శ్రీమద్రామాయణం
శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ప్రవచనాలు
శ్రీమద్రామాయణం
శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ప్రవచనాలు
ఎపిసోడ్ 05 - భాగం 01
(వీడియోలో ని|| 30 వరకు)
సభాయై నమః|
తం దృష్ట్వా గిరి సంకాశం (గిరిశృఙ్గాభం) రామో లక్ష్మణమబ్రవీత్, అనేన సీతా వైదేహీ భక్షితా న అత్ర సంశయః|| (3.67.11) సీతమ్మను వెతుకుతున్నవారై రామ లక్ష్మణులు పంచవటీ ప్రాంతం అంతా తిరుగుతున్నారు. అక్కడ ఒక చెట్టు కింద రక్తసిక్తమైన శరీరంతో రెక్కలు నరకబడి జటాయువనే పక్షిరాజు పడి ఉన్నాడు. ఆర్తుడై చివరి స్థితిలో ఉన్నాడు. ఇతడే సీతను అపహరించాడా? అనిపించింది. దగ్గరకు వెళ్ళారు, స ఫేనం రుధిరం వమన్ అభ్యభాషత పక్షీ తు రామం దశరథాత్మజం, (3.67.14) దీనుడైన రామమూర్తిని చూస్తూ దీనమైన వాక్కుతో మూల్గుతూ నెత్తురు కక్కుకుంటూ జటాయువు అంటాడు, యాం ఓషధిమివ ఆయుష్మన్ అన్వేషసి మహావనే| సా దేవీ మమ చ ప్రాణా రావణేన ఉభయం హృతం| (3.67.15) స్వామీ! ఏ తల్లిని నీవు వెతుకుతున్నావో ఆ మాత, జగన్మాత, భూజాత, సీతామాతను నా ప్రాణాలతో సహా ఆయమ్మను రావణుడు అపహరించాడు. స్వామీ! నీవు ఆశ్రమం దగ్గర లేనపుడు, ఈ లక్ష్మణుడు కూడావెళ్ళినపుడు బలవంతుడైన రావణునిచేత సీతమ్మ అపహరింపబడుతూ నాకు కనబడింది. నేను ఊర్కొనలేక వాడిని ఎదుర్కొన్నాను.
దశరథమహారాజు స్నేహితుడు జటాయువు. అదే తమాషా! దేవాంశ సంభూతులైన పక్షిజాతి వాళ్ళు. గరుత్మంతుడు, అరుణుడు ఇద్దరూ అన్నదమ్ములు. అరుణుడికి తొడలు లేకపోవడంవల్ల సూర్యుడికి సారథిగా ఆగిపోయినాడు. అరుణుడికి ఇద్దరు పిల్లలు, జటాయువు, సంపాతి. సంపాతి దగ్ధపక్షుడై వింధ్య పర్వతశిఖరాలపైన పడిపోయినాడు. జటాయువు దండకారణ్యంలో పడ్డాడు. ఈ జటాయువుకి దశరథుడికి స్నేహంట. ఈనాడు కర్ణాటకం, తమిళం, ఒరియా ఒక నాలుగు భాషలు వస్తే అబ్బో! చాలా భాషలు వచ్చు అనుకుంటాము, కాదు పశుపక్షులతో కూడా మాట్లాడే భాషలు ఉండేవి అప్పుడు. మరి ఎట్లా మాట్లాడారో మనకు తెలియదు.
