శ్రీమద్రామాయణం
శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ప్రవచనాలు
శ్రీమద్రామాయణం
శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ప్రవచనాలు
ఎపిసోడ్ 10 - భాగం 01
(వీడియోలో ని|| 30 వరకు)
సభాయై నమః|
శ్రీరామరక్ష సర్వజగద్రక్ష! సర్వ శరణ్యుడు స్వామి, అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ| ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ| (రామ ఆపదుద్ధారక స్తోత్రం) రామా అనండి. రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరోత్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ సత్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమాతంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిథీ!॥ ( దాశరథీ శతకం 4) కరుణాపయోనిధి, దయాసముద్రుడు! సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే |.. (6.17.17) ఆ మహాత్ముడైన సర్వలోక సర్వజీవ శరణ్యుడు, రక్షకుడైన స్వామికి, .... నివేదయత మాం క్షిప్రం - నా సంగతి కొంచెం చెప్పండి. ఏమని? ..... విభీషణం ఉపస్థితం ఎవరికీ భయపడనివాడు, ఎవరివల్లా భయంలేనటువంటివాడు విభీషణుడనే వాడు వచ్చాడు అని. ఈమాట విన్నాడు సుగ్రీవుడు. మంత్రులను ఉద్దేశించి, "చూసారా! శత్రుపక్షం నుండి వచ్చాడు వీడు. పైగా గదా దండాలు పట్టుకొని వచ్చారు. మొత్తం అయిదుగురు వచ్చారు. వీళ్ళనెట్లా నమ్మడం? ప్రకృత్యా రాక్షసేంద్రస్య భ్రాతా (6.17.25) స్వభావసిద్ధంగా రాక్షసరాజు తమ్ముడు వీడు. శత్రుపక్షం నుండి వచ్చాడు. వెంటనే పరుగెత్తి రామచంద్రమూర్తి వారి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు తమ ప్రభువు, ప్రభువువారి దగ్గరకి వెళ్ళాడో ప్రధానులంతా వచ్చారు - అంగద, శరభ, జాంబవతు, మైంద,ద్వివిద మొదలైన వారంతా. స్వామికి నమస్కారంచేసి, "రామా! ప్రభో! శత్రుపక్షం నుండి వచ్చాడు రాక్షసుడి తమ్ముడట, రావణుడి తమ్ముడు విభీషణుడట. మనదగ్గర ఆశ్రయం ఇవ్వమని కోరుతున్నాడు. స్వామీ! వీడు సందు చూచి పెద్ద పక్షి కాకి పిల్లల్ని తిన్నట్టు మనల్ని సంహరించడానికి వచ్చాడు. ఎలా ఆశ్రయమిస్తాం?" అన్నాడు. స్వామి విన్నారు.
భగవంతుడి దగ్గర తమాషా ! భాగవతుల అనుగ్రహం పొంది సిఫార్సు వస్తే గాని ఎంట్రన్స్ ఉండదు. వారు 'ఓకే' అంటే అప్పుడు దాన్ని ఇంకా కొంచెం బలపరుస్తారు. అక్కడినుండి వద్దు, అని ఉంటే, ఎందుకని? [1]భగవాన్ భక్త భక్తిమాన్ (భాగవతం 10.86.59) ఏవం స్వభక్తయో రాజన్ భగవాన్ భక్తభక్తిమాన్ | ఉషిత్వాదిశ్య సన్మార్గం పునర్ద్వారవతీమగాత్ ||
భక్తుడి మాట ఎప్పడూ తిరస్కరించరు స్వామి. అది అనుగ్రహ స్వభావం! కరుణాస్వరూపం! చెప్పేమాట తమకు అయిష్టంగా ఉన్నా, చిరునవ్వుతో ప్రశంసిస్తూ మర్యాదగా చెపుతారట రామయ్య! చప్పున అవును కాదు అనలేదు. అలా కృష్ణయ్య చెపుతారు, కాని రామయ్య అలా చెప్పరు. పూర్వభాషీ ప్రియంవదః | భేష్! ఎంత మంచిగా మాట చెప్పవయ్యా! వాక్యం హేతుమదర్థ్యం చ భవద్భిరపి తత్ శ్రుతం| (6.17.32) "మంత్రుల్లారా! వానర మహావీరుల్లారా! పండితుల్లారా! విన్నారుగా! ఎంత చక్కగా చెప్పాడు