శబరీ మాత గురించి మన ఊహలు, అపోహలు :
శబరీ మాత గురించి మన ఊహలు, అపోహలు :
గురువుగారి 5వ ఎపిసోడ్లో శబరీమాత గురించి ప్రస్తావన ఉంది అందుకని ముందుగా దాని గురించి కొంత మనం మాట్లాడుకుందాం.
వాల్మీకి రామాయణంలో (3.74.4, 3.74.7) వాళ్ళ పాదాలకు నమస్కరించి, అర్ఘ్య పాద్యాలు ఇచ్చాక రాములవారు శబరీమాతను (3.74.8-9) తపస్సు ఎలా సాగుతుందని, క్రోధాన్ని నిగ్రహించుకోగల్గుతున్నావా?మొదలైన వివరాలన్ని అడిగాక ఆమె ఎంతో సంతోషించి ఈ రోజు నా జన్మ సార్థకం అయింది, నా తపస్సు ఫలించింది అని ఎంతో సంతోషంగా చెప్పి, తాను సేవించిన మహర్షుల తపో వైభవం, వాళ్ళు తనకు ఇచ్చిన instructions గురించి చెప్పి, "మయా తు వివిధం వన్యం సంచితం పురుషర్షభ| తవార్థే పురుషవ్యాఘ్ర పంపయాః తీరసమ్భవం||(3.74.17) అని తాను వనంలో సేకరించిన వస్తువులను సమర్పించింది. ఇక్కడ వాల్మీకి మహర్షి వివిధం వన్యం అన్నారే తప్ప అవి పళ్ళా , కాయలా? కందమూలాలా? అని చెప్పలే. ఇవన్ని అడవిలో దొరికేవి కాబట్టి. అందుకే గురువుగారు పుట్టతేనె కూడా చెప్పారు. సో, ఇక్కడ ఎంగిలి ప్రసక్తే లేదు. పైగా రాములవారు తిన్నారో లేదో సస్పెన్స్, ఎందుకంటే వెంటనే ఆయన నాకు మీ ఆశ్రమం అంతా చూపించమని అడుగుతారు. అయితే ఎంగిలి ప్రసక్తి ఎలా? వాళ్ళ వాళ్ళ భావనాబలం, భక్తి, సంస్కారం, ఆనాటి సామాజిక స్పృహ ఇవి ఆధారంగా ఏ రచనలోనో చోటు చేసుకుందేమో??
రంగనాథ రామాయణంలో కూడా, "వనమూల ఫలములు వలనొప్ప తెచ్చి యిచ్చిన భుజియించి.. అని ఉన్నదే తప్ప టేస్ట్ చూసి ఇచ్చినట్టు లేదు, ఆధ్యాత్మ రామాయణంలో, "సంగృహీతాని దివ్యాని... ఫలాని అమృతకల్పాని దదౌ రామాయ భక్తితః" అనే ఉంది. డాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు అన్నారే తప్ప పాపం! ఏమయ్యా! కూచొని ఆవిడ ఎంగిలి తిన్నావు, అన్నారా? రామదాసుగారు.
అయితే గురువుగారు పరీక్షితాని మయా మధురాణి రసవంతిచ ఫలాని, అనే పాదంలోని పరీక్షితాని అనే పదాన్ని తప్పుగా ఇన్టర్ ప్రిట్ చేసారు అని చెప్పారు, జస్ట్ ఇమాజిన్ ఆవకాయకి కాయలు ఏరుతున్నాం, అన్నీ పటపటా కొరికి చూస్తామా? వాటి రూపురేఖా విలాసాలతో మనకు తెల్సిపోతుందిగా, పోనీ, చాకుతో చిన్న ముక్క కోసి చూస్తాం, అదికూడా ఏదో ఒక్క కాయ, అంతేగా, అడవిలో కందమూల ఫలాలు తినేవాళ్ళ దగ్గర చాకు గట్రా ఉండవా, శ్రీరామా! పైగా ఆవిడ వయసేంటి, పళ్ళు నోట్లోవి, ఉన్నాయో లేవో కూడా తెలియదు,
స్కన్దపురాణం, బ్రహ్మఖండంలోని ధర్మారణ్య ఖండంలో,అధ్యాయం 30,శ్లోకం 31 లో, "అగ్రతః ప్రయయౌ రామో లక్ష్మణః తత్పదానుగః| పంపాభ్యాశం అనుప్రాప్య శబరీం అనుగృహ్య చ|| అని, పంపాతీరంలో శబరిని అనుగ్రహించారన్నాట్టే ఉంది, పళ్ళు గట్రా ఆఫర్ చేసింది ఎక్కడ ఉందో తెలియలే.