దశరథుడికి నేను స్నేహితుణ్ణి , స్వామీ! నిన్ను, నీ ఆశ్రమాన్ని, సీతమ్మను కాపాడుతూ ఉంటాను, అని స్వామితో చెప్పి తన జీవితపు చివరి భాగంలో రామసేవ సంప్రాప్తమైందని పంచవటిలో మకాం పెట్టాడు. సీతాపహరణం జరిగేటప్పుడు ఊర్కొనలేక రావణాసురుడితో తలపడ్డాడు. వాడు వరదర్పితుడు, బలవంతుడు. ఇతగాడు పాపం పక్షి, పైగా వృద్ధుడు, వాడు రెక్కలు నరికితే రక్తసిక్త దేహంతో పడిఉన్నాడు. అప్పటికి ఊరుకోలే, రావణాసురుడి రథం విరిచాడు, కిరీటం పడేశాడు, గాయ పరిచాడు, ఒళ్ళంతా రక్కాడు, పీకాడు, ఏం చేసినా చివరకు వాడు జటాయువుని పడేసాడు. ఏతదస్య ధనుర్భగ్నం ఏతదస్య శరావరం| అయమస్య రథో రామ భగ్నః సాంగ్రామికో మయా|| (3.67.18) స్వామీ! నాచేత విరవబడ్డ ధనుస్సు అది, ఇదిగో, ఇక్కడ కవచం, ఇదో వాడి ఈ రథాన్నే నేను పగులగొట్టాను, సీతమ్మను తీసుకొని వాడు వెళ్ళిపోయినాడు. ద్విగుణీకృతుడైన తాపార్తుడైనాడు స్వామి. సీతాపహరణం ఒక పక్క, తనను ఆశ్రయించిన పక్షిరాజు పడిపోవడం మరొకపక్కన, జటాయువును కౌగిలించుకొని ఆర్తత్రాణపరాయణుడు, ఆశ్రిత సంరక్షకుడు రామచంద్ర ప్రభువు రోదనం చేసారు. నాయనా, లక్ష్మణా! మన నాన్నగారి స్నేహితుడు, వృద్ధుడు, మనకోసం ప్రాణాలర్పించాడు, మహాత్మా! జటాయో! యది శక్నోషి వాక్యం వ్యాహరితుం పునః సీతామాఖ్యాహి భద్రం తే| వధమాఖ్యాహి చాత్మనః| (3.68.4) పక్షిరాజా! నీకేమాత్రం ఓపిక ఉన్నా చాతనైనా మా సీతను ఎవరు ఎత్తుకెళ్ళాడు? వాడెక్కడ ఉంటాడు? కిం నిమిత్తఃఽహరతి సీతామ్? ఎందుకు సీతాపహరణం చేసాడు? కారణం ఏమిటి? కథం వీర్యః కథం రూపః కిం కర్మా స చ రాక్షసః | క్వ చాస్య భవనం తాత! బ్రూహి మే పరిపృచ్ఛతః| (3.68.7) వాడి పరాక్రమం ఎటువంటిది? వాడి రూపం ఎటువంటిది? ఎటువంటి రాక్షసుడు? వాడి నివాసం ఎక్కడ? ఆ వివరాలన్ని నాకు చెప్పమన్నారు. పరిశ్రాన్తస్య మే తాత పక్షౌ ఛిత్వా స రాక్షసః| సీతామాదాయ వైదేహీమ్ ప్రయాతో దక్షిణాం దిశమ్| (3.68.10) యుద్ధం చేసి పరిశ్రాంతుడనైనాను, నా రెక్కలన్ని నరికాడు, వాడు సీతను తీసుకొని దక్షిణ దిక్కుగా వెళ్ళాడయ్యా, నా ప్రాణాలు నిలిచేటట్టు లేవు, దృష్టి పోతున్నది, ఎక్కువ చెప్పలేను, కాని ఒక్కటి చెప్తున్నా, యేన యాతి ముహూర్తేన సీతామాదాయ రావణః | వినష్టం ధనం క్షిప్రమ్ తత్స్వామీ ప్రతిపద్యతే| విన్దో నామ ముహూర్తోఽయమ్ స చ కాకుత్స్థ నాబుధత్|| (3.68.12) వాడు సీతాపహరణం చేసిన ముహూర్తాన్ని బట్టి వాడికి సీతమ్మ దక్కదు. ఆ సీతమ్మకు యజమానివైన నీవు ఆ సీతమ్మను పొందగల్గుతావు. నీకు సీతా సంప్రాప్తమున్నది. అది విందమనే ముహూర్తం, అని చెప్పి ప్రాణాలొదిలాడు జటాయువు. నాకోసం నీ ప్రాణాలు వదిలావు కనుక నా అనుగ్రహం చేత నీకు వైకుంఠ ప్రాప్తి ఉన్నది నాయనా! హాయిగా సుఖంగా వెళ్ళు ఎట్టి అవరోధాలు లేకుండా, యా గతిర్యజ్ఞశీలానామ్ ఆహితాగ్నేశ్చ యా గతిః | అపరావర్తినాం యా చ యా చ భూమిప్రదాయినామ్| (3.68.30) సంతతాగ్నిహోత్రాలు జరిపినవారికి, యజ్ఞాయాగాదులు చక్కగా పూర్తి చేసిన మహానుభావులైన కర్మఠులకు, భూదానాదులు చేసినవారికి, ఏ ఉత్తమోత్తమమైన గతులు సంక్రమిస్తాయో ఆ గతుల ద్వారా నీవు దివ్యలోకం చేరమన్నారు. మయా త్వం సమనుజ్ఞాతో గచ్ఛ లోకాననుత్తమాన్|| నేను ఆజ్ఞ ఇస్తున్నా వెళ్ళు, అలా చెప్పి చితియందారోపించి జటాయువుకి సశాస్త్రీయంగా దహనం చేసి ప్రేతమంత్రాలన్ని స్వామివారు చదివి పిండప్రదానాలు కూడా చేసారు.
