శ్రీవాసుదేవానంద సరస్వతి (తెంబేస్వామి) సంగ్రహ జీవిత చరిత్ర
శ్రీవాసుదేవానంద సరస్వతి (తెంబేస్వామి) సంగ్రహ జీవిత చరిత్ర
08
గమాగమస్థం గమనాదిశూన్యం చిద్వీపదీపం తిమిరాంధనాశం|
పశ్యామి తే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మరూ పం ।।
ఉజ్జయినికి వెళ్ళి, శ్రీ నారాయణానంద సరస్వతి వారి నుండి రాజదండం స్వీకరించమని దత్తులవారి ఆజ్ఞ మేరకు శ్రీస్వామివారు బయలుదేరారు. ఎప్పటిలాగే కాలినడకన వాషిం, ఉమర్‌ఖేడ్, మహూర్, ఖాండ్వా, బధవాయి, ఓంకారేశ్వర్, మండలేశ్వర్, బల్వాడల మీదుగా ఉజ్జయినికి చేరారు. అక్కడ వారు ఒక దత్త దేవాలయంలో బస చేసి, శ్రీ నారాయణానంద సరస్వతీ స్వామి వారిని కలిసి, రాజదండం ప్రసాదించమని కోరారు. శ్రీ నారాయణానంద సరస్వతి స్వామి మహారాజ్, వారి గురువులైన శ్రీ అచ్యుతానంద సరస్వతి స్వామి మహారాజ్ గారి సమ్మతితో, ఆచారానుగుణంగా శ్రీ స్వామీజీకి 1891లో రాజదండం బహుకరించి, వారికి శ్రీ వాసుదేవానంద సరస్వతి అనే సన్యాసాశ్రమ నామం ప్రసాదించారు. పదే పదే స్వామీజీ అడగడంతో ఆ రోజు దత్తుల ఆజ్ఞకు విరుద్ధంగా వాసుదేవానందులు ఆశ్రమంలో భోజనం చేసారు. దాని ఫలితంగా వారు వరుసగా వాంతులు చేసుకుంటూనే ఉన్నారు. శ్రీ నారాయణానంద స్వామి దత్తాత్రేయుడిని ప్రార్థించి, క్షమించమని కోరిన తర్వాత కాని అవి ఆగలేదు. అది మొదలుకొని స్వామీజీ జీవితాంతం, దత్తుల ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ వచ్చారు. ఏ మాత్రం తృటి జరిగినా ఏదో ఒక శిక్ష పడుతుండేది. స్వామిజీ తమ మొదటి చాతుర్మాసం 1891 సంవత్సరంలో ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున తమ దీక్షాగురువులతో పూర్తి చేశారు.
స్వామీజీ యాత్ర అలా ప్రారంభమైంది. దత్తాత్రేయుల ఆదేశానుసారం భారతదేశం అంతటా పర్యటించి వర్ణాశ్రమ ధర్మం నుండి తప్పుదారి పట్టిన ప్రజలకు సనాతన వేద మార్గాన్ని బోధించి తిరిగి ధర్మపథంలోకి తీసుకురావడమే వారి జీవిత పరమార్థంగా వెల్లడించారు. వారు సన్యాసాశ్రమ విధులను ఆచారాలను క్రమశిక్షణతో కఠినంగా పాటిస్తూ, 23 సంవత్సరాల పాటు దేశాటన చేసారు.
