పిల్లలందరికి వాళ్ళ తల్లితండ్రులతో ఉగాది పచ్చడిలాంటి తీపి చేదు కలిసిన జ్ఞాపకాలు ఉంటాయి, ఎవరి parents వాళ్ళకి గొప్ప కదా! అలా మా అమ్మతో నాకు బోలెడు జ్ఞాపకాలు. ఇది నా profession తో connect అయి ఉంది, అందుకని నా అనువాదాలు అవి upload చేయడానికి ముందుగా మీ అందరితో ఇది share చేసుకుంటున్నాను. చదువు అంటే విపరీతమైన passion ఉన్న ఏ తల్లి పిల్లలైనా ఖచ్చితంగా ఇలాంటిదే experience చేసి ఉండవచ్చు. సరే, కథలాంటి నిజంలోకి వెళ్దాం.
హైద్రాబాద్ వాస్తవ్యులం అవడం వల్ల మా ఇంట్లో అందరికి హిందీ మాట్లాడటం వచ్చు, అబ్బో!! మా అమ్మకి ఉర్దూ కూడా వచ్చు బాబు. అయితే నేను సదరు ఎన్.టి.ఆర్ లా తెలుగు వీరాభిమానిని అవడంతో ఒక్క ముక్క వచ్చేది కాదేమో🤔, లేదా నా మెదడులో ఇతర భాషలను గ్రహించే సెల్స్ అన్నీ ఖాళీయో ఏంటో?? నిజం చెప్పొద్దూ, ఆ భాష అప్పట్లో రసం తీసేసిన చెరకు పిప్పిలా కనిపించేది నాకు, ఇదే మా చిన్న అన్నతో చెప్తే "చాల్లే నోర్ముయ్యి డిప్పకాయ మాటలూ నువ్వూనూ", అన్నాడు. బాబోయ్! వీడు మా అమ్మని తెగ మిమిక్ చేసేస్తాడురా నాయనా, డైలాగ్స్ తో సహా అనుకున్నా.
పొట్టపొడిస్తే ఒక్క హిందీ ముక్క లేదు అనేది మా అమ్మ. హిందీ మాట్లాడడానికి నోరు కదా, పొట్ట ఎందుకు అంటే వెధవ తెలివితేటలకి ఏం కొదవ లేదు. ఈ తెలివి ఏదో చదువులో చూపించు అనేది. "అమ్మా, అందుకే దీనికి హిందీలో పది మార్కులే," అని మా పెద్దన్నయ్య పక్క వాయిద్యాలు మోగించేవాడు. వచ్చే జన్మలో నేను పెద్దన్నయ్యలా పుట్టి చూస్కో నిన్నేం చేస్తానో అని మనసులోనే మంగమ్మ శపథాలు చేసుకునేదాన్ని.
ఇదిలా ఉండగా నా జాతకంలో ఏలిన నాటి శని దశ ప్రారంభమయ్యింది. ఒకసారి మా నాన్నగారి ముస్లిం క్లయింట్స్ వచ్చి కూర్చున్నారు ముందుగదిలో. నాన్నగారు భోంచేస్తున్నారు. వాళ్ళని కొంచంసేపు కూర్చోమని చెప్పు, పో అని మా అమ్మ ఉత్తరువు. వాళ్ళు కూర్చున్నారమ్మ అంటే వినదే, "నాన్నగారు భోంచేస్తున్నారని చెప్పు పో." మా నాన్నగారు మరీ శాస్త్రోక్తంగా ఒక్కొక్క ముద్దని గట్టిగా పిసికి అరగంట నమిలి తినేవాళ్ళు, తొందరగా తినొచ్చుగా అన్నాను నాన్నగారిని కోపంగా చూస్తూ, మా అమ్మ గుడ్లు ఉరిమిచూసింది, ఇక ఆ పోరు భరించలేక మెల్లగా వెళ్ళి కర్టెన్ పట్టుకొని వాళ్ళని చూస్తూ ఆ instructions ఏవో అమ్మ హిందీలో ఇస్తే బాగుండేదిగా అని ఆలోచిస్తూ నిల్చున్నా." హిందీలో ఏం చెప్పాలబ్బా??? ఇంతలో వాళ్ళలోంచి ఒక పెద్దాయన నా అవస్థ చూసి, "బేటీ, క్యా బాత్ హై! అన్నారు. వెంటనే ఒక వెర్రి నవ్వు నవ్వి క్యా బాత్ నహీ హై అని చెప్పి, వెనక్కి సంధించిన రాముడి బాణంలా అమ్మ దగ్గరకు వచ్చా.
ఒసే, ఏం చెప్పావే? అమ్మ ప్రశ్న.
బిక్కుబిక్కుమంటూ నిల్చొని ఏం చెప్పలే అని సణిగాను.
"అదేమిటే? నాన్నగారు భోంచేస్తున్నారు, వెయిట్ చెయ్యండి," అని చెప్పలేదా?
