శ్రీమద్రామాయణం
శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి
ప్రవచనాలు లిఖిత రూపంలో
శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి
ప్రవచనాలు లిఖిత రూపంలో
ఎన్నో పురాణాలు, సంహిత గ్రంథాలు, సంస్కృతాంధ్ర కావ్యాలు ఇలా ఎన్నో పుస్తకాలలోన్నుంచి ఎక్కడి ఎక్కడివో విషయాలను ప్రస్తుతం తాను చెప్పే అంశానికి సమన్వయం చేస్తూ ఎక్కడా కొద్దిగా కూడా విసుగు అలసట లేకుండా శ్రోతలనెవ్వరిని ఒక్క మాట అనకుండా అలా నవ్వుతూ చెప్పుకు పోతుంటారు, పక్కనే రైళ్ళ చప్పుళ్ళు, బస్సు రొదలు, జేగంటా నాదాలు, సభలో చిన్ని పిల్లల రోదన ధ్వనులు ఇవి ఏవీ వారి వాక్ ఝరీ స్రవంతికి అడ్డు రావు,కావు. వారికి మైకు ఉందా? లేదా? అనే బాధే లేదు కాబట్టి మధ్యలో తత్సంబంధీకుణ్ణి సున్నితంగానో, విసుగ్గానో ఏదైనా అనవలసిన అవసరం లేదు, రాలేదు, పైగా సరదాగా ఆయన మీద ఆయనే జోక్ చేసుకుంటూ నాకు మైకు అక్కర్లే అని చిన్నపిల్లాడిలా నవ్వేసుకుంటారు, ఎనభైయ్యవ పడిలో కూడా ఇంత ఓపిక, తాను చేసే పనిమిద ఇంతటి శ్రద్ధ.
ఇన్ని పుస్తకాలలోని వివిధ విషయాలు గుర్తు పెట్టుకోవడం, గుర్తు రావడం, సద్యస్స్ఫూర్తితో ఠక్కున ఒక పదాన్ని దాన్ని సిననిమ్ తో సంస్కృతంలో రీప్లేస్ చేసి చెప్పడం వారికే తగును. (రోజుకి కళ్ళద్దాలు నూటనాలుగు సార్లు, రాస్తున్న రామకోటి ఓ యాభై సార్లు వెతుక్కునే సామాన్యులం మనం ఎక్కడ? అనర్గళంగా తెలుగు సంస్కృత పద్యాలను రాగయుక్తంగా శ్రోతలకు అందించే ఆ మహానుభావులు ఎక్కడ? Type, find, search, deep search, scan, replace ఇలాంటివి ఏవీ లేవు, direct గా hitting on the nail లేకపోతే వారికి ఇష్టమైన పవిత్రమైన, పునీతమైన, వాడియైన, తీక్షణమైన రామ నామాంకితమైన రామ బాణాల్లా, వారి మేధ అనే అక్షయ తూణీరాన్నుండి అలా వస్తూనే ఉంటాయి నారద భక్తి సూత్రాలు, ధూర్జటి, భర్తృహరి, దాశరథీ శతకాలు, స్కంద, పద్మ, బ్రంహ్మాండ, బృహద్ధర్మ పురాణాలు. వారి వయసు వారి ఉత్సాహం విలోమాను పాతంలో ఉంటాయేమో? వారంటే అందరిలా నాకు చాలా గౌరవం, అభిమానం, వల్లమాలిన ఇష్టం, మా నాన్నగారినే చూస్తున్న ఆనందం. అలాంటి మహానుభావుల ప్రవచనం వినగల్గడమే ఒక గొప్ప వరం, నిద్ర రాకపోగా హుష్ కాకి అయిపోయి వద్దన్నా పాంచజన్య శంఖపు ధ్వనిలా కర్ణపుటాల ద్వారా బ్రెయిన్ పుటలలోకి వెళ్ళి మనః శిలా ఫలకం మీద చిత్రింపబడి కాదు, కాదు, చెక్కబడి మనకు సద్యోముక్తిని ప్రసాదిస్తుంది. శంఖం శంఖమేగా, చిన్నారి ధ్రువుడికి అనర్గళంగా భగవంతుణ్ణి కీర్తించగలిగే మాటలను ఇస్తే మనకి ఏకంగా స్వర్గాన్నో ముక్తినో ప్రసాదిస్తుంది. ఇది నా ప్రగాఢ నమ్మకం.
వారిని చూడలేకపోయాను, వారికి నమస్కరించలేకపోయాను అనే కొరత, వెలితి ఖచ్చితంగా ఉంటుంది, గురువుగారికి ఏదో చేయాలి అన్న తపనే నాతో వారి ఈ వీడియోలకి ఈ అక్షర రూపం కలిపించే ప్రయత్నం. ఇందులో గురువుగారు ఏమి చెప్పారో అది ఒకటికి నాలుగు సార్లు విని, వారు చెప్పిన పద్యాలు శ్లోకాలు వెతికి కూర్చడం జరిగింది. వారిపై భక్తి గౌరవం అంటూ వారు చెప్పినది నా కపిత్వంతో తప్పులుగా రాయకూడదు కదా! రామాయణమే ఎందుకు అంటే,
వసుధలో ఎవరైన పత్రాళి వ్రాయుచో శ్రీరామ చుట్టి వ్రాసెదరు కాదె,
ఘాతుకంబేదైన కాంచుచో జాలిమై రామ! రామ! అని ప్రజలంద్రు కాదె,
ఆకలిబాధితుల ఆర్తారవంబెల్ల అన్నమో! రామచంద్రాయె గాదె !
పార్వతికి అభవుండు ప్రవచించు తారక మంత్రమ్ము రామ నామంబు కాదె!
ఇంత గాఢంబుగా ప్రజా హృదయమందు
హత్తుకొనిపోయె రామ నామాక్షరములు
పిలుపులోనైన రాముని పేరు తలప
మానవాళికి కైవల్య మార్గమదియె!!
గురువుగారు చెప్పిన రామాయణ ప్రవచనాలు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఎంచక్కా రాములవారి బొమ్మతో ఉన్న ఇదే వస్తుంది కాని వీడియో ది అస్సలు కుదరలేదు, సరే వారు ప్రవచనాలు విరమించే ముందు చివరిసారిగా చెప్పిన రామాయణమే రాముడికి ఇష్టమని అనుకొని ఇదే మొదలు పెట్టా. దీనికి ఏమైనా rights అవి ఉంటాయేమో తెలియదు, కాని ఇది ఏదో స్వలాభంతో చేసింది కాదు. ఇందులో ప్రతి అక్షరం ప్రతి పలుకు ప్రతి శ్లోకం, ప్రతి పద్యం గురువుగారు చెప్పినదే, చదువుకోవాలి అని తాపత్రయ పడేవారికి(నాకు అలాగే ఉంటుంది) ఇది ఉపయోగ పడుతుందని, ప్రతి అక్షరంలో వారి గొంతు వినిపిస్తుందని వారు ఇచ్చిన ప్రవచన పారిజాతాన్ని భక్తితో శ్రద్ధతో తిరిగి గురువుగారి పాదపద్మాలకే సమర్పిస్తున్నాను.
టైపులో కాని ఇంకా ఎక్కడైనా తప్పులు కనిపిస్తే అవి నావే, సహృదయంతో నన్ను మన్నించండి.
ప్రసన్న కుమారి