ఆకాశమంత మేఘావృతమై ఉంది. మేఘాలన్నీ మూకుమ్మడిగా దాడి చేయడంతో సూర్య భగవానుడు ఏ మారుమూలో దాక్కొని ఉన్నట్టున్నాడు. పాపం! పూలమ్మిన చోట కట్టలు అమ్మలేడుగామరి. ఏం చేద్దాం? సరే, ఇలాంటి వాతావరణంలో వేడిగా కమ్మగా పిల్లలకి బజ్జీలు చేసిపెడదామని వంటింట్లోకి వెళ్లాను. మొన్ననే సర్ఫ్ పెట్టి తోమి తుడిచి అందంగా అమర్చిన స్టీలు డబ్బాలు సీసాలతో వంటిల్లు తళ తళలాడుతుంది. హైట్సులవారీగా అమర్చిన సీసాలు ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క కుటుంబ సభ్యుల్లా ఒకే చోట ఉండి ముచ్చట్లు చెప్పుకుంటున్నాయా అన్నట్టు ఉన్నాయి. ఇంతలో.....
నేనొక షెల్ఫ్ కడ నిలిచి, చివాలున తలుపు తెరిచి, బాటిల్లుపై చేయానిడు.....నం....త....లో.. అంటూ సమస్యాపూరణం చేస్తున్న సహస్రావధానిలా మళ్ళీ మళ్ళీ మెల్లగా పాడుతుంటుంటే...
"ఎహె, ఎన్నిసార్లు అదే అదే చెప్తావు, చాల్లే ముందుకు పో," అంటూ లోపల నుండి నా అంతరాత్మ గావు కేక, ఇది మా అమ్మకి substitute, ఊపిరి పీల్చుకోనివ్వదు అనుకుంటూ, "అదే వద్దు అంటున్నా, నన్ను complete చేయనివ్వకుండా ఏంది నీ కాకి గోల? మళ్లీ మూడోతూరు గేయగానం మొదలెట్టాలిగా.. అదే నా ఏడ్పు.
కాకిగోలనా? అది పూర్వాశ్రమం మాట లచ్చమ్మా, ఇప్పుడు అన్ని FlatsE, చెట్లు కొట్టేస్తున్నారు, కాలువలు పూడ్చేస్తున్నారు, పాపం కాకులకి ప్లేస్ ఏడుంది? అన్నీ వలస పోయాయిగా , కాకి ఒకటి నీళ్ళకై, కావు కావు మనుచును.. .. అంటూ ఇపుడు పిల్లలకి పాటలే లేవు, గాఢంగా నిట్టూర్చింది అంతరాత్మ.
అయితే మరి ఏ గోల అనాలి సెప్మా?నా సందేహం.
Cell Phone గోల అను, ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ అధమపక్షం రెండు రెండు సెల్లులుంటాయిగా.
అరె , ఉండవమ్మా, ఉండు, నేను ఎక్కడున్నానబ్బా? కొద్దిగా ఆలోచనలో పడి.....
ఆ.. ఆ..
నేనొక shelf కడ నిలిచి,
చివాలున తలుపు తెరిచి
బేసిన్ సీసాపై చేయానిడునంతలోన..
antsలన్నియు జాలిగా నోళ్లు విప్పి
హ హ మా నోటికాడి fooddu తీసెదవా ? అంటూ బావురుమన్నవి ఆకలి బాధతో.
దిక్కుతోచని వాటి దృక్కు చూసి
నా మానసమందేదో తళుక్కుమన్నది
ఘృతాళికా విలాప కావ్యమై.
హాయ్, భలే భలే వచ్చిందిలే, నా ఆనందానికి బ్రేకు వేస్తూ...
ఘృతాళిక ఏంటి?
పిపీలిక, ఇది కూడా తెలియదా? అనే తేలిక ధోరణిలో జవాబిచ్చా.
నాకు బానే తెల్సు కాని ఘృతాళిక, పిపీలిక ఏంటి, చక్కగా చీమ అనలేవు ? కొద్దిగా కోప్పడింది అంతరాత్మ.
చూడమ్మా, మన భాషాపదాలన్ని మర్చిపోతున్నారు, కొద్దిగా గుర్తుచేద్దామని నా తాపత్రయం, నేను సైతం భాష సేవకు వెర్రిగొంతుకనిచ్చి చూస్తాను...అయినా ఇంతకుముందే Ant అని ఆంగ్లపద ప్రయోగం చేసాస్మీ, So, guess work చేస్తారమ్మా Readers. పాఠకులా? మజాకా?
సరేకాని లచ్చమ్మా, బేసిన్ సీసా ఏంటి తమాషాగా నవ్వుతూ అడిగింది.
బేసిన్ అంటే శనగపిండి.
దీనికంటె పిపీలికయే ఈౙీగా ఉందిగా, నా ఆత్మ వెటకారం.