సుగ్రీవుడు! స్నేహితుడైన వాడు ఇలాంటి సంకటాలు వచ్చినపుడు విషయాన్ని నిగ్గుదేల్చి నిజం చెప్పాలి, చెప్పాడు సుగ్రీవుడు. చాలా సంతోషం. మీరు కూడా మీ మీ అభిప్రాయాలు చెప్పండి. భిన్న రుచిః లోకః, మీకు తోచింది మాకు తోచదు. మాకు తోచింది మీకు తోచదు". వెంటనే రాజు తరువాత యువరాజు కనక, ఇక్కడ కూడా ప్రొటోకాల్స్ ఉన్నాయన్నమాట, గౌరవం! మర్యాద! అంగదుడు లేచాడు. "రామచంద్రా! శత్రువుదగ్గరి నుండి వచ్చాడు. వీణ్ణి సందేహించడం సందేహించడమే! తొందరపడి వీడిని తీసుకోకూడదు. మరెట్లా తీసుకోవాలి? అర్థానర్థౌ వినిశ్చిత్య, (6.17.41) వీడు మంచివాడా? చెడ్డవాడా? తెలుసుకున్న తరువాత తీసుకోవాలి," అన్నాడు. శరభుడనేవాడు లేచాడు, "నాయనా! నీదేమిటి,"అన్నారు. "ఏమిలేదు. వీడిమీద కొంచెం గూఢచారులను పెడదాము రెండురోజులు. వాడి నడక మంచి చెడ్డ కొంచెం తెలుస్తుంది కదా! అప్పుడు పట్టుకోవచ్చు" (6.17.44) అన్నాడు. జాంబవంతుడు లేచాడు. చాలా పెద్దవాడు, చాలా తెలివైనవాడు, గొప్ప సలహా చెప్పగలవాడు. కాని ఒక్కొక్కపుడు మడతపడితే పొరపాటు అద్భుతంగా పడతారు వాళ్ళు. ఒకటే క్లాజు పెట్టాడాయన. "బద్ధవైరాత్ చ పాపాత్ చ | రాక్షసేంద్రాత్ విభీషణః| అదేశకాలే సంప్రాప్తః| సర్వథా శంక్యతాం అయం|| (6.17.46) "వీణ్ణి నమ్మటం ఏమిటయ్యా రామచంద్రా! దేశంకాని దేశం, కాలంగాని కాలంలో వచ్చాడు. నిజంగా బుద్ధిమంతుడై వచ్చాడనుకుందామా సీతాపహరణం జరిగినరోజున రావాలి, ఏడాది అయ్యాక ఇప్పుడా? రెండు- ఎక్కడ ఉండగా రావాలీ? మనం ఋష్యమూక పర్వతంమీద ఉండగానైనా రావాలి పోనీ ఆఖరికి. తీరా లంకమీదకి వచ్చిన తరువాత వస్తున్నాడు. దేశకాలాలు బాగుండలేదు కనుక సర్వవిధాలా వీళ్ళు సందేహపాత్రులే" అన్నాడు. మైందుడనే వాడు లేచాడు, "అయ్యా! నాకొకమాట తోస్తుంది," అన్నాడు. తోస్తే చెప్పమన్నారు. "కొంచెం ఏమీ లేదు. వరసగా క్రాస్ ఎక్జామినేషన్ చేస్తే అడగ్గా అడగ్గా అడగ్గా ఏవో కొన్ని నిజాలు బయట పడతాయి, అని (6.17.48,49). ఏది దొరకనప్పుడు చివరికి ప్లీడర్లు పెట్టుకునే పద్ధతే ఇది! క్రాస్ ఎగ్జామినేషన్ పెడదాం,"అన్నాడు. అయిపోయింది. అప్పుడు రామచంద్రమూర్తివారు చూచారు హనుమంతుడి వైపు. ఆయనకి తెలుసుగా ఎవరు ఎలా మాట్లాడుతారో." అథ సంస్కార సంపన్నః| హనుమాన్ సచివోత్తమః| ఉవాచ వచనం శ్రేష్ఠం (శ్లక్ష్ణం) | అర్థవత్ మధురం లఘు|| (6.17.50) హనుమంతుడి మాట ఎలా ఉంటుందో చెప్పారు. శ్లక్ష్ణం సుందరంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. చాంతాడులా ఉండదు, సూక్ష్మంగా ఉంటుంది. మహాప్రాజ్ఞుడు! సర్వశాస్త్ర సర్వ వేద వేదాంగములు క్షుణ్ణంగా తెలిసినవాడు. ఆ మాటకే విలువ ఎక్కువ! "స్వామీ! న భవంతం అతిశ్రేష్ఠం సమర్థం వదతాం వరం| అతిశాయయితుం శక్తోబృహస్పతిరపి బ్రువన్|| (6.17.51) "వాగ్వేత్తవు, ధర్మవేత్తవు, సర్వజ్ఞుడవు! సర్వేశ్వరుడవు! రామా! లోకాభిరామా! మీదగ్గర మేము సలహాచెప్ప దగినవాళ్ళం ఎవరం ఉన్నామండీ? అయినా, మీ ఆజ్ఞ కనుక చెప్పక తప్పదు. కానీ నేను చెప్పేది - "న వాదాత్ న్నాపి సంఘర్షాత్ న ఆధిక్యాత్ న చ కామతః| వక్ష్యామి వచనం రాజన్! యథార్థం రామ గౌరవాత్|| (6.17.52) "రామచంద్రా! నీయందలి