జటాయువు మరణానంతరం రావణ అని, దక్షిణదిక్కని తెలిసింది. ఎక్కడ అమ్మవారుంది అని వెతుకుతారు? పుట్ట పుట్ట, మెట్ట మెట్ట, సర్వ ప్రాంతాలు విచారించి వెతుకుతూ వెళ్తున్నారు ఇద్దరు. ఇంతలో కబంధుడనే భయంకర రాక్షసుడు ఎదురుపడ్డాడు. వాడు గంధర్వుడు, స్థూలశిరుడనే మహర్షిని బాధపెడితే శపించారు. వాడిది వికారమైన మొండెంవంటి ఆకారం. అంటే వాడి తలను ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే తల పొట్టలోకి వెళ్ళింది. ఆ లోపలి పొట్టలోంచి ఒక కన్ను ఉంటుంది, దానితో చూస్తాడు. రెండు బ్రహ్మాండమైన పొడుగైన చేతులు, ఆ చేతులతో జీవకోటిని పట్టుకొని తింటూ ఉంటాడు, పశువుల్ని, ఏనుగుల్ని, మృగాలని, వాడి చేతిలో పడ్డది ఏదీ మళ్ళీ బయట పడలేదు. అది వాడి వరం. వాడు శ్రీరామ లక్ష్మణులని పట్టుకున్నాడు, ఇద్దర్ని చెరొక భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు. శాపమైనా వాడికదొక వరం, అదృష్టం. ఈ శాప పరిష్కారాలకే పరమాత్మ అవతరించడం. చెరి ఒక భుజాన్ని నరికేసారు కత్తితో. అపుడు వాడికి జ్ఞానం కలిగింది. ఎలాగైనా నన్ను గోతిలో పడవేయండి, నాకు సంస్కారాలు చేయండి, నాకప్పుడు దివ్య రూపం వస్తుంది. నేను గంధర్వుణ్ణి, మహా సౌందర్యవంతుణ్ణి, ఇట్లాంటి పిచ్చి వేషం వేసుకొని ఋషులను భయపెట్టా నేను, ఆ స్థూలశిరుడనే మహర్షి ఈరూపంతోనే పడి ఉండరా అని నన్ను శపించారు. కాబట్టి ఈ రూపం వచ్చింది. నీచేత కృతార్థుడనౌతానని ఆయన అనుగ్రహించారు, అదే శాప విముక్తి అన్నారు, అని చెప్పాడు. అలాగా, నీవు గంధర్వుడవే అయితే నాకొక్క పని చేయి, సీతను అపహరించిన రావణుడు ఎక్కడ ఉంటాడు? ఎలా వెళ్ళాలి? వాడి శక్తి ఎంత? అవన్ని వివరంగా చెప్పు. "స్వామీ! ఈ శరీరంతో నాకలాంటి జ్ఞానం ఏదీ ఉండదు, ఈ శరీరం పోయి గంధర్వ శరీరం రాగానే చెప్తా అన్నాడు. అలాగే వాడి శరీరానికి సంస్కారం చేసారు, గంధర్వ శరీరం వచ్చింది. ఆకాశం మీద నిల్చాడు. స్వామీ! ఆ చెప్పరా ఇపుడు, శృణు రాఘవ తత్త్వేన యథా సీతామవాప్స్యసి, (3.72.7) రామచంద్రా! నీవు సీతను ఎలా పొందుతావో చెప్తాను,విను,శ్రూయతాం రామ వక్ష్యామి| సుగ్రీవో నామ వానరః భ్రాత్రా నిరస్తః క్రుద్ధేన వాలినా శక్ర సూనునా|| (3.72.11) స తే సహాయో మిత్రం చ సీతాయాః పరిమార్గణే | భవిష్యతి హి తే రామ మా చ శోకే మనః కృథాః | (3.72.15) ఇక్కడినుండి నేరుగా అరణ్యాలు దాటి వెళ్ళావంటే మతంగ మహర్షివారి ఆశ్రమం ఉన్న ఋష్యమూకం అనే పర్వతం వస్తుంది. కిష్కింధా గుహనుండి