పద్మ పురాణంలో, ఉత్తరఖండలో Ch 242లో, 268,269,270 శ్లోకాలు శబరి గురించి చెప్తున్నాయి, ...ఫలాని చ సుగంధీని మూలాని మధురాణి చ|| నివేదయామాస తదా రాఘవాభ్యాం దృఢవ్రతా| ఫలాని ఆస్వాద్య కాకుత్స్థః తస్యై ముక్తిం దదౌ పరాం| అని ఉన్నది (6.242.270) ఇక్కడ ఫలాని ఆస్వాద్య అనేది కొంచం ట్రిక్కీ గా ఉందేమో, ఫలాని ఆస్వాద్య కాకుత్స్థః-రాముడు పళ్ళు తిని ముక్తి ప్రసాదించారు, ఫలాని ఆస్వాద్య నివేదయామాస అంటే వాటిని టేస్ట్ చేసి బాగున్నాయి అనుకున్నాక, “స్వామీ! బాగున్నాయి తినండి” అని ఉండొచ్చా?
ఫలాని చ సుపక్వాని మూలాని మధురాణి చ|| స్వయమాస్వాద్య మాధుర్యం పరీక్ష్య పరిభక్ష్య చ | పశ్చాన్నివేదయామాస శబరీ ప్రాణదాయినే || అని లక్ష్మీ నారాయణ సంహిత మొదటి ఖండంలో 422 అధ్యాయంలో 72, 73 శ్లోకాలలో ఉంది, అంటే తాను తీసుకు వచ్చిన ఫలాలు కందమూలాలు రుచి చూసి ఇచ్చినట్టుగా ఉంది, అయినా నోటితో కొరికి తిని ఇచ్చిందని ఆ మహాతల్లిని అనొచ్చా? ఏ చాకుతోనో కోసి చూడొచ్చు, లేదా మొత్తం లాట్ లోంచి (మనం ఫ్రూట్స్ షాప్ లో చెయ్యమా? అలాగే చూసి ఇచ్చారేమో?) అయినా పూర్వకాలపు లెక్క ప్రకారం అది ఎంగిలే
ఇంతకుముందు దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏ గారెలో బూరెలో ఒకటి ఇవ్వమ్మా, అంటే, తప్పు, ఎంగిలి చేయకూడదు, అని చెప్పేవాళ్ళు, మొత్తం లాట్ లోంచి ఒక్కటి తిన్నా మొత్తం ఎంగిలి అయినట్టే లెక్క. మనం ఉప్పు, కారం, తీపి ఎలా ఉన్నాయని ఏ స్పూన్ తోనో రుచి చూసినా మొత్తం ఎంగిలి అయిపోయినట్టే అన్నమాట, పాపం, ఆవిడ ఏ గోరుతోనో చాకుతోనో గిల్లి ఆ! భేష్,భేష్! నన్డ్రాగ ఇరుకు, బాగుంది అని అనుకొని పెట్టిందనడానికి కూడా ఆస్కారం లేదు, ఎందుకంటే శబరి బాల్యంనుండి ఆశ్రమంలో ఋషుల సేవలో గడిపిన తల్లికి రుచి చూసి పెట్టే సంస్కారం ఉంటుందా? నారదులవారు తన పూర్వ జన్మలో ఒక దాసీ కొడుకట, చిన్న పిల్లవాడు, నాలుగు నెలలు, చాతుర్మాస్యంలో ఉన్న మహర్షులకు సేవ చేస్తూ వాళ్ళ మాటలు మంత్రాలు వారి ఆచరణ విని వారి జీవనశైలి చూసి ప్రభావితుడై తల్లి పాముకాటుతో మరణించగానే కనీసం ఏడవకుండా విరక్తితో అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసి మెల్లగా నారదుడిగా అయ్యారు, అది వాళ్ళ వాళ్ళ సంస్కారబలం కదా! శబరీ మాత కూడా చిన్నప్పటినుండే మతంగ మహర్షి శిష్యుల మధ్యవారి ఆశ్రమంలో పెరిగింది కదా, ఇలా చేస్తారా? అయితే కన్నప్ప గురించి చెప్పినపుడు గురువుగారు ఒకటే అన్నారు-ప్రాకృతిక భక్తి, తెలియదు, చేసావు, తప్పులేదు, తెలిసి చేస్తే ముప్పు!!!
త్రేతాయగంలో వాళ్ళని కూడా మనం వదలం, పాహి రామా ప్రభోఓఓఓఓ!
ఇంత కంఠ శోష ఎందుకంటే గురువుగారు చెప్పిన ఔట్ ఆఫ్ రామాయణ విషయాలు వెదుకుతుంటే ఎన్నో వెబ్ సైట్లలో ఇదే చర్చ, శబరి ఎంగిలి పళ్ళు పెట్టిందా? రాముడు తిన్నాడా? ఇంతకంటే మంచి విషయాలు డిస్కస్ చేసుకోడానికి ఇందులో ఏం లేవా? ఒకసారి ఆలోచించండి.
ప్రసన్న కుమారి