గురుత్వంవల్ల మాట్లాడుతున్నాను, వాదిద్దామని గాని, ఇతరుల మాట తోసేద్దామని గాని, నా ఆధిక్యత చూపించుకోవటంగాని, చపలచిత్తం కోసంగాని మాట్లాడడం లేదు. మీ మంత్రులంతా తలా ఒక్క మాట చెప్పారు. నాకెందుకో ఏదీ రుచించడం లేదు," అన్నాడు. "మంచివాడా చెడ్డవాడా తెలుసుకొని తీసుకుందామన్నాడు అంగదుడు. ఒక పని వాడికి పురమాయిస్తేగా మంచో చెడో తెలిసేది. మనవాడు మంచివాడు అనుకోకుండా పని చెప్పటం ఎట్లా? పిచ్చి కుదిరితే పెళ్లి, పెళ్లి కుదిరితే పిచ్చి, ఏమీ లాభంలేదు," అన్నాడు. ఒక గూఢచారిని పెడదామన్నాడు శరభుడు. అతను రాక్షసుడైతే, మహా మాయావి అయితే, రావణుడి తమ్ముడైతే, మన ప్రతినిధులకు అందుతాడా? ఈ గూఢచారులకు? పైగా నిజంగా అతడు మన స్నేహంకోరి మంచి భావంతో వస్తే సందేహించి మనం పరీక్షలో పెట్టామని ఇంకా అతనికి భేద బుద్ధి కలుగుతుంది. మనమే బుద్ధి చెడగొట్టినట్టు అవుతుంది. పెద్దాయన చెప్పారు, జాంబవంతులు. అదేశ కాలే సంప్రాప్త, ఇతి, నాకెందుకో చూడండి. రావలసిన చోటికి వచ్చాడు, రావలసిన టైముకే వచ్చాడు. మహా బుద్ధిశాలి కనుక వచ్చాడు. అతడు బ్రతకడం తెలిసినవాడు. ఎందుకని? ఏడాది నుంచి చూసాడు. బాగుపడతాడేమోనని ప్రయత్నించాడు. అతనివల్ల లాభం లేదనుకున్నాడు. అతన్ని నమ్ముకుంటే మనం కూడా మునుగుతాము అనుకున్నాడు, వచ్చేసాడు. సముద్రం దాటిన తరువాత వస్తే తప్పు. సముద్రం దాటకుండా వచ్చాడు. ఇది చాలా అవసరం. ఇంకొక్కమాట. ఎందుకొచ్చాడిప్పుడు? వాడు ఎస్టిమేట్ చేసాడు ఏడాది నుంచి. పురుషాత్ పురుషం ప్రాప్య, దౌరాత్మ్యం రావణస్య చ, విక్రమంచ తథా త్వయి| యుక్తం ఆగమనం హి అత్ర సదృశం తస్య బుద్ధితః|| (6.17.57,58) అతని బుద్ధికి తగిన పని చేసాడు. రావలసిన సమయానికి వచ్చాడు. ఇక్కడ చాలా విమర్శలున్నాయి. ఇంకొక్కమాట అన్నాడు హనుమంతుడు. ఒక్కసారి గతచరిత్ర చూసుకున్నాడు. ఎందుకు ఈ మాట అనాల్సివచ్చిందంటే అందరిమీద శరభుడికి చెప్పాడు. మైందుడికి చెప్పాడు. జాంబవంతుడికి చెప్పాడు. అంగదుడికి చెప్పాడు. ప్రభువైన ఆ సుగ్రీవుడి మాట ఖండించాలి - అది మర్యాద కాదు. బాస్ మీద మాట్లాడటం. అది క్రమశిక్షణకు విరుద్ధం, అని కదా అని ఏదో కొంచెం మెల్లగా చెప్పకపోతే ఆయన ఆగేటట్టు లేడు. అందుకని ఇన్ డైరెక్టుగా మాట్లాడాడు. రాజనీతి, యుక్తి! ఏమని? "ఏమీలేదు, గతచరిత్ర చూసాడు, వాలినశ్చ వధం శృత్వా సుగ్రీవం చ అభిషేచితం| రాజ్యం ప్రార్ధయమానస్య బుద్ధిపూర్వ మిహాగతః| (6.17.67) ఇట్లాగే మనకొక అన్నదమ్ముల కథ జరిగింది గదా వెనుక! దుర్మార్గుడైన అన్న బాధ పడలేక ధర్మాత్ముడైన తమ్ముడు మీ దగ్గరికి వచ్చాడు, ఆ తమ్ముడు సుగ్రీవుడు, మీరు కరుణించారు, వాలిని చంపారు. సుగ్రీవుడికి వానర రాజ్యమంతా ఇచ్చారు. అంతేగా! ఇది అందరికీ తెలిసిందేగా! అలాగే, రేపో మాపో పరమ దుర్మార్గుడైన రావణుణ్ణి మీరు సంహరిస్తారు. అక్కడ రాజ్యంలో వేకెన్సీ ఉంటుంది, అని అతనికి ఇవ్వవచ్చు. రాజ్యం ప్రార్ధయమానస్య బుద్ధిపూర్వ మిహాగతః, రాజ్యాన్ని కోరి మీ చరణారవిందాలని ఆశ్రయిస్తే రాజ్యప్రాప్తి కలుగుతుందని వచ్చాడు, తప్పేముంది? అతని క్షేమం అతను చూసుకున్నాడు,"అన్నాడు.