అమ్మ గొంతు శృతి కొద్దిగా హెచ్చుతుంది. ఇలాంటప్పుడు మా నాన్నగారికి అమిత చెవుడు వస్తుంది. మా అమ్మ బ్రహ్మశిరోనామాస్త్రం "నేనేం పట్టించుకోను, మీ పిల్లల్ని, వాళ్ళ చదువుల్ని అన్నీ మీరే చూసుకోండి," అని. అశ్వత్థామకు మల్లె మా నాన్న గారికి ఉపసంహార మంత్రం రాదు. అందుకే "నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్!" అన్నట్టు నిర్లిప్తంగా ఉంటారు.
సరే, మా అమ్మ గదమాయింపుకి, "మరే, అన్నయ్యని చెప్పమని చెప్పాచ్చుగా, నన్నే ఎందుకు పంపావు?" అని అడిగా.
"నువ్వు వాళ్ళకి ఏం చె...ప్పా...వ్? ఒక్కొక్క అక్షరం మీద 50 టన్నుల బరువు పెట్టి అడిగింది. మా అమ్మ పోయిన జన్మలో భేతాళుడా? విక్రమార్కుడా? వదలదే, నా మనిషిలో మడిసికి సందేహం.
"మాట్లాడవే, మా నాన్నగారు మెల్లగా ముందుగదిలోకి జారుకున్నారు, మా సిబ్బంది అంతా మా చుట్టూ మూగారు episode వీక్షణ, శ్రవణాలకు.
మరేమో ఆ పెద్దాయన బేటీ క్యా బాత్ హై అన్నారు, బోనులో ఉన్న నేను మంద్రస్థాయిలో చెప్పా.
నువ్వు ఏమన్నావు? ఒక్కొక్క అక్షరంమీద మణుగు బరువుతో పబ్లిక్ ప్రాసిక్యూటరమ్మ ప్రశ్న.
అందరివైపు ఒకసారి చూసి, " క్యా బాత్ నహీ హై" అన్నా, అని చాలా గర్వంగా చెప్పా.
ఏంటి? క్యా బాత్ నహీ హై అన్నావా? అంటూ మా అమ్మ శంకర్ మహదేవన్ లెవెల్లో గుక్క తిప్పుకోకుండా దీన్ని అన్ని intonations తో ద్వాత్రింశతి నామాల్లా చెప్పి, ఇదేం విడ్డూరమే! ( సాధారణంగా నా విషయంలో మా అమ్మ ముందు డైలాగ్ ఇదే,) ఇంట్లో అందరూ మాట్లాడుతారు, నీ ఫ్రెండ్స్ చిట్టి, లక్ష్మి, రత్న ఎంత ముద్దుగా మాట్లాడుతారే, క్యా బాత్ నహీహైట, క్యా బాత్ నహీహై, ఇలా ఎవ్వ్వ్వరైనా అంటారా అని వకింద ఒక వెయ్యి వత్తులు తగిలించి ఒక ప్రశ్న.
నేను అన్నానుగా నా స్వగతం, నా మనసు చదివిన వాడిలా మా అన్నయ్య ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఇది అందిగా, అమ్మా? అంతే, సదరు మా అమ్మ మా అన్నని కళ్ళతోనే కంట్రోల్ చేసి "ఒరే, నువ్వెళ్ళి నోట్ బుక్కు, పెన్ను తే," అని ఆజ్ఞ జారీ చేసింది.
శివుణ్ణి వారం రోజులే పట్టిన శని దేవుడు నన్ను కొన్ని సంవత్సరాలు నిప్పుల మీద అప్పడంలా కాల్చుకు తిన్నాడు. తోబుట్టువులంతా నా చుట్టూ చేరి హిందీ రాని మొద్దు కదల లేని ఎద్దు అంటూ ఎద్దేవా! మా అమ్మేమో, ఇందులో జెండర్ సవరింపులు, ఒరేయ్ ఇది ఆడపిల్ల కదరా! కదల లేని ఆవు, అనాలిగా.
నాకు ముందుగా స్పోకెన్ హిందీ క్లాసెస్ ఎంత తీవ్రంగా కొనసాగాయి అంటే నేను నిద్రలో కూడా హిందీయే కలవరించడం మొదలు పెట్టానట. దాహం వేసి అర్థరాత్రి నీళ్ళు తాగుదామని లేస్తే వేంఠనే నాతోపాటు మా అమ్మకూడా లేచి, "క్యొం ఉఠీ హో? క్యా చాహియె? అని questioning. పానీ చాహియే అని బిక్కమొహంతో ఏడ్పు గొంతుతో చెప్పి ఆ తరువాతినుండి రెండు, మూడుసార్లు కదిలి మా అమ్మ లేవడం లేదు అని నిర్ధారించుకొని, safe అనుకున్నాక మోకాళ్ళ మీద పాకుతూ వెళ్ళేదాన్ని. ఒకరోజు నా ఖర్మకొద్ది ఈ భంగిమలో దొరికిపోయా, అంతే, నేను ఏ posture లో వెళ్తున్నానో చెప్పించడానికి హిందీలో మార్చి మార్చి ప్రశ్నలు వేసింది. బిక్క చచ్చిన నేను ఏడుస్తూ అన్నింటికి పానీ, పానీ అని చెప్పడంతో చలో, పానీ పీనే కేలియేహీ సహీ, జా రహీ హోనా, లేకిన్ కైసే? అంటూ తేలిక ప్రశ్న అడిగానన్న ఫీలింగ్ తో అడిగింది.