4 లుంగీలు, 2 వస్త్రాలు, రాజదండం, ఒక కమండలు (చెక్క /వెదురు నీటి పాత్ర), ఉపనిషత్తుల పుస్తకం, పూజా సామాగ్రి, రెండు దత్త విగ్రహాలు, నీరు తోడుకోడానికి ఒక త్రాడు - ఇవే స్వామివారి ఆస్తులు. ఒక్కో సందర్భంలో ఉన్ని వస్త్రం, కాగితం కలం వంటివి ఉండేవి. ఇవి తప్ప వేరే వస్తువులేవీ ఉండేవికావు. బట్టలు ఉతుక్కోవడం, పాత్రలను కడగడం స్వయంగా చేసుకునేవారే కాని ఎప్పుడూ ఎవరి సహాయమూ తీసుకునేవారుకారు. వారిని ఎవరైనా ముట్టుకున్నా, వారు మల విసర్జన చేసినా స్నానం చేసేవారు. వారెప్పుడూ కాలినడకనే అదికూడా చెప్పులు లేకుండానే ప్రయాణం చేసేవారు. చాలా వేగంగా నడిచేవారు. వీలైనంతవరకు నదీ తీరాల మీదుగా ప్రయాణించేవారు. వారికి ఒంటరి ప్రయాణం ఇష్టం. దట్టమైన అడవులు, వేడి ఎడారులు, నిటారు పర్వతాల గుండా ప్రయాణం సాగించేవారు. గంగానది ఆవిర్భావస్థానంలో స్నానం చేసిన ఒక సందర్భంలో మాత్రమే, వారు దాదాపు అపస్మారక స్థితికి రావడం చూసి, కొందరు చలిమంట వేసి రక్షించారట. అది తప్ప మరెప్పుడూ వారు సన్యాస నియమాలకు భిన్నంగా చలి కాచుకోలేదు. వారు ఎక్కడ ఉన్నా, ఏదో ఒక దేవాలయంలోనే వసతి చేసేవారు తప్ప ఇళ్లలో ఉండేవారు కాదు. రైల్వే పనులు, రోడ్ల పనులు ఆపివేసిన ప్రదేశాలలో, జన సంచారం లేని మార్గాల్లో, ఆ ప్రాంత వాసులు వారిస్తున్నా పట్టించుకోకుండా నిర్భయంగా ప్రయాణం కొనసాగించేవారు. దత్తాత్రేయ స్వామి, అశ్వత్థామ, ఇతర దేవతలు అదృశ్యంగా ఉంటూ వారికి మార్గ నిర్దేశం చేసేవారట.
కొన్ని అరుదైన సందర్భాలలో తప్ప వారు ఒకే చోట వారం కంటే ఎక్కువ ఉండేవారు కాదు. వర్షాకాలాన్ని చాతుర్మాసం అంటారు. సన్యాసి నిబంధనలను పాటిస్తూ, చాతుర్మాసంలో రెండు నెలలు మాత్రమే వారు ఒకే చోట ఉండేవారు. వారి సంచార సమయంలోని 23 చాతుర్మాసాలలో చాలావరకు చిన్న గ్రామాలు, మారుమూల ప్రాంతాలలో ఉన్నారు. వారు చాతుర్మాసంలో బస చేసారని తెలిస్తే, ఎంత కష్టమైనా సరే, కలరా ప్లేగు వంటి అంటువ్యాధులను కూడా లెక్క చేయకుండా ప్రజలు వారిని దర్శించడానికి వచ్చేవారు.
స్వామివారి దేహం మధ్యస్థంగా, ముదురు రంగులో ఉండి, మాట్లాడటం ప్రారంభించే వరకు పెద్దగా ఆకట్టుకునేవారు కాదు. వారి మాటలు మృదువుగా ఉన్నా దృఢంగా, స్పష్టంగా, సూటిగా ఉంటూనే ఆత్మీయత, కారుణ్య భావాలను వ్యక్తం చేస్తుండేవి. నిర్లిప్తంగా ఉన్నా ఆకర్షణీయంగాను, పాండిత్యపూరితంగా ఉన్నా ఆలోచింపచేసేవిగాను, క్లుప్తంగా ఉంటూనే చాలా ప్రభావితం చేసేవిగాను ఉండేవి.
తేజోవంతంగా, తీక్ష్ణంగా ఉండే వారి కళ్ళు మనలోకి లోతుగా చూస్తున్నట్లు అనిపించేవి.
వారి నిరాడంబరమైన జీవనశైలి, గ్రంధాలపై వారికున్న విస్తృతమైన జ్ఞానం, వారి క్రమశిక్షణ, నిస్వార్థ వైఖరి, విచక్షణారాహిత్యం, సహజ కారుణ్యం, ప్రతి ఒక్కరిపై చూపించే శ్రద్ధ - వీటన్నిటివల్ల ఎందరికో వారిపై ప్రగాఢ భక్తిశ్రద్ధలు కలిగి, అవి జీవితాంతం నిలిచేలా చేసాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది స్వామికి శిష్యులయ్యారు. స్వామి వారందరికి ఒక ఆదర్శ, ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఉంటూ, సాంత్వన, చేయూతలను ఇస్తూ దైవసాన్నిధ్యం వైపు ముక్తిమార్గం వైపు వాళ్ళను నడిపించారు.