విభీషణుడంతటివాడిని రాజ్యం కోరాడంటారా? హనుమంతుడికంటే విభీషణుణ్ణి పెంచి చూచేవారు ఉన్నారు. అది పొరపాటు. కోటిమంది విభీషణులైనా హనుమంతుడు కారు. శ్రీరామ భక్తాగ్రగణ్యుల్లో అగ్రగణ్యుడు సాక్షాత్ హనుమంతుడు, హనుమద్భక్తి, హనుమద్దాస్యం, హనుమ అనురాగం!!! ప్రియమార కౌగిలించుకున్నారు హనుమంతుణ్ణి. విభీషణుణ్ణి కౌగిలించుకున్నారా? నీకు నేను ఋణపడ్డానురా! అన్నారు. పట్టాభిషేకమైన తరువాత తలా ఒక వరమిచ్చారు. సుగ్రీవుడికి కిష్కింధ, విభీషణుడికి లంక, ఇతర వానరులకు భూషణాలు, వస్త్రాలు, వజ్రాలు, వైడూర్యాలు, హారాలు, కేయూరాలు, నూపురాలు! "నాయనా! నీకేమి కావాలిరా? హనుమాన్!" అన్నారు. "దీర్ఘాయుష్యం ఇవ్వమ,"న్నాడు. "ఏ డబ్బో, రాజ్యమో కోరుతారు. ఇదేమిటి?" అని అడిగారు. "కాదు స్వామీ! నీ నామ సంకీర్తనం చేసి రామ సంకీర్తనాలు చేయించి నిన్ను సంకీర్తిస్తున్న భక్తుల సంకీర్తన నాదాలు విని నాకు తృప్తి కలగటం లేదు. ఇంకా చాలా కాలం బ్రతికి ఎల్లకాలం కూడా, "యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం." "స్వామీ! నీయొక్క నామ సంకీర్తన వైభవాన్ని చవిచూచి తృప్తి చెందలేక ఉన్నాను. నాకు ఆయుష్షు ఇవ్వమ,"న్నాడు. ఏకాంతభక్తి! దృఢమైన భక్తి! అనిర్వచనీయ భక్తి! సిద్ధభక్తి! పరభక్తి! విభీషణుడూ భక్తుడే! పరమ భాగవతుడే. కాదనను, కానీ హనుమంతుడి కంటే గొప్పవాడంటే, అవివేకం! మరిప్పుడు ఎందుకన్నాడు ఈమాట? రెండు పద్ధతులు. అసలిక్కడ వివాదం ఉంది. విభీషణుడు రాజ్యంకోరి వచ్చాడా? కేవలం రామచంద్రమూర్తిని కోరి వచ్చాడా?
[2]యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై| త గ్ం హి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే|| (శృతి మంత్రం)
శరణాగతి అనేది ఏదో ఒక్క సంప్రదాయంలోనే లేదు.(అన్ని సంప్రదాయాలలోనూ ఉన్నది అని భావం). సర్వ జీవులు పరమాత్మను శరణాగతి పొందాలి. ఎప్పుటివరకు? ఆయన ప్రభువని, మనం భృత్యులమని, ఆయన భగవంతుడని, మనం భక్తులమని, ఆయన ఏలినవాడని, మనం దాసులమని. ఈ భేదభావం మనలో ఎంతవరకు ఉంటుందో అంతవరకూ నువ్వు తప్పకుండా శరణాగతి పొందవలసిందే! ఆ భావం పోయింది, [3]అహం బ్రహ్మాస్మి! దేహో దేవాలయః ప్రోక్తః జీవో దేవః సనాతనః త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్| (భావయేత్)
అవధూతలు, బ్రహ్మవేత్తలు, పరిణిశ్చితులు - వారికి ఆశ్రయాలు, శరణాలు అక్కరలేదు. లోపల వారు ముక్తులు. ముక్తులకు శరణాలు అక్కరలేదు. వాళ్లెప్పుడో ముక్తులైనారు. జీవన్ముక్త షష్ఠభూమికలో ఉన్నారు. బ్రహ్మవిత్, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరేణ్య, బ్రహ్మవిద్వరిష్ఠ స్థానాలున్నాయి. బ్రహ్మవిద్వరిష్ఠ - అగ్రగణ్యస్థానం పొందినవారు. ఎవరు మహానుభావులు? పూర్వం శృంగేరి జగద్గురువులు చంద్రశేఖర భారతీ మహాస్వాములు! వారు ఆశ్రయించవలసింది లేదు. వారు పూజించాల్సింది లేదు. అందుకే ఒక స్థితి రాగానే ఆ పీఠమంతా శిష్యుల్ని పూజించుకోమంటారు. వారు నిర్వికల్పంగా, నిరాసక్తంగా, నిరాడంబరంగా ఉంటారు. అభినవ విద్యాతీర్థస్వామివారు అంతే! ఎన్ని సార్లో