కౌశికి నదికి నీరు తీసుకురావడానికి వెళ్ళిన అహల్య అక్కడ తన పత్నులతో జలక్రీడలు ఆడుతున్న బలిచక్రవర్తిని, ఆ స్త్రీలను, వారి ఆనందానుభూతులను, ఐశ్వర్య వైభోగాలను చూస్తూ ఉండిపోవటంవల్ల ఆశ్రమానికి తిరిగి రావడానికి చాలా సమయం పట్టింది. దీనితో విషయం గ్రహించిన గౌతములు ఆ తల్లిని చంపమని చిరకారిని ఆదేశించారు. అన్ని కార్యకలాపాలను విమర్శించి, విశ్లేషించి చేసే స్వభావం కలవాడు కాబట్టి, అలాగే మీ ఆజ్ఞ పాటిస్తాను అని చెప్పగానే పుత్రునిపై నమ్మకంతోతండ్రి వెళ్ళిపోతారు.
తన అలవాటు ప్రకారం, చిరకారి దీని గురించి చాలాసేపు ఆలోచించారు: ’నా తండ్రి ఆజ్ఞను నేను ఎలా నెరవేర్చగలను? నా తల్లిని చంపకుండా వారి ఆజ్ఞను ఎలా ధిక్కరించను? తండ్రి మాట ఆచరిస్తున్నాను, నా ధర్మం చేస్తున్నాను అనే నెపంతో, నేను ఈ పాపం చేయడమా?
తండ్రి ఆజ్ఞ పాలించడం ధర్మం అయితే, తల్లిని చంపకుండా విడిచిపెట్టడం అధర్మం అవుతుంది కదా!
ఒక స్త్రీని, అందునా తల్లిని చంపి ఎవ్వరైనా సంతోషంగా ఉండగలరా? నాకు ఎంతో బాధను, వ్యథను కలిగించదా? అలా అని
తండ్రిని అగౌరవపరిచినట్లయితే అపకీర్తి కదా! తండ్రిని గౌరవించడం ఎంత సముచితమో తల్లిని రక్షించడం కూడా అంతే సముచితం కదా! కుటుంబవృద్ధికోసం భర్త తన భార్యలో తనను పుత్రుడి రూపంలో సృష్టించుకొని, పునర్జన్మ పొందుతాడు. నా తండ్రివల్ల నాకు ఈ శరీరం నాతల్లివల్ల ఈ జన్మ, కొడుకు అనే ఒక హోదా వచ్చాయి. తండ్రి పుత్రునికి విద్యను తద్వారా జీవనోపాధిని ఇస్తారు. తండ్రి ఏది చెప్పినా దానిని ధర్మంగానే అంగీకరించాలి. వేదాలు కూడా ఇదే బోధిస్తున్నాయి. కాబట్టి, తండ్రి ఆదేశాన్ని అమలు చేయాల్సిందే.
పితా స్వర్గః పితా ధర్మః పితా పరమకం తపః పితరి ప్రీతిం ఆపన్నే సర్వాః ప్రీణంతి దేవతాః ||
తండ్రి స్వర్గం. తండ్రి ధర్మం. తండ్రి మహా తపస్సు. తండ్రి ఆజ్ఞలను పాటించేవాడి పాపాలన్ని నశించిపోతాయి.
తండ్రి సంతోషిస్తే, దేవతలందరూ సంతోషిస్తారు. తండ్రి దీవిస్తే, అది ఫలించడానికి దేవతలు తోడ్పడతారు.
పుత్రుడు చేసిన పనికి ఉప్పొంగిపోయిన తండ్రి సంతోషంతో మాట్లాడే నాలుగు మాటలు అంతవరకు ఆ కొడుకు చేసిన పాపాలను నాశనం చేస్తాయి.