వెళ్ళగొట్టబడి, బలవంతుడైన, దుర్మార్గుడైన అన్న వాలిచే పరాభవింపబడిన సుగ్రీవుడు ఆ గుట్టమీద కూర్చొని ఉంటాడు. ఆ ధర్మాత్ముడు. సత్యశాలి, బుద్ధిమంతుడు, మంచివాడు. నీవు స్నేహం చేయతగినవాడు. కారణం ఏమిటంటే ఆయన భార్యను వాళ్ళ అన్న అపహరించాడు. నీ భార్యను రావణుడు అపహరించాడు. సమానస్థితిలో ఉన్నవారికి స్నేహం ఠక్కున కుదురుతుంది. ఏకదశను అనుభవిస్తున్నవాడు కనుక నీకతను సరియైన స్నేహితుడు. మా చ శోకే మనః కృథాః, దుఃఖించకు, ఇదే దారి, ఇటునుండే వెళ్ళమన్నాడు. వాడెక్కడుంటాడురా? వాడి లక్షణమేంటిరా? అని ఈయన అడిగితే వాడు అవన్ని చెప్పకుండా, అక్కరలేని మాటలన్ని చెప్పి సుగ్రీవుడు దగ్గరకు వెళ్ళు, స్నేహం చేయి అంటాడు. ఇది డొంక తిరుగుడు వ్యవహారమేగా!
రావణుడని చెప్పడే ఎవడు, ఫలాని చోట ఉన్నాడని చెప్పేవాడే లేడే తమాషా! సరే, అదే విధంగా బయల్దేరి వెళ్ళారు స్వామి, శబరి ఆశ్రమం దర్శించారు. మహా భక్తురాలు, మతంగ మహర్షి శిష్యులవారలకు చేసిన పవిత్రమైన సేవాధర్మంతో మహా యోగ నిరతి సంపాదించిన తపశ్శాలి. ఆ శబరి ఎదురు వచ్చి, స్వాగతమిచ్చి, స్వామివారినర్చించి, ఆరాధించి తాను ఎన్నాళ్ళనుండో సంపాదించుకున్న ఫలాలు, మూలాలు, పుట్టతేనె తీసుకు వచ్చి స్వామిని ఆరగించమని ఆతిథ్యం ఇచ్చింది.
ఇక్కడ ఎంగిలి పళ్ళు పెట్టింది శబరి అంటారు. కాని ఎక్కడా లేదామాట. స్కాంద పురాణంలో ఉన్నదొక మాట. పరీక్షితాని మయా మధురాణి రసవంతిచ ఫలాని, మంచి పళ్ళన్ని ఏరి కోసి వాటి మాధుర్యాన్ని పరీక్షించి తెచ్చి ఉంచాను, మహాత్మా! ఇదిగో తీసుకోమన్నది. అంటే మరి పరీక్షించాను అన్నదిగా, కాబట్టి ఎంగిలి పళ్ళు పెట్టి ఉంటుంది, అని అపోహ. అద్భుతమైన శక్తి కలది ఆ శబరీమాత. కచ్చిత్తే నిర్జితా విఘ్నాః కచ్చిత్తే వర్ధతే తపః |కచ్చిత్తే నియతః క్రోధ ఆహారశ్చ తపోధనే|| కచ్చిత్తే నియమాః ప్రాప్తాః కచ్చిత్తే మనసః సుఖమ్ | కచ్చిత్తే గురుశుశ్రూషా సఫలా చారుభాషిణి|| (3.74.8 & 9) రామచంద్రమూర్తివారు శబరిని అడిగిన మాటలివి: "అమ్మా! నీకు తపస్సిద్ధి అయిందా? నీవు సేవించిన సద్గురువుల సేవ సఫలమయిందా? కోపాన్ని గెలిచావా? మనస్సుకు సుఖం కలిగిందా? దాంతునికైనా వేదాంతునికైనా శాంతమూ లేక సౌఖ్యము లేదు. స్వామీ! మీ దర్శనం అయినాక ఈ శరీరం వదులుదామని అనుకున్నా. మా గురువులు మతంగులవారి శిష్యులు గురు సేవ చేసారు. ఎట్లా చేసారు? చెమటలు కారిపోయేటట్లు అరణ్యాలకు వెళ్ళి సమిధలు తెచ్చి, పుష్పాలు తెచ్చి ఆ సద్గురువుల సేవ చేసారు. గురుసేవతో