మన హిందూ ధర్మంలో, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ ప్రాంతపు వారైనా సరే, ఎంగిలి చేసినది భగవంతుడికి నైవేద్యం పెట్టకూదడని, నైవేద్యానికి పనికిరాదని భావిస్తారు, తమ పిల్లలకి చిన్నప్పటినుండే ఈ విషయం నేర్పిస్తుంటారు. మన దేశపు అన్ని భాషలలోనూ దీనికి అంటూ ప్రత్యేక పదం ఉన్నది,
దేవుడికి నైవేద్యం పెట్టకుండా ఏం తినకూడదు. ఎంగిలి చేసింది నైవేద్యం పెట్టవచ్చా? ప్రతి తల్లి తన పిల్లలతో చెప్పే మాటే ఇది. అలాగే बॆटा, भगवान को भोग चढाने से पहले नहीं खाते, भगवान को जूठन थॊडी चढायेंगे?అని హిందీలో, दोवोरे मांग जिनीश ना दी" (dowore maang jinish naa di") అని same మణిపూరి భాషలో కూడా. అలా మన అన్ని భాషలలోనూ, మన సంస్కారంలోనూ ఆ విషయం అచ్చువేయబడి ఉంది. అయితే భక్త కన్నప్ప లాంటివారు exceptions. రుచి చూసి పెట్టడానికి మాత్రం ఆయనతో కంపేర్ చేసుకున్నట్లయితే కను గుడ్లు పీకిపెట్టడానికి కూడా మనం సిద్ధపడాలిగా! భగవంతునిపై అంత ప్రేమ మనకు ఉందా? కంపేర్ చేసుకుంటే అన్నింటా చేసుకోవాలి కదా! మన సౌకర్యం బట్టి రూల్స్ ఎమెండ్ చేస్తే ఎలా?
ఫర్ ఎగ్జాంపుల్ గారెలకి పిండి తయారుచేసి, శ్రీరామా! ఇందులో ఉప్పు వేసానో? లేదో? అని టేస్ట్ చేసినా, ఒక 20 గారెలు చేసి లోపలి పిండి ఉడికిందా? లేదా? అని అందులో ఒక ముక్క తుంపి నోట్లో వేసుకున్నా-
"వెరసి ఉప్పుకై పిండి రుచి చూసిన, వేగినవా
చక్కగ? లేదా? యనుచు నోట వేసినన్, మనసున
తినవలెన నించుక కోర్క కలిగినన్ అది
ఎంగిలియే యౌట నిక్కము సుమతీ! " అని. ఎంగిలి అంటే మొత్తం పరపరా పళ్ళతో నమలడం కాదు. తినేసి మన ఎంగిలి చేయి అందులో పెట్టడమూ కాదు. చేసిన పదార్థాలు అన్నింటిని, మనకు అంత స్తోమత ఇచ్చిన ఆ భగవంతుడికి ప్రేమతో 'ముందు ఇవి అన్ని నీవు రుచి చూడు తండ్రీ!' అని మనసా, వాచా, కర్మణా నివేదించుకోవడమే నైవేద్యం కదా! నిజంగా ఆ భగవంతుడు మొత్తం తినేటట్లయితే... అయ్యబాబోయ్! మనం అసలా ...నైవేద్యం అన్న మాటే convenient గా మర్చిపోతాం. దీనికి సంబంధించిన , అంటే మర్చిపోవడం గురించి కాదు సుమా, ముందుగా తినడం గురించి, మన పురాణాలలో చాలా కథలే ఉన్నాయి. అందులో ఇక్ష్వాకులతో అంటే మన రాములవారి వంశంతో సంబంధం ఉన్న ఒక వృత్తాంతం చూద్దాం. ఇది మొదట నేను భాగవతంలో చదివాను. తర్వాత చూస్తే పద్మ, విష్ణు, హరివంశ, గరుడ, బ్రహ్మ, బ్రహ్మాండ, భవిష్య పురాణాలలో కూడా ఈ వృత్తాంతం ఉంది:
మను చక్రవర్తికి ఇక్ష్వాకు మహారాజు పుత్రుడైతే ఆయనకు వందమంది కొడుకులు, వారిలో వికుక్షి (పెద్దవాడు), నిమి, దండక అనే ముగ్గురు ప్రముఖులు. 25మంది పుత్రులు ఆర్యావర్తపు పశ్చిమ భాగాన్ని, 25 మంది తూర్పు భాగాన్ని పరిపాలించగా, పై ముగ్గురు మధ్య భాగంలో మూడు ప్రధానరాజ్యాలను, మిగిలిన 47 మంది వివిధ ప్రాంతాలను పరిపాలించారు.
జనవరి, ఫిబ్రవరి,మార్చ్ నెలల్లో చేసే పితృకర్మలని అష్టక శ్రాద్ధం అంటారు. ఇవి బహుళపక్షంలో చేస్తారు. ఇక్ష్వాకు మహారాజు పితృకర్మలు చేయడానికి సన్నద్ధులు అవుతూ, పుత్రుడైన వికుక్షిని అరణ్యానికి వెళ్ళి, వేటాడి, [1]శ్రాద్ధకర్మకు కావలసిన తాజా మాంసం తెమ్మని చెప్తారు.