ఇదిగో, నువ్వు జన్మలలలలల..... నుండి పుడ్తూ పోతూ కూడా ఒక్క భాష అంటించుకోలే, కాని ఇప్పుడో, మూడేళ్ళ పిల్లలు కూడా ఎంత updating, ఎంత advancingO??? గూగులు, క్రోములు, ట్విట్టర్లు, స్విగ్గీలు...
అల్లొ అల్లో...దానికి నేనడిగిన బేసిన్‌కి సంబంధం ఏంతంతావ్?
అంతరాత్మది బొత్తిగా ఓపిక లేని వ్యవహారం, నిస్సందేహంగా ఇది మా అమ్మే, 'అ' అన్నాక రెండోసారి మళ్ళీ 'అ' అననివ్వదు.
అదేగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కొద్దిగా విసుగ్గా అన్నాను.
హా, ఎక్స్ప్లెయినా??? అని పెద్దగా నవ్వుతూ, కొండలమధ్య ప్రవహిస్తున్న చంద్రభాగా నదిని విశ్వనాథవారు వర్ణించినట్లు వర్ణిస్తున్నావ్, ఎంతకీ అవదే, ఎన్ని పుటలు తిప్పను?
ఇదిగో , చూడు ఆత్మన్, నువ్వు సభా మర్యాద నేర్చుకోవాలి, ఒకరు మాట్లాడ్తుంటే పూర్తిగా, పూర్వకాలం హరికథ విన్నంత ఓపిగ్గా వినాలే తప్ప సభామర్యాదోల్లంఘన చేయకూడదు, గట్టిగా warning ఇచ్చా.
సభ అంటే వ్యక్తుల సమూహం, ఎక్కడమ్మా సభ?
నేను, నా కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, మనో,బుద్ధ్యహంకార చిత్తాలు, ప్లెస్ నువ్వు.. సభ కాక......మరేంటి?
సరే, మొండివాడు రాజుకంటె బలవంతుడు, కానీ... కంటిన్యూ..
ఉండవోయ్, నా లింకు పోయింది, అందుకనే శ్రోతలు నోరుమూసుకొని వింటే వక్తకు బాధ ఉండదని వద్దిపర్తివారు పదే పదే చెప్తారు.
అప్పుడది ప్రవచనం అవుతుందేమో? Discussion అవదేమో??? ఆత్మ డౌట్.
ఇక అంతరాత్మను ఇగ్నోర్ చేస్తూ డబ్బా మూత తెరిచి చూస్తే, అయిదు బెడ్రూముల Villa లో విహరిస్తున్న Rich kids లా అటు ఇటు తిరుగుతున్నాయి చీమలు. Disturb చేసానన్న కోపంతో రెండుమూడు నన్ను attack చేసి Calcium combined with Iron Injections వాటికి వీలయిన చోటల్లా ఇచ్చాయి. అబ్బా అబ్బా అనుకుంటూ దులుపుకుంటూ, అరె, అన్ని స్టీలు డబ్బాలే, ఈ పక్కనే చక్కర, బెల్లం, బిస్కట్లు, ఇన్ని ఉంటే బేసినీకి సీమలేటబ్బా, స్వగతాన్ని ప్రకాశంగా అనేసా నా అలవాటు ప్రకారం.
మీరు మాత్రం పిజ్జాలు, బర్గర్లు, మోమోలు గట్రా తినడంలే, we too wanted some change yaar, after all we are also living beings, हमने देखा कि ढक्खन थोडा ढीला है, बस, अंदर घुस गए, అకటా....ఆ..ఆ..ఆ, మీ మానవులెంత కఠోర హృదయులు!!! మా కడుపులు కొట్టి మా రసాస్వాదనకు అడ్డుపడే మీరెంత దురాత్ములు. క్రూరులు నడుం మీద చేతులు పెట్టుకొని కోపంగా అంది నాతో ఒక చీమ.
గెమాక్సిన్నులు, బేగాన్స్ప్రేలు, వేడినీళ్ళు, ఇవి కాక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని, మల్లాదివారు కాకిమీద అన్నారనుకో, అది వేరే విషయం. ఇక్కడ అప్రస్తుతం, బుజ్జి తర్జని చూపిస్తూ అన్నది,
హ్హు.. లక్ష్మణులవారు ఎన్నడూ గీయని ఒక రేఖని సృష్టించి, దానికి లక్ష్మణరేఖ అని ఆయన పేరు పెట్టి ఆయన characterని, ఆయన Chivalryని, ఆయన ఉదారతను assassinate చేస్తూ, ఆయన్ని కించపరుస్తూ మాలాంటి అల్ప జీవులను మూకుమ్మడిగా చంపుతున్న మీరెంత నిష్ఠుర, నికృష్ట, కఠిన, కర్కోట,దుష్ట చిత్తులు??? ఇది genocide కంటె, ఒక Blackhole tragedy కంటే ఏం తక్కువ? ఎంత క్రూరత??? ఇదా మీ మానవత్వం?" అంటూ ఎస్ వి రంగారావుగారిలా మేఘ గంభీర స్వరంతో అన్ని intonations తో diologues చెప్తూ, హయినా మేమెంత? మా తిండి ఎంత? సముద్రంలో నీటి చుక్కంత... (అని sudden గా NTR అయిపోయింది,)
సముద్రంలో కాకి రెట్టంత కదా అసలు సామెత??? నా మనసులో సందేహం, కాని సభా మర్యాద గుర్తొచ్చి నోరు మెదపితే ఒట్టు.