వెళ్లి మా వెంకటేశ్వర్ గారు ఇంకా ఇతరులు ఆంధ్రరాష్ట్రం రమ్మంటే, "నాకెందుకయ్యా! ఆయనొస్తున్నారు గదా! ఆయనను చూడండి," అన్నారు. అదీ శారదాపీఠంయొక్క గొప్పదనం! పరిపక్వత! ఇప్పుడు మన మహాసంవిధానంవారు అలాంటి స్థితికి వచ్చేస్తున్నారు. "మాకెందుకయ్యా! ఇక నెక్స్ట్ వారు రావాలి. అది ఎప్పుడూ వస్తారనుకోండి, అంతవరకూ ఈయనకు తప్పదు ఆ పూజ చేయడాలు, ఆ బాధ్యతలు, అవన్నీ కూడా! మేము రానక్కరలేదు అనేది- అక్కరలేదు అనేది ఒక గొప్ప తృప్తి అండి! కావాలనేది ఉందే అది బెడద! కర్తృత్వం, భోక్తృత్వమే సంసారం. అక్కరలేదు అని నీకు ఒకనాడు అనిపించాలి. నీకు అనిపించనంత వరకు ఈ సంసారం పోదు, ఒక్కటే గుర్తు. ఆ అలం బుద్ధి, చాలు అనే బుద్ధి రావాలి. చాలు అంటే త్రేన్పు వచ్చేస్తుంది. ఇహ, బాహ్య, ఆముక్త, ఫల, భోగ, వైరాగ్యం రావాలి. ఎన్ని కబుర్లు చెప్పినా ఆ స్థితి రావాలి. ఆ స్థితి బ్రహ్మవేత్తలకు కలుగుతుంది, కనుక చూడండి: "యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ|" (భగవద్గీత 2-69) అట్టి బ్రహ్మవేత్తలైనటువంటి మహానుభావులకు అక్కరలేదు గాని ఈలోపల కావాలి. అందుకే మంత్రం ఏమన్నది? ముముక్షుర్వైశరణమహం ప్రపద్యే, ముముక్షుః - ముక్తి ఇఛ్చ కలిగినవాడే, కాని మోక్షం పొందినవాడుకాడు! శరీరం ఉన్నా మోక్షం పొందవచ్చు. కర్తృత్వ, భోక్తృత్వ లంపటాలు ఎవరికి లేవో వారికి శరీరం ఉన్నా మోక్షమే! శరీరం పోతే విదేహ కైవల్యం, శరీరం ఉంటే జీవన్ముక్తి. అంతే తేడా! కాని మోక్ష ఇచ్ఛ కలవాడున్నాడే, "యో బ్రహ్మాణం విదధాతి పూర్వం (శ్రీదక్షిణామూర్తి స్తోత్రం, శాంతిపాఠం) - బ్రహ్మను ఎవరు నిర్ణయించారో - యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై, ఆ బ్రహ్మగారికి సమస్త జగత్తు సృష్టి, రచన, వైభవాన్ని చూపించడానికి వేదాలను ఎవరైతే ఇచ్చారో, ప్రజాపతిః అకామయత ప్రజా సృజేయ ఇతి| తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్|| (తైత్తిరీయ ఉపనిషద్-2-6) ఆ పరమేశ్వరుడు బ్రహ్మకు చోదనమిచ్చి బ్రహ్మాండమంతా పుట్టించాడు. వేదాలను ప్రకాశింపచేసాడు. తగ్ం హ దేవం ఆత్మ బుద్ధి ప్రకాశం, ఎక్కడున్నాడు? ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽఅర్జున తిష్ఠతి| భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా|| (భగవద్గీత 18.61) హృద్దేశంలో ఉన్నాడు సర్వాంతఃకరణ సాక్షి. "అంతఃకరణ, ఆత్మాకార, బుద్ధి సాక్షాత్కార ఏవ అపరోక్షానుభవః|" అని వేదాంతశాస్త్రం చక్కగా నిర్ణయం చెప్పింది. అటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాలి. ఆశ్రయించడానికి వచ్చాడు. విభీషణుడు పరమ భాగవతుడే! అయితే - రాజ్యం కోరాడా? కోరలేదా? కోరాడనే అనటానికి అవకాశాలున్నాయి. రామచంద్రమూర్తివారు అభయం ఇవ్వగానే రాఘవేణాభయే దత్తే సన్నతా రావణానుజః| పాదయోర్నిపపాత| (6.19.1) రామమూర్తి పాదాలమీద పడి ఒక్క మాట అన్నాడు, "స్వామీ! భవద్గతం మే రాజ్యం చ జీవితం చ సుఖాని చ ॥ (6.19.6) నీ శరణాగత అనుగ్రహంతో నాకు ధనం, వసతి, రాజ్యము అన్నీ ఉన్నాయి. మీ పాదములే నాకు ఆధారం!" అన్నాడు.
