మాతృపంచకం
మాతృపంచకం
ఈ మాతృపంచకంలో ముక్తామణిస్త్వం అనే శ్లోకం కొందరు మొదటిదిగా తీసుకుంటే దీని మూడవ శ్లోకమైన ఆస్తాం తావదియాం అనేది మొదటిదిగా ఇస్తున్నారు కొందరు. ఏది ఏమైనా, ఈ శ్లోకాలు దేనికి అదే పరిపూర్ణంగా ఉండటంవల్ల భావానికి కాని, అన్వయానికి కాని ఎక్కడా బాధ కలగకుండా చక్కటి అంతర్వాహిని అయిన సరస్వతీ నదీ ప్రవాహంలా కవిత్వ మాధురీఝరీ పై పొరలలో, బాధ, శోకం మన అంతరంగంలో కలిగిస్తూ ఉంటాయి.
ముక్తామణిస్త్వం నయనం సుమేతి రాజేతి జీవేతి చిరం సుత త్వం|
ఇత్యుక్తవత్యా స్తవవాచి మాతః దదామ్యహం తండులమేవ శుష్కమ్ || 1.
నన్ను అక్కున చేర్చుకొని, నా వరహాల మూట, నా బంగారుకొండ, నా కంటి దీపం అంటూ ముద్దాడిన నీకు, ఓ అమ్మా! ఇదిగో ఈ ఎండిన నువ్వులను ఇస్తున్నాను, అని బాధ పడ్తున్నారు శంకరులు.
ఏ తల్లి అయినా స్తన్యం ఇస్తూనో, ఒడిలో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తూనో, స్నానం చేయించేటపుడో, ఆ చిన్నారి కొడుకుతో, ‘మా బాబు వజ్రాలమూట, బంగారు కొండ, నాకేమో మావాడంటే ఆకాశమంత ఇష్టం’ అంటూ ఏదో మాట్లాడుతూ ముద్దాడుతూనే ఉంటుంది. ఒకటే భేదం, ఆర్యాంబ సాక్షాత్తు ఆ శివుణ్ణే ఒడిలో పడుకోబెట్టుకొని ముద్దాడగలిగింది ఆ యశోద మాతలా.
అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః |
కృష్ణేతి గోవింద హరే ముకుంద ఇతి జనన్యై అహో రచితఃఽఽఅయమంజలిః|| 2
ప్రసవ సమయంలో ఆ పురిటి బాధలకు తట్టుకోలేక, "అమ్మా, నాన్నగారూ, ఓ కృష్ణా, గోవిందా, శ్రీహరీ, తండ్రీ, ముకుందా అంటూ ఎలుగెత్తి అరుస్తూ, బాధపడుతూ, నాకు జన్మను ఇచ్చిన నా తల్లికి భక్తితో అంజలి ఘటిస్తున్నాను.
తన సంతానానికి జన్మను ఇచ్చేటప్పుడు ఏ తల్లి అయినా భయంకర వేదనను అనుభవిస్తుంది, దాదాపు యమలోకపు అంచులవరకు వెళ్ళి వస్తుంది. కాని, తన పుత్రుణ్ణి చేతిలోకి తీసుకోగానే అంతకు ముందువరకు పడిన బాధ, కష్టం మరచిపోయి, అసీమానందాన్ని అనుభవిస్తుంది, అటువంటి తల్లికి అంజలి ఘటిస్తున్నారు భగవత్పాదులు.
ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వారశూలవ్యథా |
నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సాంవత్సరీ|
ఏకస్యాపి న గర్భభారభరణక్లేశస్య యస్యాక్షమః|
దాతుం నిష్కృతిమున్నతోఽపి తనయస్తస్యై జనన్యై నమః .. 3
అమ్మా! ప్రసూతి సమయంలో వర్ణించశక్యంకాని బాధను అనుభవించావే కాని దాని గురించి పల్లెత్తు మాట అనలేదు, అనుకోలేదు. దాని తరువాత కూడా దాదాపు ఒక సంవత్సర కాలం అస్వస్థతగా ఉంటూ, నీ పుత్రుడు ఒక వేళాపాళ లేకుండా మంచంపైని దుప్పట్లను తడుపుతూ, మలంతో పాడుచేస్తూ ఉంటే, ఆ సమయంలో కూడా, నీ చిన్నారి శిశువుకి అసౌకర్యంగా ఉందేమో అని బాధ పడ్డావే తప్ప అసహ్యించుకోలేదు. ఎంతటి గొప్పవాడైనా, మహనీయుడైనా ఒక పుత్రుడు అటువంటి తన తల్లి ఋణం ఎన్నటికీ తీర్చుకోలేడు అమ్మా!