సరే, అంటూ వికుక్షిగారు వేటకి బయల్దేరి, బోలెడు బోలెడు మృగాలను వేటాడారు. చాలా అలసిపోయి, ఆకలి వేసి ఒక బుజ్జికుందేలుని కాల్చుకొని తిని ఆకలి తీర్చుకున్నారు. భవనానికి వచ్చి చూపిస్తే తండ్రిగారు చాలా సంతోషించారు. వాళ్ళ కుల గురువు, కుల పురోహితులు [2]వశిష్ఠులవారు వచ్చి, చూసి, "ఇవి ఎంగిలి పడ్డాయి, శ్రాద్ధ కర్మకు పనికి రావు," అని చెప్పగానే తండ్రి కోపించి పుత్రుణ్ణి , పాపం అంత మంచివాణ్ణి, రాజ్య బహిష్కారం చేసారు. అప్పటినుండి ఆయన original name పోయి [3]శశాదుడు అని పిలవడం ప్రారంభించారు. శశ అంటే కుందేలు అద అంటే తిన్నాడు అని, కుందేలుని తిన్నవాడు అనే పేరే పాపం! ఆయనకు చరిత్రలో/పురాణాలలో శాశ్వతంగా నిలిచి పోయింది. పరశురాముడికి భయపడి అశ్మకుడి పుత్రుడైన బాలికుడు అంతఃపురంలో స్త్రీల మధ్య దాక్కుంటే ఆయన పేరు నారీకవచుడు అని స్థిర పడిపోయింది.
ఇదీ మన ఎంగిలి concept. భగవంతుడు మనకంటే చాలా చాలా మహోన్నతుడు, పరమ ఆత్మ. పరమ పవిత్రుడు, ఉత్కృష్టుడు, కాబట్టి, ఆ దైవానికి నివేదించేది ఏదైనా అన్ని రకాలుగా పరమ పవిత్రంగా ఉండాలి, ఉంచాలి, ఇది మన ఆర్ష ధర్మం. ఆచరించగలిగితే మనకే లాభం.
(ఇక వికుక్షిగారి విషయానికివస్తే, ఇక్ష్వాకు మహారాజు మరణించాక ప్రజలు ఆయన్ని ప్రాధేయపడి, పిలిచి మళ్ళీ రాజుని చేస్తారు. వారి పుత్రుడే పురంజయుడు. ఈయన పేరునే రాములవారి వంశానికి కాకుత్స్థ వంశం అని పేరు వచ్చింది. అదంతా వేరే చోట మాట్లాడుకుందాం.)
[1] అపుడు శ్రాద్ధకర్మలలో మాంసం పెట్టేవాళ్ళా? మరి అయితే మనం కూడా పెట్టవచ్చా? ఎంచక్కా తినవచ్చా? so called బ్రాహ్మణ పురోహితులు, అంత నిష్ఠాగరిష్ఠులైన మహర్షులు మాంసం తినేవాళ్ళా?వేంఠనే మనకు మెయిన్ కథ హుష్,కాకి అయి, side track లోకి వెళ్ళిపోతాము. ఇది కృతయుగం/సత్యయుగం నాటి మాట. వాళ్ళు ఏం తిన్నా ఆబ లేదు, నిగ్రహం ఉండేది, ఆత్మ సంయమనం ఉండేది. వాళ్ళు యుగాలు యుగాలు-సినిమాలు, టివీలు. లాప్ టాప్ లు, సెల్ ఫోన్లు గట్రా లేకుండా బ్రతికారు. ఇవన్నీ ఉన్నా మనకు వంద ఏళ్ళకే, అబ్బ, బోర్ యార్, its so boring, అంటూ బాధపడ్తున్న dialogues చాలా frequent గా వింటున్నాం కదా! So, comparisons మాని అందులోని మంచిని మాత్రమే గ్రహిస్తూ, మన సంస్కృతిని ప్రేమించుమన్నా! మంచి అన్నది పెంచుమన్నా! అనుకుందాము
[2]చూడండి, కృతయుగంనుండి వశిష్ఠులవారు ఎంత కాలం జీవించారో!
[3]అంటే మనకు nick names అనేవి పురాణకాలంనుండే ఉన్నాయి అన్నమాట. కొంచం అయోమయంగానో, అమాయకంగానో ఉన్నవాళ్ళని, వాడు ఓ దేభ్యం, వాడో అయోమయం జగన్నాథం అనో, చీటికి మాటికి ఏడ్చేవాళ్ళని ఏడ్పుకొట్టు అనో, ఎక్కువగా cheat చేసేవాళ్ళని రోత్రీతొండీ అని అనేవాళ్ళం, అసలు ఈ పదం ఏ భాషకు సంబంధించిందో కూడా తెలియదు. Nick names' Root ఇక్కడినుండే అన్నమాట.