మాతృపంచకం
పరిచయం
మాతృపంచకం
పరిచయం
కలియుగంలో ధర్మం క్షీణించి, వేదమార్గం మరుగునపడిన కాలంలో, శంకరాచార్యులు అవతరించి అద్వైత తత్త్వాన్ని పునరుద్ధరించారు. ఆయన కేవలం తత్త్వజ్ఞానమూర్తిగానే కాకుండా, తల్లి పట్ల అపారమైన వాత్సల్యాన్ని చూపిన పుత్రునిగా కూడా కనిపిస్తారు. మాతృపంచకం వంటి హృదయాన్ని కదిలించే స్తోత్రాన్ని రచించిన మహానుభావులు.
దక్షయజ్ఞం, సతీదేవి ఆత్మాహుతి, శివుని జటాజూటం నుండి వీరభద్రుని అవతరణ ఇవన్ని శివ పురాణంలోనూ, ఇతర పురాణాలలోనూ చాలా విస్తారంగా వర్ణింపబడి ఉంటాయి. కానీ, (ప్రతిసర్గ పర్వం, నాల్గవ ఖండం) భవిష్య పురాణంలో మాత్రం శంకరాచార్యుల జననం ప్రధానం కాబట్టి ఆ దక్షయజ్ఞ వృత్తాంతం అంతా క్లుప్తంగా ఉంది. ఈ పురాణం ప్రకారం, స్వయంగా శివుడే దక్షయజ్ఞంలో మృగవ్యాధ/వేటగాని రూపం ధరించి, జింకరూపం ధరించిన యజ్ఞపురుషుణ్ణి తమ బాణంతో వధిస్తారు. తమ శరీరంనుండి ఇద్దరిని- నీలలోహితుణ్ణి, త్రిశిరస్కుడు, త్రినేత్రుడు, త్రిపాదుడు అయిన వీరభద్రుణ్ణి అవతరింప చేస్తారు. దక్షయజ్ఞం విధ్వంసమవుతుంది. వెంటనే వ్యాసభగవానులు కథను ఇక్కడినుండి శంకరుల జననం వైపు మళ్ళించి, వీరభద్రుడు తన దివ్య అంశాన్ని భూమిపైకి పంపి భైరవ దత్త అనే పండితుడైన బ్రాహ్మణుడి ఇంట్లో ప్రవేశింపచేసాడు అని చెప్తారు. అక్కడ ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడని, అతను కలియుగంలో శంకరుడిగా ప్రసిద్ధి చెందాడని చెప్తారు.
కూర్మ పురాణం: ‘కరిష్యతి అవతారాణి శంకరో నీలలోహితః|| శ్రౌత స్మార్తప్రతిష్ఠార్థం భక్తానాం హితకామ్యయా| ఉపదేక్ష్యంతి తత్ జ్ఞానం శిష్యాణాం బ్రహ్మసంజ్ఞితమ్||’ అని శంకరులు అవతరించి స్మార్త సంప్రదాయాన్ని పునరుద్ధరించి, శిష్యులకు వేదాంత సారాంశమైన "బ్రహ్మజ్ఞానాన్ని" బోధిస్తారని స్పష్టం చేస్తుంది. శంకరో నీలలోహితః, శంకరుడే నీలలోహితుడు అని వర్ణిస్తూ శంకరాచార్యులు నీలిమేఘం వలె శుద్ధుడు అని చెప్తుంది
పద్మ పురాణం: అయితే పద్మ పురాణంలో కొంత భిన్నంగా ఉంది.
“మాయా వాదం అసత్ శాస్త్రం ప్రచ్ఛన్నం బద్ధ ఉచ్యతే |
మయా ఏవ కథితం దేవి కలౌ బ్రాహ్మణ రూపిణా ||
అంటే మాయవాదం లేదా అద్వైత తత్వశాస్త్రం అనేది వేదాలలోని అంశాలకు, ధర్మాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న సిద్ధాంతం॥ఇది వాస్తవానికి బౌద్ధ తత్త్వాన్ని కప్పిపుచ్చినదే. శివుడు పార్వతికి “కలియుగంలో నేను బ్రాహ్మణ రూపాన్ని ధరించి దీనిని బోధిస్తాను” అని చెప్పారు. ఈ విధంగా, కొన్ని పురాణాలు శంకరులను శివుని అవతారమనే చెప్తున్నాయి.
కలియుగంలో మ్లేచ్ఛ రాజులు భారతవర్షాన్ని దోచుకుంటారని, ప్రజలు వేదాలను మరచిపోతారని, ధర్మం క్షీణిస్తుందని వ్యాసమహర్షి భవిష్య పురాణంలో చెప్పారు. ఆనాటి భవిష్యవాణి ఎంత నిజం అయ్యిందో, అలెగ్జాండర్ దండయాత్ర , తురుష్కుల దాడులు, వారి సామ్రాజ్య స్థాపన చెప్తున్నాయి. ప్రతి దండయాత్రలో దేవాలయాలు ధ్వంసమయ్యాయి. వేదపాఠశాలలు మూతబడ్డాయి. ఈ సంక్షోభాల నేపథ్యంలోనే క్రీ.శ 8వ శతాబ్దంలో శంకరుడు అవతరించి, నాలుగు దిక్కులా నాలుగు మఠాలను స్థాపించి, అద్వైతాన్ని పునరుద్ధరించారు.