వారు కష్టపడుతున్నప్పుడు కారిన చెమట బిందువులు ఇక్కడ తీగలై వృక్షాలై పుష్పాలు ఫలాలు అయినాయి. ఈ పుష్పాలు వాడిపోవు, ఈ ఫలాలు చెడిపోవు. (3.73.25) ఇది సిద్ధ స్థానం. మతంగమహర్షివారి ఆశ్రమ ప్రాంతం పరమ పవిత్రమైనది. ఇక ఈ శరీరాన్ని వారు భరించలేక బ్రహ్మలోకానికి వెళ్ళిపోయినారు. స్వామీ! నేనూ వస్తాను అన్నాను. అమ్మా! ఉండు, మేము ఈ శరీరం తట్టుకోలేక వెళ్తున్నాము, ఇక్కడికి సగుణ, సాకార రాఘవ పరబ్రహ్మ స్వరూపం రాబోతున్నది, సుందరాతి సుందర, మధుర, శ్యామల, కోమల,మోహన రామస్వామిని దర్శించి కృతార్థురాలవై అప్పుడు నీ శరీరాన్ని వదులు, నీవుకూడా బ్రహ్మలోకం చేరుతావు, మేము ఉండలేక వెళ్తున్నాం అని మా గురువులు చెప్పారు. స్వామీ! మా గురువులు నివసించిన స్థానం ఇది, వృద్ధాప్యం చేత ఉపవాసాలవల్ల కృశించిన దేహాలతో కదిలి వెళ్ళలేక ఆ మహర్షులు అయ్యో! నదుల్లారా! మీ దగ్గర స్నానం చేయలేకపోయినాము అని బాధ పడుతుంటే సప్త సాగరాలు, సర్వ నదీనదులు ప్రవాహాలు వచ్చి స్నానం చేయించేవి (3.74.25) ఈ గట్టు మీద. వారి తపస్సు అమోఘం. స్వామీ! సర్వస్వం కూడా మీ స్వరూప దర్శనం చేత నాకు లభించింది. అద్య ప్రాప్తా తపస్సిద్ధిస్తవ సందర్శనాన్మయా, (3.74.11), మయా తు వివిధం వన్యం సంచితం పురుషర్షభ| తవార్థే పురుషవ్యాఘ్ర పమ్పాయాస్తీరసమ్భవం, (3.74.17) పంపానదీ తీరమందు పుట్టిన మధురాతి మధురమైన ఫలాలను తీసుకు వచ్చి పెట్టా ఇక్కడ. స్వామీ! ఇవి ఆరగించి మీరు నన్ను కృతార్థురాలిని చేయండి, అని ప్రార్థించింది. స్వామి ఆజ్ఞతో స్వామి సమక్షంలో అగ్నిని పేల్చి తన శరీరాన్ని అగ్నిలో వదిలేసింది. అలా వదలవచ్చా? అని. వృద్ధః, శౌచక్రియా లుప్తః, వృద్ధుడైనవాడు, కర్మలు చేయలేనివాడు, శరీరం పట్టు తప్పినవాడు నీటిలో, అగ్నిలో, యోగంతో ప్రాణాలు వదలవచ్చు, మన పూర్వ జగద్గురువులు చంద్రశేఖరభారతీ మహాస్వాములవారు తుంగలో శరీరాన్ని వదిలారు. బ్రహ్మవేత్తలకు ఈ శరీరం వదలడం ఆత్మహత్య కాదు. వారికి ఆ స్వేచ్చ, ఎందుకంటే ఇక ఈ శరీరంతో ఏ కర్మకాండ చేయడంయందు వారికి ఆసక్తి లేకపోతే, అనాసక్తమైనపుడు వారికి ఆ స్వేచ్ఛ ఉంది. నీకు శరీరంతో చేసే పనులయందు ఆసక్తి ఉన్నంతవరకు ఈ శరీరాన్ని పోషించుకోవాలి. జిజీవిషే శతగుం సమాః, చావాలని ఎవరూ అనుకోకూడదు, బ్రతకాలి అనుకోవాలి, మరి బ్రతకడానికి తిండి వద్దా, అంటే ఆయురన్నం ప్రయచ్ఛతి, ఆయుస్సుఉంటే అన్నం ఎక్కడున్నా దొరుకుతుంది, లేకపోతే-మనమంటాంచూడండి వాడికి నూకలు లేవని, అదే.