నాలుగు: ఆర్తః - బాధలలో ఉన్నవాడు అవి పోగొట్టమని, జిజ్ఞాసు - నేనంటే ఏమిటో తెలుసుకుందామని, అర్థార్థీ - ధనం కావాలని, జ్ఞానీ - తానే నేనని - అహం బ్రహ్మాస్మి! అయమాత్మా బ్రహ్మా! సంజ్ఞానం బ్రహ్మా! ప్రజ్ఞానం బ్రహ్మా! అని తెలిసినవాడు - నలుగురు! ఈ నలుగురూ నన్ను కోరుతారు. సర్వ ఏవ ఉదారాః, అంతా మంచివాళ్ళే! అన్నారు. అందులో చెడ్దవాళ్ళెవరూ లేరు. ఎందుకని? ధనం కావాలని కోరినా నన్నే కోరుతున్నారుగా! నీ కోరిక ఏదైతే ఏమిటి? కోరటం నన్నేగా. అక్కడుంది చమత్కారం! బాధ పోగొట్టమని ఆపద మొక్కులవాడా! నన్నే కోరాడుగా, నన్ను తెలుసుకుందామన్నా నన్నే కోరాడుగా! అందుకని నలుగురూ గొప్పవారే! జ్ఞానీ త్వాత్మైవ మే మతం৷ (భగవద్గీత 7.18) నేనే అతడనుకున్నవాడున్నాడే అహం బ్రహ్మాస్మి! (ఏకం బ్రహ్మ ద్వితీయ నాస్తి) నేహ నా నాస్తి కించన| న హి ద్రష్టుః దృష్టేః విపరిలోపః విద్యతే| ఈ సమస్త విశ్వాకార బ్రహ్మాండాకారమైన వస్తువంతా పరబ్రహ్మ చైతన్యమే! ఆవరణ, విక్షేపణములు కలిగిన ఆ మాయచేత కప్పబడి దేహాదులతో ఉపాధులతో భిన్నభిన్నంగా తన, మన, పర, స్వ అనిపిస్తున్నాయి. వస్తువంతా పరబ్రహ్మస్వరూపం అనుకునే జ్ఞాని నాకు చాలా ప్రియుడు అన్నారు. ప్రియుడేకాదు. ఆత్మైవ - నేనే! బ్రహ్మోపదేశం చేసిన బ్రహ్మజ్ఞానం అనుగ్రహించిన గురువున్నాడే - అతణ్ణి నేనేరా! అన్నారు. ఎక్కడ? భాగవతం కుచేలోపాఖ్యానంలో, శ్రీకృష్ణవాక్యం. ధనం కోరినా విభీషణుడు తప్పేమీ లేదు, ఇంకొక్క మాట. పరమభక్తుడనటంలో ఎటువంటి సందేహం లేదు. విభీషణుడు పరమభక్తుడండి! ప్రొద్దున్నే లేచి స్నానంచేసి, ఇవ్వాల్టికి కూడా, దినచర్య - పురాణాలు వ్రాసాయి, శ్రీరంగం వెళ్ళి రంగనాథస్వామి సేవ చేస్తాడట. సాయంకాలం ప్రదోష కాలంలో పశ్చిమసముద్ర తీరంలో ఉన్న గోకర్ణేశ్వరుడు-మహాబలేశ్వరుని సేవ చేస్తాడు, విభీషణ ప్రతిష్ఠిత లింగం గోకర్ణంలో కనబడుతుంది మనకు. శివవిష్ణువులకు అపారమైన, అద్భుతమైన భక్తివైభవంతో ఆరాధించి, రాక్షస సామ్రాజ్యాన్ని ధర్మనిష్ఠంగా అదుపులో ఉంచి పరిపాలిస్తున్నాడు. ఆయన రాక్షసుల్ని అదుపులో పెట్టి పరిపాలించకపోతే మనల్ని ఉండనిస్తారా వాళ్ళు? విభీషణుడు రాజు కనకనే రాక్షసబాధ మనకు లేకుండా ఉంది. పదివేల సంవత్సరాలు తపస్సు చేసారు ముగ్గురూ - కైకసి అనే ఆమెకు కుమారులు. విశ్రవసుబ్రహ్మగారి కుమారులు - రావణ, కుంభకర్ణ, విభీషణులు. రావణుడు సరే ఏదో అడిగాడు ఎక్కడా చావురాకుండా! కుంభకర్ణుడు నిద్రలేకుండా అడుగుదామనుకున్నాడు. నిద్ర లేకుండా అందర్నీ చంపవచ్చని, వెధవ నిద్ర సగం టైం పోతున్నదని. దేవతల ప్రార్థన చేత సరస్వతీదేవి నాలుక తడబడేలా చేస్తే నిద్ర నిద్ర అని అడిగాడు. నువ్వు నిద్రపోతూ ఉండరా! అన్నారు. అప్పుడు రావణాసురుడు వచ్చి మొత్తుకున్నాడు. "ఎప్పుడు నిద్రే అంటే ఎలా స్వామీ? పోనీలే ఆరు నెలలు నిద్రపోతాడు, ఒకరోజు లేస్తాడు, మళ్ళీ ఆరు నెలలు పడుకుంటాడు. ఈ ఒక్క రోజు వాడు మహా గొప్పవాడవుతాడు, అన్నారు. ఏదో కొంచెం సౌకర్యం ఇచ్చాడు. "విభీషణా! నీకేమి కావాలి?" అన్నాడు. యా యా మే బుద్ధిః సా సా ధర్మిష్ఠా భవతు || (వా.రా.