బాల్యంలోనే ఆయన అసాధారణ ప్రజ్ఞను చూపించారు, తమ భక్తితో, స్తుతితో లక్ష్మీదేవిని మెప్పించి కనకవర్షం-బంగారు ఉసిరికాయల వర్షం- కురిపించడంతో ప్రజలు ఆయనను దైవంగా భావించారు. వాస్తవమే కదా! ఏడు ఏళ్ళ వయసులో ఒక సామాన్య బాలుడికి బంగారు ఉసిరికాయల వర్షం కురిసేలా చేయడం, తిరిగి చాలు అని చెప్పి ఆపడం సాధ్యమా? ఏడేళ్ళ ప్రాయంలోనే గోపాలకులను, గోవులను సంవత్సరకాలం బ్రహ్మ సృష్టికే ప్రతిగా సృష్టించిన కృష్ణ పరమాత్మకు తప్ప మరి ఎవ్వరికైనా సాధ్యమా? శివ కేశవులే కదా వీరు ఉభయులు.
అయితే కొంతమంది విమర్శకులు ఇది పండితుల అల్లిన కథ అని, శంకరుడు జటాజూటంతో ఉంటాడు కాని బోడిగుండుతో ఎన్నడైనా ఉన్నాడా? అని వాదిస్తున్నారు. కానీ రుద్రంలోనే “నమః కపర్దినే చ -జటాజూటం కలవాడికి నమస్కారం, నమః వ్యుప్త కేశాయ చ -తలమీద ఒక్క వెంట్రుకలేనివాడికి నమస్కారం” అంటూ దీనికి సంకేతం ఉంది. ఇక్కడ విరుద్ధ భావాలు ఒకే అనువాకంలో రావడం, ఈ రెండవది భావి అవతార/శంకరాచార్యుల అవతరణ సూచనగా పండితులు వివరించారు.
హిందూ ధర్మం గురించి దుష్ప్రచారాలు, హిందువుల పట్ల అత్యాచారాలవంటి ధార్మిక, సాంస్కృతిక సంఘర్షణలు జరుగుతున్న వ్యతిరేక పరిస్థితులలో, కేవలం 24 సంవత్సరాల (32-8)లో, ఆర్యావర్తం అంతా కాలినడకన పయనించడం, అసంఖ్యాక శ్లోకాలను, పుస్తకాలను, వ్యాఖ్యలను, భాష్యాలను రచించడం, పండితులను తర్కంలో జయించడం, నాలుగు దిక్కులా నాలుగుమఠాలను స్థాపించడం ఒక సాధారణ పరివ్రాజకుల వల్ల ఏనాటికీ జరగని పని.
శంకరులు శైవ సిద్ధాంతాలను వ్యాఖానిస్తూ శంకర భాష్యాన్ని రచించారు. వారు త్రిపుండ్రం (మూడు రేఖల పవిత్ర భస్మ ధారణ), రుద్రాక్షమాల, పంచాక్షరీ మంత్రం (నమః శివాయ) వంటి శైవ సంప్రదాయ చిహ్నాలు శివ భక్తులకు ప్రధానమని, శుభప్రదమైనవని చెప్పారు. అదే సమయంలో, వేదాంతాన్ని సమగ్రంగా వివరించి, అద్వైత తత్త్వాన్ని పరిపక్వంగా నిలబెట్టారు.
శంకరాచార్యులు తల్లిని ఒప్పించి పరివ్రాజకులు అయ్యేముందు,
“అహన్యమ్బ రాత్రిసమయే సమయాన్తరేవా
సంచిన్తయ స్వవశగాఽవశగాఽథవామామ్ |
ఏష్యామి తత్ర సమయం సకలం విహాయ
విశ్వాసమాప్నుహి మృతావపి సంస్కరిష్యే ||
(అహని అంబ రాత్రిసమయే సమయ అన్తరేవా సంచింతయ, స్వవశగాఽఅవశగాఆథవా మామ్ |ఏష్యామి తత్ర సమయం సకలం విహాయ విశ్వాసమాప్నుహి మృతావపి సంస్కరిష్యే||) అంటూ వాగ్దానం చేసారు.
నువ్వు నా గురించి ఏ సమయంలో ఆలోచించినా, నేను నా పనులనన్నింటినీ వదులుకుని నీ దగ్గరికి వస్తాను, పగలు, రాత్రి, సాయంకాలం, ఏ సమయంలో నన్ను తలచుకున్నా సరే, నువ్వు స్పృహలో ఉన్నా, అపస్మారక స్థితిలో ఉన్నా లేదా దుఃఖంతో ఉన్నా వస్తాను. నీవు మరణించినట్లయితే, నీ అంత్యక్రియలను నేనే చేస్తాను. నువ్వు నన్ను నమ్ము, అని మాట ఇచ్చారు.