అది కదా తండ్రి ఘనత! " అంటూ అంతవరకు తండ్రి మాటలు ఎందుకు వినాలి? వింటే కలిగే ప్రయోజనాలు ఏమిటీ? అని తర్కించిన చిరకారి ఇపుడు తల్లి గురించి ఇలా అనుకుంటున్నారు:
నా తల్లి స్థానం తండ్రి స్థానం కంటే ఏమీ తక్కువైంది కాదు. నా ఈ మానవ శరీరానికి నా తల్లి కదా కారణం, మాతృగర్భం మానవునికి మూలం, పుత్రుడు తల్లి వల్ల జీవితంలోని అన్ని లక్ష్యాలను సాధించగల్గుతాడు. తల్లి ఆశీర్వాదం పుత్రుడికి రక్షా కవచం వంటిది. తల్లి లేకపోతే అనాథ, నిస్సహాయంగా, దిక్కు తోచకుండా ఉంటాడు, తల్లి ఉంటే సనాథ, తల్లి మార్గదర్శి.
తల్లితో కలిసి ఉన్న వ్యక్తి ఎటువంటి భారాన్నయినా ఎదుర్కోడానికి భయపడడు. ఎప్పుడూ దుఃఖించడు. వృద్ధాప్యం కూడా అతన్ని ఏమీ బాధించదు. కొడుకులు, మనవళ్ళు చుట్టూ ఉన్నా, ఒక వంద సంవత్సరాల కొడుకు వాళ్ళ అమ్మ దగ్గర ఇంకా రెండేళ్ల శిశువులానే ప్రవర్తిస్తాడు.
కొడుకు సమర్థుడైనా కాకపోయినా, సన్నగా ఉన్నా లావుగా ఉన్నా, అందంగా ఉన్నా, లేకపోయినా చాలా ఇష్టంతో కొడుకును పెంచేది తల్లి. మరెవరూ ఇలా చేయరు. తల్లిలేనివాడు త్వరగా వృద్ధునిలా, అసహాయునిలా అవుతాడు.
అమ్మా, అంటూ ప్రేమతో తల్లిని పిలుస్తూ ఇంట్లోకి వచ్చేవాడికి, ఆ తల్లిని యదార్థంగా ప్రేమించేవాడికి జీవితంలో అన్నీ సమకూరుతాయి.
పైసా లేని బీదవాడే అయినా సాక్షాత్తు అన్నపూర్ణాదేవినే ఇంట్లో ప్రతిష్ఠించుకున్నవాడి కిందే లెక్క. తల్లి లేనినాడు అతనికి జగత్తు అంతా శూన్యంగా కనిపిస్తుంది. మండుతున్న సూర్యుడి నుండి రక్షించే నీడ లాంటిది తల్లి, తల్లిని మించిన ఆధ్యాత్మిక సాధన లేదు, తన గర్భంలో దాచుకొని సమయం వచ్చేంతవరకు జాగ్రత్తగా చూసుకుంటూ, వాడికి ప్రాణంపోస్తూ ఉంటుంది, తల్లిని మించిన జీవనం మరొకటి లేదు, తల్లే కదా స్తన్యం ఇచ్చి పోషించేది. తల్లి మనల్ని తన కడుపులో ఉంచుకుంటుంది కాబట్టి ఆమెను ధాత్రి అని, మనకు జన్మనిస్తుంది కాబట్టి జనని అని, మన అవయవాల పెరుగుదలకు, అభివృద్ధికి కారణమవుతుంది కాబట్టి అంబా అని, వీర కుమారులకు జన్మనిస్తుంది కాబట్టి వీరసూ అని, శిశువులకు సేవ చేస్తుంది కాబట్టి, ఆమెను శ్వశ్రూ అని, మాన్యురాలు, పూజ్యురాలు కాబట్టి మాత అని పిలుస్తారు.
వేదాలు తండ్రిని దైవంగా అభివర్ణిస్తాయి, కానీ, అటు దేవతలలో కానీ, ఇటు మానవులలో కానీ తల్లిని మించినవారు ఎవ్వరూ లేరు.
నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళిన తల్లి, బలి చక్రవర్తిని, వారి అంతఃపుర స్త్రీల వైభవాన్ని చూస్తూ ఆలస్యం చేసింది, కాబట్టి తండ్రి తన తల్లిని చంపమని ఆదేశించారు. ఏం చేయను? అంటూ చాలాసేపే ఆలోచించినా చిరకారి ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు.
ఇక్కడ ఆశ్రమంలో గౌతములు ఈ విషయం గురించే ఆలోచిస్తుంటే, ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వారి ఆశ్రమం దగ్గర, "అందరి స్త్రీలలో ఏవో దోషాలు ఉంటాయి, కానీ బుద్ధిశాలి వాళ్ళ లోపాలపై దృష్టి పెట్టకూడదు", అంటూ పాడుతుంటే మేధాతిథి/గౌతములు ఆయనను సత్కరించి పంపారు. "అయ్యో, నేను ఎంత పొరపాటు చేశాను, చిరకారిని నేను తొందరపడి ఆదేశించాను. కానీ, చిరకారి కాబట్టి నన్ను ఈ పాపం నుండి రక్షించవచ్చు," అనుకుంటూ త్వరత్వరగా గౌతములు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ తన తల్లి పక్కన కూర్చొని ఉన్న తన కుమారుడు చిరకారిని చూశారు. తండ్రిని చూడగానే
అతను తండ్రి కాళ్ళపై సాష్టాంగపడి తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు. ఆ కొడుకుని, బ్రతికేఉన్న భార్యను చూసి ఆయన చాలా ఆనందపడ్డారు. కానీ ఇదంతా అహల్యకు ఏమీ తెలియదు, చేతిలో ఆయుధంతో కొడుకు ఆమె దగ్గర నిలబడి ఉన్నప్పుడు, అతను ఆమెను చంపబోతున్నాడని కూడా ఆమెకు అర్థం కాలేదు. కొడుకు తన తండ్రి పాదాలపై పడగానే, ”’చేతిలో ఆయుధం పట్టుకున్నందుకు క్షమార్పణ వేడుకుంటున్నాడు, అని అనుకున్నది. తండ్రి మాత్రం చాలాసేపు సంతోషంతో నవ్వుతూ, అతన్ని ఆలింగనం చేసుకుని,”"చిరంజీవ, ’చిరంజీవ," అంటూ ఆశీర్వదించారు. "కుమారా, ఈ పని చేయడంలో నీవు చేసిన ఆలస్యం నన్ను ఏమీ బాధించలేదు, ’ అంటూ ఏవి ఆలస్యం చేయాలో ఇలా చెప్పారు:
ఎవరితోనైనా స్నేహం చేసే ముందే మంచి చెడు చాలాసేపు ఆలోచించిన తర్వాత స్నేహం చేయాలి, చేసాక అకస్మాత్తుగా ఆ స్నేహితుడిని విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచి వెళ్లాల్సిన అవసరం వస్తే, దాని పరిణామాలను చాలాసేపు ఆలోచించి, విశ్లేషించాలి. ఇలా ఏర్పడిన స్నేహమే చాలాకాలం నిలిచి ఉంటుంది.
కామం, బాధ, గర్వం, ద్రోహం, పాపపు పనులు చేయడానికి ఆలోచించేవాడు, ఆలస్యం చేసేవాడు ప్రశంసించబడతాడు.
నేరం స్పష్టంగా లేనప్పుడు బంధువుల, స్నేహితుల, సేవకుల, స్త్రీలపై చర్య తీసుకోవడానికి ఆలస్యం చేసేవాడు ప్రశంసించబడతాడు, అంటూ ఏ ఏ పనులు తొందరపడిచేయకూడదో చెప్పాక ముగ్గురూ సంతోషంగా వాళ్ళ ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయారు.
భారతంలో కొద్దిగా వ్యత్యాసంగా ఉన్నది, అందులో ఇంద్రుడు మారువేషంతో రావడం లేదు. గౌతములే ఆలోచించి బాధపడి త్వరగా వెళ్తారు.