ఉత్తరకాండ 10.32) (యా యా మే జాయతే బుద్ధిర్యేషు యేష్వాశ్రమేషు చ | సా సా భవతు ధర్మిష్ఠా తం తు ధర్మ చ పాలయే) "స్వామీ! నా బుద్ధి ఎప్పుడూ ధర్మమందే నిల్చుగాక!" ధార్ష్ట్యం అక్కర్లేదు. రాజ్యం అక్కర్లేదు. డబ్బు అక్కర్లేదు. దాన్నే మళ్ళీ తిరగదోడాడు, నాకే బుద్ధిపుడితే అదంతా ధర్మమే కావాలి. అంటే ఎప్పుడూ ధర్మాన్ని తప్పకూడదు. అన్వయ వ్యతిరేకాలున్నాయి. పరమాపద్గతస్యాపి ధర్మే మమ మతిర్భవేత్ (ఉత్తరకాండ 10.31) "శభాష్! రావణానంతరం శాశ్వతంగా ఈ రాక్షససామ్రాజ్యం నువ్వే పరిపాలిస్తావు!" అన్నాడు. "అయ్యయ్యో! రాజ్యం ఎందుకు?" అన్నాడు. కాదు కాదు. మంచివాడు పరిపాలించక, చెడ్డవాడు వదలకపోతే ఏం కావాలి రాజ్యం? పరిపాలించు." లోగడే బ్రహ్మదత్తమైన వరం ఉన్నది కనక ఆ వరాన్నిప్పుడు మళ్ళీ స్వామికుడా ఇవ్వబోతున్నారు, కనుక అదే కోరాడు. తప్పేముంది? రాజ్యం కోరాడు అనుకోవడం ఎందుకు? మరి హనుమంతుడు ఎందుకు అన్నాడీ మాట? ఒకాయన అన్నాడు, "హనుమంతుడు పప్పులో కాలేసాడండి, విభీషణుడి స్కేల్ సరిగా చూడలేదన్నాడు. పప్పులో కాలుకాదు, ఉప్పులో కాలుకాదు. సుగ్రీవుడికి లెంపకాయ కొట్టడానికి పెట్టాడు ఇది. ఇప్పుడొచ్చాడు అప్పుడొచ్చాడు అంటావు. మనం ఎప్పుడు వెళ్ళామన్నాడు. వాళ్ళు కిష్కింధకి వచ్చాకేగదా మనం వెళ్ళింది? పైగా సుగ్రీవుడు వీళ్ళ అందర్నీ చంపించడానికే వెళ్ళాడు. ఈయన అన్నను చంపించడానికి కాదు నీ ఆశ్రయం కావాలని అంటున్నాడు. నీవు ఆజ్ఞాపిస్తే చంపిస్తాడు, అది వేరు. ఈ తమ్ముడు పథ్యమైనప్పుడు ఈ వచ్చిన తమ్ముడెందుకు పథ్యం కాడు? అంటే నువ్వేమిటయ్యా? ఈ కేసు FIR పెట్టి తెచ్చేవాడివి నువ్వా? నీకసలు ఆ క్వాలిఫికేషన్ ఉందా? ఇవ్వటానికి యోగ్యత ఉందా? ఛీ నోరు మూసుకో, అన్నట్టుగా అవన్నీ డైరెక్టుగా అడగకూడదు కనుక కొంచెం మర్యాదావాచకంగా, "కొంచెం ఏమండీ! ఆ గ్లాసుతో నీళ్లు తెచ్చి పెడతారా?" అంటే, అరె వెధవా! నీళ్ళు తేరా అని. అండీ మండీ అంటే కొంచెం సంతోషిస్తాడు. హనుమంతుని యొక్క వాక్యాలు బైట ఎక్కడ ఏ సిచ్యుయేషనులో ఏ సందర్భంలో ఎవడితో మాట్లాడితే ఎలా మాట్లాడాలో హనుమంతుణ్ణి చూసి నేర్చుకోమన్నారు రామాయణంలో. అందుకే "బాల్యే రామాయణం ఇదం పాఠ్యం|" పిల్లలకు మొదట రామాయణం చెప్పండి! బాల రామాయణం. ముందు రామాయణం చెపితే బ్రహ్మాండపురాణం, "స వక్తా సభాసు స్యాత్," వాడు మహావక్త అవుతాడు సభల్లో, పండితుడవుతాడు, విద్వాంసుడవుతాడు. రామాయణం యొక్క ప్రభావం, హనుమంతుణ్ణి దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్ని సమాధానాలయ్యాయి. [4]ఆనుకూల్యస్య సంకల్పః, ప్రాతికూల్యస్య వర్జనం | రక్షిష్యతి ఇతి విశ్వాసః, గోప్తృత్వే వరణం తథా | ఆత్మనిక్షేప,కార్పణ్యే షడ్విధా శరణాగతిః || శరణాగతి అనేది ఆరు భాగాలు. ఒక్కటి. తప్పక స్వామి నన్ను రక్షిస్తాడు. మొదటిది విశ్వాసం. "[5]మంత్రే తీర్థే ద్విజే దేవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావనా యస్య సిద్ధిః భవతి తాదృశీ||
ఆయనేం చేస్తాడులే అంటే ఏం చేయడు, "రక్షిష్యతి ఆనుకూల్యస్య ఇతి సంకల్పః," ఆ స్వామి దగ్గరకి మనం చేరాలి. ప్రతికూల వాతావరణం వదిలిపెట్టాలి. స్వామి తప్పక రక్షిస్తాడు. "స్వామీ! రక్షించు ప్రభో! పాహి మాం!" నీ పాదముల దగ్గర నన్నుంచుకుంటున్నాను. అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే| తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్యహం|| (భగవద్గీత,9.22) కార్పణ్య - పరమదీనుణ్ణి, దాసుణ్ణి, అవివేకిని, సంసారబద్ధుణ్ణి రక్షించు స్వామీ! నీ అనుగ్రహం! భక్త్యా మామ్ అభిజానాతి యావాన్ యః చ అస్మి తత్త్వతః । తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం (భగవద్గీత 18.55) భక్తితో పరమాత్మను తెలుసుకోవాలి, ఆశ్రయంతో తెలుసుకోవాలి, ఆశ్రయించాడు. స్వామి విన్నారు.