దాని వాగ్ఝరీ ఇలా సాగుతూనే ఉంది,....మీరు ఇన్ని రకాలుగ మమ్మల్ని హింసించాలా? దత్త చరిత్రలు, సాయిబాబా చరిత్రలు, గురు చరిత్రలు ఇన్ని చదువుతారే ఏం లాభం? పాపం, చీమలు కూడా భగవంతుడి ప్రతిరూపాలే అనుకోవాలిగా, ఊహు అనుకోరు,
సాయిబాబా తమ భిక్షని అంతా, గిన్నెలో కలిపి, ఆ ఆహారాన్ని కుక్కలు, పిల్లులు, కాకులు వాటి అన్నింటికి తినిపించేవారట. జంతువుల ఆకలిని మనుష్యుల ఆకలితో సమానమని వాటి పైన దయ, కరుణ చూపడం ఆధ్యాత్మిక సేవ అని ఆయన ఎన్ని సార్లు చెప్పారు. అయినా మీరు వింటారా?
అలా ఎమోషనల్‌గా అనర్గళంగా ఇస్తున్న ఉపన్యాసానికి ఒక్క సెకను బ్రేక్ ఇవ్వగానే, "చీమా! చీమా! మరేమోనే ఇవన్ని నీకెలా తెలుసు? గత జన్మలో నేవేమైనా పండితుడివా? గంధర్వుడివా? నిన్ను ఎవరు శపించారు? అగస్త్యులా? నారదులా? ఆ, ఆ దుర్వాసులే కదూ! ఆయన శాపం వల్ల ఈ జన్మ వచ్చిందా? అని కుతూహలంగా అడిగాను.
"youtube నుండి start చేస్తే అన్ని channels లో ప్రవచనాలు full volume లో పెట్టి నువ్వు ఎంచక్కా నిద్రోతావు,
సామవేదంగారు repeatedly ఎంత అన్నా, ఎంత చెప్పినా ఎక్కడంలే,
నీవు కేవలం వింటున్నావు, మేము అన్నీ శ్రద్ధగా జీర్ణించుకుంటున్నాం,
ప్రవచనకర్తలలో, వాళ్ళు చెప్పే పురాణాలలో, అందులోని characters లో నువ్వు తప్పులు వెదుకుతున్నావు, మేము మా తప్పులు సరిదిద్దుకుంటున్నాం,
నీకు ఇంతకంటే ఉత్తమగతులు అక్కర్లేదు, కానీ, నాకు ఇంతకంటే ఉత్తమ జన్మ కావాలి,"
అంటూ నడుంమీద చేయి వేసుకొని నిల్చొని ఎంత మెత్తగా, ముద్దుగా కోప్పడుతుందో!! మా నాన్నగారే సుమా!
partyలని, get-togethers అని ఎంతెంత పారేస్తారు Dustbinsలో, దానిముందు మేము తినేది ఎంత? అంటూ emotional గా చెప్పి రొప్పుతున్న చీమని చూస్తూ, ఆ మాటలు వింటుంటే as usual గా నా మనసులో ఒక సందేహం+ఆనందం. "WOW!! Awesome!! అడవుల్లో తపస్సు చేసే మహర్షుల్లా, విక్రమార్క చక్రవర్తిలా, కైకేయీ తండ్రి అశ్వపతివారిలా నాక్కూడా చీమల భాష అర్థం అవుతుందిస్మీ!
ఆహా! ఆనందం!! మహదానందం!! నాకు తెలియకుండానే నాలో ఇంతటి ఆధ్యాత్మిక అభివృద్ధి, ఉన్నతి, ప్రగతి,పురోగతి కలిగిందా? ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతూ, ఆ ఈ విషయం ఎవరితోనైనా share చేసుకుంటే, వామ్మో!.... ఇంకేమైనా ఉందా? ఫట్... ఫట్ ఫటాఫట్ फटे मेरा सर అంటూ తల బద్దలవుతే? ఈ సందేహాలతో సతమతం అవుతుండగా, "హల్లో లచ్చమ్మా, అంత సీను ఏం లేదమ్మా, నీకు అర్థం కావాలని పాపం, ఆ చీమే నీ భాషలో మాట్లాడింది, నా అంతరాత్మ వెటకరింపు.
మా నాన్నగారు చెప్పినట్టు, " దీని దుంప తెగ, నాలో ఉంటూ నాకే ధిక్కారమా? ఎప్పుడూ ప్రతిపక్షం సీట్లోనే బైఠాయిస్తుందేటి?" అనుకుంటుండగా కాలింగ్‌బెల్ సౌండ్ విని అటు మళ్ళా.