బజార్లో కనపడ్డవాళ్ళనందరిని భోజనానికి పిలిచేవాడు ఒకమహానుభావుడు, గొల్లపూడి రామ్మూర్తి భాగవతార్ అని, తర్వాత సన్యసించారు. ఎవరు కనబడితే వాళ్ళని మధ్యాహ్న భోజనానికి పిలిచేవారు, మరి ఆవిడ ఎట్లా వండేదో? ఆయన ఎట్లా పెట్టేవారో? ఒకరడిగారు, "స్వామీ! ఇట్లా అందరిని పిలుస్తున్నారే, వీళ్ళ అందరికి ఎట్లా?" అని. “పిచ్చివాడా! పిలవడానికి నేనెవణ్ణిరా? ప్రతి బియ్యపు గింజమీద వాడి పేరు రాసి ఉంటుంది, వాడి పేరు రాసిన బియ్యపు గింజలు వాడికోసం ఉంటాయి, అవి వాడు తిని పోతాడు. నువ్వు పెట్టవనుకో, రాత్రి వాడు దొంగతనానికి వచ్చి అయినా ఆవకాయ అన్నం తిని పోతాడు,” (అలా జరిగిన సంఘటనలు ఉన్నాయి). నీ చేత్తో పెడితే పెట్టానని ఒక తృప్తి, నువ్వు పెట్టకపోయినా అది వాడిదే, నీది కాదు. అదంతా నాది అనుకుంటావు, నీది భ్రమ, నీది ఏముంది ఇక్కడ? అనేవారు. అదీ భక్తులయొక్క లక్ష్యం అన్నమాట. కనుక శరీరం ఆహారం లేక చావదు, కాలం తీరాలి. లేకపోతే స్వతంత్రమైన జ్ఞానం కలవాళ్ళు శరీరాన్ని మూడు విధాల వదిలేయవచ్చు. శబరి కృతార్థురాలయింది.
ఉమాసంహిత, అరణ్యకాండ ఫలశృతి లో ఒక్కొక్క కాండకు ఒక్కొక్క ఫలితం చెప్పారు, అందులో [1]శబర్యాః స్వర్గతిం శృత్వా సాధ్వీనాం లోకగో భవేత్| శబరి వృత్తాంతాన్ని సావధానంగా వింటే ఉత్తమ పతివ్రతలు కలిగే లోకాలు మనకు సంప్రాప్తమవుతాయి అన్నారు.
శబరి పుణ్యలోకాలకు వెళ్ళినాక రామలక్ష్మణులు మళ్ళీ బయల్దేరారు. ఆ గుట్టమీద కూర్చున్నాడొక కపిరాజు. ఆ వానరులలో ఒకడు సుగ్రీవుడు. పాపం! అన్నచేత తరిమివేయబడ్డాడు, అతని భార్య రుమ అనే ఆమెను కూడా వాడు అపహరించి ఇతన్ని వెళ్ళగొట్టాడు. ఆ సుగ్రీవుడు ఉన్నారక్కడ, అదీ సుగ్రీవుడి భాగ్యం, అదృష్టం.