గురుకులముపసృత్య స్వప్నకాలే తు దృష్ట్వా
యతిసముచితవేశం ప్రారుదో మాం త్వముచ్చైః |
గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం సపది
చరణయోస్తే మాతరస్తు ప్రణామః || 4
తల్లీ! నీ స్వప్నంలో నన్ను యతి రూపంలో చూసి, నేను సన్యసించానేమో అనే భయంతో, నన్ను వదిలి ఉండలేక పెద్దగా ఏడుస్తూ మా గురుకులానికి పరుగెత్తుకుంటూ వచ్చావు. అక్కడ నీ స్వప్న వృత్తాంతం చెప్పుతూ, నన్ను గాఢంగా నీ హృదయానికి హత్తుకొని నీవు పెద్దగా ఏడుస్తుంటే నీ దుఃఖాన్ని చూసి గురుకులం అంతా నీతోబాటు కన్నీరు కార్చింది. అటువంటి అవ్యాజ అనురాగం కురిపించిన ఓ జననీ! నీ పాదాలకు నా ప్రణామాంజలులు.
నిజంగా ఆ మహాతల్లి ఆర్యాంబ వేదన ఊహాతీతం కదా. పిల్లవాడు పసికూనగా ఉండగానే భర్తను పోగొట్టుకుంది. కొడుకు పైనే పంచప్రాణాలు పెట్టుకొని జీవిస్తున్నది. అటువంటి స్థితిలో, ఉన్న ఆ ఒక్క నలుసు సన్యసిస్తే ఆమె ఏం చూసుకొని జీవించాలి? జీవించగలదు? కానీ మహనీయురాలు. పుత్రుణ్ణి లోకోద్ధరణ కోసం త్యాగం చేసి, ఏనాడు మళ్ళీ వెనక్కి పిలవకుండా జీవించింది కదా. భగవంతుడు తాను అవతరించడానికి తనకు తల్లి స్థానంలో అందరిని ఎన్నుకోడుగా, ఒక అదితి, ఒక కౌసల్య, ఒక అనసూయ, ఒక యశోదమ్మ, ఒక ఆర్యాంబ. అంతే, పునీతాత్మలు. ప్రాతః స్మరణీయులు.
న దత్తం మాతస్తే మరణసమయే తోయమపివా
స్వధా వా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా |
న జప్త్వా మాతస్తే మరణసమయే తారకమనుః
అకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతురతులాం|| 5
ఓ తల్లీ! నీవు చనిపోయే సమయంలో కనీసం (తులసీ) నీళ్ళు అయినా నీ నోట్లో పోయలేక పోయాను, తారక మంత్రాన్ని నీ చెవిలో జపించలేకపోయాను, నీకు శ్రాద్ధకర్మల విధుల ప్రకారం ఇంత నైవేద్యం కూడా పెట్టలేకపోయాను- పిండప్రదానం చేయలేకపోయాను. అయ్యో! సరియైన సమయంలో రాలేకపోయిన నీ పుత్రుణ్ణి ఓ తల్లీ! నీ అపార కరుణతో క్షమించు.
గొప్పదనంలో తల్లి కొడుకులు ఇద్దరూ ఒకరికి ఒకరు ఏ మాత్రం తీసిపోరు. మరణశయ్యపైన ఉన్న తల్లి, కొడుకు ఇచ్చిన వాగ్దానం గుర్తు పెట్టుకొని, ఒకసారి రా తండ్రీ, అంటూ తన భావాన్ని మనస్సు ద్వారా పంపవచ్చు. ఆమె అలా చేయలేదు. కానీ వాగ్దానం చేసిన లోకపిత-పుత్రుడు-శంకరుడు మరిచిపోలేదు. అందుకే ఆభాస కలిగి, భగవంతుడు కనుక ఒక్క క్షణంలో తల్లి ముందు వాలాడు. తల్లికి శంకర కింకరులదర్శనమూ, వైకుంఠ దర్శనమూ కలిగించారు. విష్ణు సాయుజ్యాన్ని ప్రసాదించారు. ఇంతా చేసి, అసలు ఏమీ చేయనివానిలా నీచెవిలో మంత్రం చెప్పలేదు, నీ నోట్లో ఇన్ని నీళ్ళయినా పోయలేదు, పిండప్రదానం చేయలేకపోయాను అంటూ దుఃఖిస్తున్నారు. అసలు ఇవన్ని ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాలి? ముక్తి కోసమే కదా! అది ఇప్పించారుగా! అయినా, ఉత్తమసంస్కారవంతుడైన సాధారణ మానవునిలా తన తల్లికి ఏమేమి చేయలేకపోయారో అవి తలచుకొని దుఃఖిస్తున్నారు. ఇదీ మనిషికి మహానుభావుడికి మధ్య ఉన్న వ్యత్యాసం. మనం ఇది అనుకరిస్తామా? అనుసరిస్తామా? మన సంస్కారం నిర్ణయిస్తుంది.