లైట్ కంటె, సౌండ్ కంటే మెదడు వేగంగా పరుగెత్తుతుంది అని అపుడు అర్థం అయ్యింది నాకు. ముహ్, హాథ్, నాక్, కాన్ సరే, మోకాళ్ళని హిందీలో ఏమనాలి? అవి ఏ లింగం, స్త్రీ యా పురుషుడా? చకచకా ఆలోచిస్తున్నా, ఊహు, క్లారిటీ రాలే, అమ్మ విసుగెత్తి తెలుగులోకి దిగి మోకాళ్ళమీద వెళ్తున్నాను అని హిందీలో చెప్పు అన్నది. నేను తెల్ల మతాబా కాల్చా, అంతే, ఆ అర్థరాత్రి దీపాలు వెలిగె..... డిక్షనరీస్ వచ్చె లాంటి ఘటనలు కొన్ని జరిగాక, (తర్వాత మా చెల్లి చెప్పింది, నా వెనకనుండి నాన్నగారు బ్రతిమిలాడుతున్నట్టు ఏవో సైగలు చేయడం వల్ల, ) అరగంట మాత్రమే ప్రహసనం అయ్యాక పో, పడుకో అని స్టెర్న్ గా ఉత్తర్వు జారీ చేసింది.
మరునాడు అన్నయ్యతో దక్షిణ భారత్ హిందీ ప్రచారసభకు పంపి, నన్ను ప్రాథమికకు కూర్చోబెట్టి ఆగస్ట్, ఫిబ్రవరి మధ్యలో నన్ను బంతి ఆడినట్టు ఆడించింది.
నా ముక్కు, నా కళ్ళు, నా చెవులు-అయినా ఒక్కొక్కటి ఒక్కొక్క లింగం, చాలా ఉక్రోషంగా, కోపంగా ఉండేది, పైగా పుస్తకాలు గోడలు గడియారాలకి లింగం. అన్నం ప్రశాంతంగా తిననిచ్చేది కాదు, మైనే రోటీ ఖాయా, మైనే భాత్ ఖాయా అంటే రోటీ స్త్రీలింగంకదా ఖాయీ అనాలిగా, నాకేం తెల్సు నువ్వు గౌను తొడగలే అన్నా ఉక్రోషంతో, అందరు నవ్వుతుంటే లోటాడు నీళ్ళు నా నెత్తిన గుమ్మరించి వెళ్ళిపోయింది మా అమ్మ.
బోల్, భూల్, లా, సక్, చుక్ లు, కా కీ కే, కోలు మే, పర్ లు రామ నామంలా ఎంత అనిపించిదంటే, నిద్రలో కొంచం జరగవే అక్కా, అని మా చెల్లి అనగానే గుక్కతిప్పుకోకుండా ఇవి అన్ని గడగడా చెప్పేదాన్నట. అంత విషాదంలోనూ ఆనందం ఏమిటంటే అందరితోనూ పరీక్షలు ఇప్పించింది మాఅమ్మ. మనం బాధ పడ్తున్నా అలాంటి బాధే ఇంకొకళ్ళు అనుభవిస్తుంటే మనకొక తృప్తి. చుట్టుపక్కల పిల్లలు, మా ఫ్రెండ్స్, మేము మాతోనే హాలు సగం నిండి ఉండేది. నాకు జడవేస్తూ, రొట్టెలు కాలుస్తుంటే, అన్నం తింటుంటే అన్ని టైములల్లో హిందీ వల్లె వేయిస్తూ విశారద వరకు లాక్కొచ్చింది. మిగిలినవి నేనే ఇచ్చుకున్నా. మొదట్లో ఎలా ఉన్నా తర్వాత తర్వాత సరదాగానే ఉండేది. మౌఖిక్ లో నాకే హైయెస్ట్, పక్కా bookish hindi కదా! ఈ రోజు తల్చుకుంటే నవ్వు వస్తుంది. కాస్తో కూస్తో ఆధ్యాత్మిక పుస్తకాల అనువాదం చేయగల్గుతున్నాను అంటే అమ్మ చలవే కదా, మా తుసి మహాన్ హో!!! 💐🙏