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం, పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాన నందనం. ఎక్కడ రామ సంకీర్తనం వినబడుతూ ఉంటుందో అక్కడల్లా వచ్చి కూర్చుంటారు ఆయన. గోస్వామి తులసీదాసుకి అలాగే కనబడితే ఆయన దర్శనం అయ్యాక హనుమాన్ చాలీసా వ్రాసారు, చాలీసా అంటే నలభై దోహాలు (హిందీ రెండు లైన్ల పద్యాలు) వాటిలో హనుమాన్ స్తుతి చేసారు. మహాభక్తుడు త్యాగరాజుస్వామికి దర్శనం అయింది. మహాపురుషులకు, ఆ అదృష్టం ఉన్నవాళ్ళకి రామ దర్శనం కలుగుతుంది. కాని ఎన్ని దర్శనాలు అయినా ప్రదోషకాలం వచ్చేసరికి ఆ పారిజాత వృక్షం దగ్గరకు వెళ్తారట. ఎందుకని? సిద్ధ, సాధ్య, యక్ష, గంధర్వ, కిన్నర స్త్రీలు వస్తారట అక్కడికి శ్రీరామ సంకీర్తన చేయడానికి. ఆ సంకీర్తనలు వింటూ తాను నృత్యం చేస్తూ హనుమంతుడు పాల్గొంటాడట. నేనక్కడికి వెళ్ళాలి, సమయమయింది, ఉండటానికి వీల్లేదు, అని చెప్పాడు, ఎవరితో? తమ్ముడు భీముడితో, బంగారు కమలాలు భీమయ్య తీసుకురావడానికి వెళ్ళినపుడు, సౌగంధికాపహరణం, అరణ్య పర్వం, మహాభారతం. మహత్సంగః దుర్లభః అగమ్యః మహాపురుషులు మన దగ్గరకు వచ్చారంటే ఏదో ఒక అనుగ్రహం, మనయొక్క పుణ్య విశేషం చేత వస్తారు. సుగ్రీవుడికి దొరికింది ఆ పుణ్యం, భాగ్యం, మహా వైభవం. సుగ్రీవుడు వానరులకి చూపించాడు వీళ్ళిదరిని, ఆకర్ణాంత విశాల సుందర సురుచిర నేత్రభాగం, కఠినమైన, విశాలమైన వక్షస్స్థలం, చక్కని వంపులతో తిరిగిన ముంగురలతో భాసిల్లుతున్న జటాజూటాలు, భుజాలమీద వ్రేలాడబడిన భయంకరమైన ధనుర్దండాలు, మూపుమీద తొంగి చూస్తున్నట్టున్న అంబులపొదుల్లోని అక్షయమైన బాణాలు, మొలనూలుకు వ్రేలాడుతున్న బంగారు ఒరలలోని బారైన ఖడ్గాలు,ఇది నడకా? సింహాలా? ఏనుగులా? వృషభాలా? మూడు గతులు చెప్పారు ఉత్తముల యొక్క నడకకి. ఏతౌ వనమిదం దుర్గం వాలిప్రణిహితౌ ధ్రువం| ఛద్మనా చీరవసనౌ ప్రచరంతౌ ఇహ ఆగతౌ|| (4.2.6) చూడండయ్యా వానరులారా, ఆ వచ్చేవాళ్ళని చూడండి, ఛద్మనా చీరవసనౌ, వేషాలు వేసుకున్నారు నార చీరలు జటలు కట్టుకొని, వేషాలెందుకంటున్నానంటే విరుద్ధమైన ధనుర్బాణాలు, ఖడ్గాలు ఉన్నాయి, తపస్సులైనవారు జటామండలాలు, నారచీరలు ధరించినవారు ధనుస్సులు ఖడ్గాలు పట్టుకుంటారా? ఏదో ఉంది మోసం. ఎందుకొస్తున్నారు? బహుశా మా అన్నయ్య పంపితే నన్ను చంపడానికి వస్తున్నారేమో! కపిరాజుగారే ఈ మాట చెబితే ఇక బంట్రోతులకు ధైర్యం ఏముంటుందండి? వానరులాయె, చపలచిత్తులు, చకచకా లేచారు, పరుగెత్తారు, భయాందోళన, చెట్లు విరిచారు, కొండ శృంగాలు పడేశారు, నానా గల్లంతు చేసారు. మళ్ళీ వచ్చారు సుగ్రీవుడి దగ్గరకు, ఎక్కడికి పోతారు? అక్కడే ఉన్నారు హనుమ స్వామి. తతస్తం భయసంవిగ్నం వాలి కిల్బిష శంకితం| ఉవాచ హనుమాన్వాక్యం సుగ్రీవం వాక్యకోవిదః|| (4.2.13)
సద్గురువు లభిస్తే సంశయాలు తీరుతాయి, సంశయం తీరితేనే కృతార్థుడవుతాడు ఎవడైనా, సంశయాత్మా వినశ్యతి, సందేహం కలిగినపుడు పెద్దల దగ్గర తీర్చుకోవాలి తప్పకుండా. ఆ సందేహమున్నదే అది చాలా బాధిస్తుంది. ఆ సందేహాన్ని వైద్యులు-ఇక్కడ వైద్యులంటే శరీరానికి వైద్యంచేసే వైద్యుడు మరియు గురువులు. శరీరానికి వైద్యంచేసే వైద్యుడు రోగనిదానం కనిపెట్టి దేనివల్ల ఇది వచ్చిందో తెలుసుకొని దాన్ని ఎలా పోగొట్టాలో గుర్తించి దానికి సూటబుల్ అయిన డ్రగ్గేదో నిర్ణయించి సరైన వైద్యం,చికిత్స చేస్తాడు; శిష్యుడికి కలిగిన సందేహం, వీడికున్న భ్రమ, చాపల్యం ఏమిటో తెలుసుకొని సరియైన ట్రీట్మెంట్ చేస్తారు గురువు, అందువల్ల ఇద్దరూ వైద్యులే. వెనకటి గురువులు అలా వైద్యం చేసారు. ఇప్పుడు గురువులకు గు లేదు, రు లేదు. సంభ్రమః త్యజ్యతామేష సర్వైః వాలికృతే మహాన్| మలయోయం గిరివరః భయం నేహాస్తి వాలినః|| (4.2.14) మహారాజా! వానరప్రభువు అయినా నీవే ఇలా చపలచిత్తం పొందితే ఎలా? మనం ఉన్నది ఎక్కడ? మలయశిఖరం, ఋష్యమూక పర్వతం, ఇక్కడ నీకు వాలి భయం ఏమిటయ్యా?
