చిరకారీ అహల్యా-గౌతమ మహర్షుల మూడవ పుత్రుడు. మొదటి పుత్రుడు శతానందుడు. జనకమహారాజుల కులగురువు. ఈ పేరు మన అందరికి బాగా తెలిసినదే. రామాయణం, బాలకాండలో విశ్వామిత్రులు రామలక్ష్మణులను తీసుకొని మిథిల, జనకమహారాజు దగ్గరికి వెళ్తారు కదా! అక్కడ శతానందులు విశ్వామిత్రులను చూడగానే నమస్కరించి కుశలప్రశ్నలు అయిన తరువాత, విశ్వామిత్రులు రామ-లక్ష్మణులగురించి చెప్పుతూ, "అహల్యాదర్శనం చైవ గౌతమేన సమాగమమ్," అహల్యను చూసామని, గౌతముని కలిసాము, అని చెప్తారు. అది వినగానే శతానందులు ఎలా అయ్యారో, గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం ఎలా కురిపించారో, వాల్మీకివారి మాటల్లోనే చూద్దాం:
హృష్టరోమా మహాతేజాః శతానందో మహాతపాః || గౌతమస్య సుతో జ్యేష్ఠస్తపసా ద్యోతితప్రభః...అపి తే మునిశార్దూల మమ మాతా యశస్వినీ | దర్శితా రాజపుత్రాయ తపో దీర్ఘముపాగతా ||అపి రామే మహాతేజో మమ మాతా యశస్వినీ |వన్యైరుపాహరత్ పూజాం పూజార్హే సర్వదేహినామ్ || అపి రామాయ కథితం యద్ వృత్తం తత్పురాతనమ్ | మమ మాతుర్మహాతేజో దైవేన దురనుష్ఠితమ్ || గురుణా మమ సంగతా | మాతా మమ మునిశ్రేష్ఠ రామసందర్శనాదితః ||
నిశ్చల తపస్సువల్ల నిర్మలమైన మనస్సును ప్రతిఫలింపచేస్తూ ప్రకాశిస్తున్న మేనితో శతానందులు సంతోషంతో రోమాంచితులై, "మా అమ్మ శాపవిముక్తురాలు అయిందా?" అని సూటిగా ప్రశ్నించకుండా "సుదీర్ఘ తపస్సు చేసిన యశస్వినీ అయిన మా మాతను రాములవారు చూసారా? మాతల్లి రాములవారిని పూజించిందా?" అని అడుగుతున్నారు. మా తల్లితండ్రులు కలిసిపోయారా?" అని సూటిగా అడగలేక, "మా మాత జీవితంలో సంభవించిన దురదృష్టకర ఘటన వీరికి మీరు చెప్పారా? మా తండ్రిగారుకూడా వీరిని పూజించారా?" అంటూ తల్లితండ్రులపై అమిత ప్రేమ, భక్తి గౌరవాలతో అన్యాపదేశంగా ఎలా ప్రశ్నించారో? తమ తల్లిని కాని, తండ్రిని కానీ తప్పు పట్టడం లేదు. విధివశాత్తు ఒక దురదృష్టకర ఘటన జరిగింది, అంతే. తల్లితండ్రులు ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించాలి. ఇదే శతానందులకు కావలసినది.
ఇక వారిద్దరి రెండవ సంతానం శరద్వాన్, ఈయన్ని ఎక్కువగా గౌతమ అనే సంబోధించడంతో మనలాంటివాళ్ళకి కొంచెం గణ్దరగోళంగా ఉంటుంది.
ఈపుత్ర గౌతములు, "పుత్రః కిల మహారాజ! జాతః సహ శరైః విభో|| చేతుల్లో బాణాలతో పుట్టారట, అందువల్ల శరద్వాన్ అయ్యారు. సాధారణంగా బ్రాహ్మణులందరికి వేదాధ్యయనం పై ఎంత ఆసక్తి ఉంటుందో ఈయనకి ధనుర్విద్యపై అంతకంటే ఎక్కువ మక్కువట. తపస్సుద్వారా అన్నీ సాధించారు. వీరి సంతానం కృపా(చార్యులు) కృపీ(ద్రోణాచార్యుల భార్య) శరద్వాన్/చిన్న గౌతములు తమ పిల్లల్ని వదిలి వెళ్లిపోతే వీరిద్దరిని శంతను మహారాజు పెంచుతారు. ఆయన కృప/దయతో పెంచారు కాబట్టి వాళ్ళు కృపా, కృపీ అయ్యారు.
ఇక మూడవవాడే మన కధానాయకుడు. అసలు పేరు తెలియదు. కానీ,
చిరేణ సర్వకార్యాణి యో విమృశ్య ప్రపద్యతే| చిరకార్యాభిసంపతేశ్చిరకారీ తథోచ్యతే |
ఏ పని చెప్పినా దానివల్ల జరిగే మంచి-చెడు ఫలితాలను చాలా తీవ్రంగా ఆలోచించి, విమర్శించిన తరువాతే, కొంచెం ఆలస్యంగా ఆ పనులు చేస్తూ ఉండటంవల్ల ఈయనకు చిరకారి అని పేరు వచ్చింది.
మనకు అహల్యాగౌతముల కథ తెలుసు. పూజ్యులు, గురుతుల్యులు అయిన అందరు ప్రవచనకర్తల పుణ్యమా అని రామాయణంలో విన్నాం, అంతగా మనకు తెలియనిది చిరకారి-అహల్యా-గౌతములకు సంబంధించిన ఈ కథ ఏమో అని నా ఊహ.
ఈ కథ మహాభారతం, శాంతిపర్వం 266 అధ్యాయంలో ఉంది. అలాగే ఇదే కథ స్కందపురాణం, మహేశ్వర ఖండంలోని కౌమారిక ఖండంలో కూడా ఉంది.
ముందు వెనక పరిణామాలు ఆలోచించకుండా చర్యలు తీసుకున్నప్పుడు, ఎటువంటి తప్పులు అయినా జరగడానికి ఆస్కారం ఉంది. అలా పని చేసేవారివల్ల అందరికి నష్టం కలుగుతుంది, ఆ వ్యక్తిని అందరూ నిరసిస్తారు అనే నీతి వాక్యాలతోనూ,
సహసా న క్రియాం కుర్యాత్ పదం ఏతత్ మహా ఆపదామ్ | విమృశ్యకారిణం ధీరం వృణతే సర్వసంపదః || క్షణికావేశంలో ఉద్వేగపూరితమైన నిర్ణయాలు తీసుకొని, వాటిని అమలులో పెడితే అంతా నష్టమే జరుగుతుంది. ముందు వెనక బాగా ఆలోచించి పనులు చేసేవాళ్ళని విజయలక్ష్మి ఎప్పుడూ వరిస్తుంది అనే ఉపదేశంతో ప్రారంభమవుతుంది ఈ కథ.