారు-ప్రాకృతిక భక్తి, తెలియదు, చేసావు, తప్పులేదు, తెలిసి చేస్తే ముప్పు!!!
ఏమిటో!! త్రేతాయగంలో వాళ్ళని కూడా మనం వదలం, పాహి రామా ప్రభోఓఓఓఓ!
ఇంత కంఠ శోష ఎందుకంటే రామాయణ విషయాలు వెదుకుతుంటే ఎన్నో వెబ్ సైట్లలో ఇదే చర్చ, శబరి ఎంగిలి పళ్ళు పెట్టిందా? రాముడు తిన్నాడా? ఇంతకంటే మంచి విషయాలు డిస్కస్ చేసుకోడానికి రామాయణంలో ఏం లేవా? ఒకసారి ఆలోచించండి. అన్న-దమ్ములమధ్య, భార్యాభర్తల మధ్య understanding, పటిష్ఠమైన స్నేహ బంధం. పరిపాలనా వ్యవస్థ, మాటతీరు, శత్రువులలో కూడా ఉన్న మంచిని ప్రశంసించగలిగే సంస్కారం ఇలాంటివి కోకొల్లలు. వాటిని విశ్లేషించి అనుసరించకుండా ఎంగిలి తిన్నారా? మాంసం తిన్నారా? సీతకు అన్యాయం చేసారా? అని వాపోతాము. అగ్ని పరీక్ష తర్వాత పుష్పక విమానంలో సీతమ్మను అంతమంది వానరుల ముందే ఎంచక్కా ఒళ్ళో కూచోబెట్టుకొని, ఒక్కొక్క స్థలం చూపిస్తూ, అక్కడ ఏం జరిగిందో ఆమెకు చెప్తుంటారు రాములవారు. ఆ event అయిపొయింది, అంతే ఇద్దరూ దాన్ని మనసులోనుండి తీసేసారు, చక్కగా రెండో తరగతి పూర్వకాలపు పిల్లల్లా కలిసిపోయారు. ఇవి కదా మనం నేర్చుకోవాలి.
పరుల కలిమికి పొర్లి ఏడ్చే పాపికి ఎక్కడ సుఖము కలదోయ్?
ఒకరి మేల్ తన మేలని ఎంచే నేర్పరికి మేల్ కోకొల్లలోయ్!