వెనక ఒక రాక్షసుణ్ణి సంహరించి ఆ రాక్షసుడి శరీరాన్ని విసిరివేస్తే ఆ రక్తపు మరకలు అప్పుడే ఆశ్రమంనుండి బయటకు వస్తున్న మతంగ మహర్షివారి మీద పడ్డాయి. ఎవడ్రా ఇది? మా ఆశ్రమం కలుషితం చేసాడు, వాలి అన్నారు. ఆహా! వాడు కనుక నాలుగు యోజనాల మేర లోపల ఈ కొండ దగ్గరకు వస్తే తల పగిలి చస్తాడు, అని శపించారు. అందుకనే భూలోకమంతా సంచారం చేసినా వాలి రానిది రాలేనిది వాలి చంపకూడని ప్రదేశం దొరక్క మళ్ళీ ఈ గుట్టమీదికొచ్చి కూర్చున్నాడీ పెద్ద మనిషి. వాలి కృతే మహాన్ త్యజ్యతాం సంభ్రమః మహాన్ మలయోయం, (4.2.14) మహారాజా! ఎంత తెలివి కలవాడివి, ఎంత చదువుకున్నవాడివి, ఎంత జ్ఞానం ఉంది! కాని అహో శాఖామృగత్వం తే వ్యక్తమేవ ప్లవంగమ! నీ వానర బుద్ధి, చపల బుద్ధి పోలేదు కదయ్యా! లఘుచిత్తతయా ఆత్మానం న స్థాపయసి యో మతౌ| (4.2.17) స్వల్పచిత్తుడవై, చపలచిత్తుడవై స్థిరమైన నిర్ణయం పొందలేకపోతున్నావు అని, శుభమైన మాట హనుమంతులు సుగ్రీవుడితో అన్నారు. ఇది గురువులు మొదలు చెప్పేది. (సుగ్రీవస్తు శుభం వాక్యమ్ శ్రుత్వా సర్వం హనూమతః)। తతశ్శుభతరం వాక్యం హనూమన్తం ఉవాచ హ| (4.2.19) అంతకంటె శుభతరమైన మాట సుగ్రీవుడు అడిగాడు. అంతకంటె అంటే, గురువులు చెబుతారండి, తలకాయ ఆడిస్తారు, వీడికి పూర్తిగా తెలిసిందో? తెలియదో? మళ్ళీ అడగడు, తెలుసుకోడు, గురువుగారు చెప్పారు, విన్నాం అంటాడు. వాడిని మందశిష్యుడు అంటారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా నీకున్న డౌట్స్ నీ బుద్ధితో విచారించి, నీకు కలిగే సంశయాలు బాగా ఆలోచించుకొని తెలుసుకోవాలి. వినయంతో పరిప్రశ్నతో, పరిప్రశ్న అన్నారు అందుకనే. సేవయా సేవతో గురువులని అడగాలి.
[1] ఇంకా లక్ష్మీనారాయణ సంహితలో మొదటి ఖండంలో 422 అధ్యాయంలో 70వ శ్లోకంనుండి 98 వరకు శబరి కథ ఉంది, ఇందులోకూడా ఫలశృతి చెప్పారు, శృత్వా పఠిత్వా యాయాద్వై గోలోకం ప్రమదా నరాః| అని ఈ అధ్యాయాన్ని శ్రద్ధతో విన్నా, చదివినా, గోలోకాన్ని పొందుతారు అని" అట్టి మహాభాగ్యం ఉంది ఈ చరిత్రలో.