[1] తమ భక్తుల భక్తికే అంకితమైన భగవంతుడు, తన ఇద్దరు పరమ భక్తులైన శ్రుతదేవ, బహులాశ్వులతో కొంతకాలం ఉండి, వారికి సన్మార్గాన్ని బోధించి ద్వారకకు తిరిగి వచ్చారు. శ్రుతదేవుడు బ్రాహ్మణుడు, బహులాశ్వుడు క్షత్రియుడు, బ్రాహ్మణుడు కాని క్షత్రియుడు కాని ఇద్దరిని ఒకే విధంగా చూసారు, ఇద్దరితో ఒకే విధంగా ప్రవర్తించారు. ఎక్కడ జన్మించామో కాదు, భగవంతునిపైన ఎంత మనసు పెట్టాం అనేదే ప్రధానం, అని ప్రభుపాదులు చెప్తున్నారు. (భాగవతం 10.86.59)
[2] 1. శ్వేతాశ్వతరోపనిషద్ షష్ఠోధ్యాయం శ్లోకం 18 https://upanishads.org.in/upanishads/9/6/18#
2. గోపాలపూర్వతాపిని ఉపనిషత్తు శ్లోకం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో విద్యాం తస్మై గోపాయతి స్మ కృష్ణః| తం హ దేవమాత్మబుద్ధిప్రకాశం ముముక్షుః శరణం వ్రజేత్ || శ్లోకం22.
https://upanishads.org.in/otherupanishads/46/22
[3] 1. మైత్రేయ్యుపనిషద్ ద్వితీయోధ్యాయం|| దేహో దేవాలయః ప్రోక్తః స జీవః కేవలః శివః| త్యజేదజ్ఞాననిర్మాల్యం సోహం భావేన పూజయేత్ || 2వ శ్లోకం
2. బ్రహ్మాండ పురాణం ఉత్తరభాగం అధ్యాయం 43 || దేహో దేవాలయః ప్రోక్తో జీవ ఏవ మహేశ్వరః| త్యజేదజ్ఞాననిర్మాల్యం సోహంభావేన యోజయేత్ ||53||
[4] 1. https://www.wisdomlib.org/hinduism/book/hari-bhakti-vilasa-sanskrit-text/d/doc501957.html 11.676 v33 నిత్యకృత్యసమాపన-విలాస
తత్ చ ఉక్తం వైష్ణవతంత్రే |ఆనుకూల్యస్య సంకల్పః ప్రాతికూల్యవివర్జనం |రక్షిష్యతీతి విశ్వాసో గోప్తృత్వే వరణం తథా |ఆత్మనిక్షేపకార్పణ్యే షడ్విధా శరణాగతిః|| 22
2. https://ia804705.us.archive.org/17/items/in.ernet.dli.2015.322565/2015.322565.Ahirbudhnya-Samhita.pdf అహిర్బుధ్న్య సంహిత -37అధ్యాయం 28-29శ్లోకాలు
3. http://scsmath.org/publications/pdfs/Prapanna-Jivanamritam_searchable.pdf శ్రీప్రపన్నజీవనామృతం ద్వితీయోధ్యాయం 32 శ్లోకం శ్రీశాస్త్ర వచనామృతం పేజీ 72/266
4. https://www.sanskrit.nic.in/books_archive/021_Vaishnava_Tantra_of_Dr_Shyamakanta_Dwivedi.pdf నవమ అధ్యాయం. 23 398/604 పేజీ
[5] మంత్రే తీర్థే ద్విజే …. (పంచతంత్రం 5.98) (స్కాంద పురాణం, బ్రహ్మ ఖండం, బ్రహ్మోత్తర ఖండంలో 17 అ అధ్యాయంలో 8వ శ్లోకం)హరివంశపురాణం, పద్మపురాణోక్త మాహాత్మ్యం అధ్యాయం 3, శ్లోకం 20,21
స్కంద పురాణంలో ఈ శ్లోకం నాల్గు అయిదుచోట్ల కనిపిస్తుంది, 1. బ్రహ్మఖండం, బ్రహ్మోత్తర ఖండం, 3.3.17.8; 2. అవంతీ ఖండంలో రేవాఖండం 5.3.227.20; 3. నాగర ఖండం 6.124.76; 4. ప్రభాసఖండం, ప్రభాసక్షేత్రమహాత్మ్యం 7.1.278.39; పరాశర సంహిత అధ్యాయం 12, శ్లోకం 29.