సన్యాసం స్వీకరించిన తర్వాత, వారు శృంగేరి నదీతీరంలో ప్రగాఢమైన ధ్యానంలో ఉండగా, తన తల్లి అస్వస్థురాలయినట్లు ఒక ఆభాస కలిగింది. ధ్యానం విడిచి, ఆకాశమార్గంద్వారా, క్షణాల్లో కాలడికి, తల్లి వద్దకు చేరారు. సన్యాసాశ్రమంలో ఉన్నప్పటికీ, తమ తల్లిని చూసిన తర్వాత వారి హృదయం తల్లి పట్ల ప్రేమతో ఆర్ద్రమయ్యింది. ఆర్యాంబ అభ్యర్థన మేరకు, శ్రీ శంకరులు ఆమెకు నిరాకార బ్రహ్మం గురించి బోధించడం ప్రారంభించాడు, కానీ ఆమె దానిని గ్రహించలేకపోయింది. తరువాత వారు శివునిపై ఒక స్తోత్రాన్ని పఠించగానే, శివదూతలు చేతులలో త్రిశూలాలతో ప్రత్యక్షమయ్యారు. తల్లి భయపడింది. వెంటనే శంకరులు విష్ణువుని స్తుతించారు, అది విన్నప్పుడు ఆమె తన హృదయంలోనే ఆ పరమాత్మ అద్భుత రూపాన్ని చూసింది. తల్లి ఆనందం గమనించిన శంకరులు ఆమెకు విష్ణుసాయుజ్యం కలిగేలా చేసారు. ఇది శంకరుల అద్భుత శక్తికి, తల్లిపై కల అపారమైన ప్రేమకు నిదర్శనం. పరివ్రాజకాచార్యులై కూడా తల్లికి అంత్యక్రియలు చేసి తమ మాట నిలబెట్టుకున్నారు.
ఈ విధంగా ఈ జగత్తుకే పిత అయిన శంకరులు శంకరునిగా ఒక దంపతులకు పుట్టి, భర్తను పోగొట్టుకున్న తమ తల్లి మనసు కష్టపడకుండా, పెట్టకుండా ఎంత బాగా చూసుకున్నారు! అదీ దైవత్వం. బలరామ కృష్ణులు కంసవధ తర్వాత చెరసాలలో ఉన్న తల్లితండ్రులను కలుసుకొని వినయంగా తల వంచి, వారితో ఎంతో ప్రేమగా మాట్లాడారు, చిన్నవాళ్ళం అవడం వల్ల, కంసుడి భయంవల్ల రాలేకపోయామని తమని క్షమించమని అడిగారు. సర్వార్థసమ్భవో దేహో జనిత: పోషితో యత: |న తయోర్యాతి నిర్వేశం పిత్రోర్మర్త్య: శతాయుషా|| పూర్తి జీవితకాలం ఎంత సేవ చేసినా కూడా ఏ మానవుడు తన తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేడని వాళ్ళు చెప్పారు. ఇదీ దైవత్వం, మానవుడిగా అవతరించినా మరువని దైవత్వం.
భగవద్గీతలో కృష్ణ పరమాత్మ, “యద్యదాచరతి శ్రేష్ఠస్తత్త దేవేతరో జనః| స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే|| శ్రేష్ఠులైనవారు ఏ పనిచేస్తే సాధారణ మానవులు వారిని అనుకరిస్తూ అవే పనులు చేస్తారు.|| యద్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః | మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః|| అలాగే నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనట్లయితే, మానవులందరు నా దారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు” అని చెప్పారు. అందువల్లనే మానవులుగా జన్మించిన శివకేశవులు తమ ధర్మ ప్రవర్తనతో అందరిపట్ల ప్రేమతో తమ విధులను చక్కగా నిర్వహించి మనకు మార్గ నిర్దేశం చేసారు. మనంకూడా ఆ మార్గంలో పయనించడమా? లేదా? అనేది మన బుద్ధివికాసాన్ని బట్టి ఉంటుంది.
తల్లి ఉపాధికి అంత్యకర్మలు నిర్వహించి, కన్నీరు కారుస్తూ మాతృ పంచకం వ్రాసారు శంకరభగవత్పాదులు. ఎంత విచిత్రం! ఎంత అద్భుతం! దేవాధిదేవుడు, వేదగేయుడు, వంద్యనీయుడు, జగన్మాత-పిత తానే అయిన శంకరుడు, ఒక సామాన్య స్త్రీకి పుత్రునిగా జన్మించి, జగన్మాతగా సృష్టిలోని చరాచరజీవులకు అందించే వాత్సల్యాన్ని, ప్రేమను, ఒక పుత్రునిగా తాను అందుకొని, ఆనందంగా అనుభవించి, లయకారకుడైన శంకరుడు తల్లి మరణానికి దుఃఖిస్తూ, తనకై ఆమె పడిన కష్టాలను, బాధలను మరచిపోలేని ఆ తల్లి ప్రేమ, వాత్సల్యాలను గుర్తు చేసుకుంటూ కన్నీరు కారుస్తూ, నివాళులు అర్పించడం ఎంత అద్భుతం!