శ్రీవాసుదేవానంద సరస్వతి (తెంబేస్వామి)
సంగ్రహ జీవిత చరిత్ర
శ్రీవాసుదేవానంద సరస్వతి (తెంబేస్వామి)
సంగ్రహ జీవిత చరిత్ర
శ్రీ గురుభ్యో నమః
భగవత్ తత్త్వాన్ని, ఆ అనంత సత్యాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని, ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థాయిని సాధించాలనుకునేవారు ఏ విధంగా ఉండాలో, ఏ దశలో ఏమి చేయాలో అనేవి స్వామివారి జీవనశైలిని జాగ్రత్తగా గమనించి నేర్చుకోవచ్చు. పరిపూర్ణమైన భక్తితోనూ, సనాతన ధర్మపు నియమాలను సక్రమంగా అనుసరించడం ద్వారానూ, ఒక వ్యక్తి ఒక్క జీవితకాలంలోనే బ్రహ్మాన్ని తెలుసుకోవచ్చు, తెలుసుకోగలరు అని స్వామి చేసి చూపించారు. శ్రీ వాసుదేవానంద స్వామిజీ ఏకాగ్రతతో, అలుపే ఎరుగని నిరంతర కృషి, పట్టుదల, సాధనలతో భగవంతుని సమగ్ర స్వరూప స్వభావాలను సంపూర్ణంగా తెలుసుకుని పరమహంస పరివ్రాజకాచార్యులుగా, జీవన్ముక్తులుగా మారారు.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత|
అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం||
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం|
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే|| అన్నారు కృష్ణ పరమాత్మ.
ధర్మానికి హాని, గ్లాని కలుగుతున్నప్పుడు తాము అవతరిస్తాము అంటూ కృష్ణ పరమాత్మ చెప్పారు. ఆయాపరిస్థితులకు తగినట్టుగా వివిధ రూపాలలో అవతరించారు. భగవంతుడు మనకోసం పై భూమికనుండి ఇలా కింది భూమికకు దిగి వచ్చారు, వస్తున్నారు. ఎంత దయ!!
కలియుగంలో మనకు తెలిసి, తెలియక, ఎన్ని అవతారాలు ఉన్నాయో! ధర్మ పరిరక్షణకు నిలబడిన రాజులు, వాళ్ళకి చేయూతనిచ్చిన మంత్రులు, యోగులు, పరివ్రాజకులు; ఆదిశంకరాచార్యులు, శ్రీపాద శ్రీవల్లభులు, నరసింహ సరస్వతి స్వామివారు, విద్యారణ్య స్వామివారు, సమర్థ రామదాసుగారు, ఇలా ఎందరో మహానుభావులు, వీరిలో మన వాసుదేవానంద సరస్వతి స్వామివారు ఒకరు. వీరంతా భగవత్స్వరూపులే! వీరిది ముమ్మాటికీ అవతరణే, వారిలా ఒక్క గంట ప్రశాంతంగా ఎటువంటి ఉద్వేగాలకు లోను కాకుండా మనం ఉండగలమా? ఎన్నో విరుద్ధ పరిస్థితులను ఇంటా బయటా కూడా ఎదుర్కొని, ఏమాత్రం క్రోధావేశాలు లేకుండా సమతౌల్యతతో నిలబడటమే దైవత్వం కదా! బంగారు ఉసిరికాయలు వడగళ్ళలా పడుతుంటే శంకరాచార్యులవారు చకచకా ఓ నాలుగు తీసి తమ జోలెలో వేసుకోలేదు, కనక వర్షం కురుస్తుంటే విద్యారణ్యులవారు తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము అని కొంత తీసి దాచుకోలేదు. వీరందరు తమ జీవితాలను, తమ తపోసంపదనంతటిని ధర్మ పరిరక్షణకు, మానవసేవకు, దేశ అభ్యుదయానికి అంకితం చేసారు, ధారపోసారు. ఇది కాదా దైవత్వం అంటే! ఒక్క అణుమాత్రం స్వార్థం లేకుండా పరార్థం కోసం జీవితాలనే వెచ్చించిన వీళ్లంతా దైవాలు కాక మరెవరు?
మన దేశంలో ఒక్కొక్క ప్రాంత్రంలో ఒక్కొక్క రూపంలో భగవంతుడు అవతరించాడు, మహారాష్ట్రలో శ్రీవాసుదేవానంద సరస్వతి స్వామివారిలా. భగవంతుడు రాముడిగా, కృష్ణుడిగా అవతరించినప్పుడు ఎలా ధర్మాలను ఆచరించి చూపారో, మన స్వామివారు కూడా అదే ధార్మిక విధానాన్ని అనుసరించి, చూపి, హిందూ ధర్మానికి ఆధారంగా నిలిచారు.
ఈ మహనీయుల పేర్లు తలుచుకున్నా మనలోని నకారాత్మక శక్తి, చెడుబుద్ధులు కొంత వరకైనా తగ్గుతాయి.
ఈ మహానుభావులు జన్మించే సమయానికి మన దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 19వ శతాబ్దంలో భారతదేశంలో ఒక విధమైన సాంస్కృతిక, ధార్మిక, మతపరమైన నిస్తబ్దత చోటుచేసుకుంది. దాదాపు పదిశతాబ్దాల కాలం తురుష్కులు భారతీయులను ఎన్నో విధాలుగా హింసించారు. దేశాన్ని కొల్లగొట్టారు. ఆలయాలలో ధనమంతా కొన్ని వేల ఏనుగులమీద, గుర్రాలమీద వాళ్ళ దేశాలకు తరలించుకు వెళ్లారు. ఆలయాలను ధ్వంసం చేయటమే కాకుండా వాటిని మాటలలో చెప్పలేనంత అసహ్యంగా కలుషితం చేసారు. హిందూ ధర్మాన్ని నిర్వీర్యం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా, వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. అనేక హింసలను భరిస్తూ, హిందువులు తమ వైదిక ధర్మాలను, సంస్కారాలను ఏ మాత్రం వదులుకోలేదు. ఆయా సమయాలలోని రాజుల, గురువుల అనుగ్రహంవల్ల మన వైదిక సంస్కృతిని, ధర్మాన్ని వాళ్ళు దెబ్బ తీయలేక పోయారు.
బ్రిటిష్ పాలన ప్రారంభమైన తర్వాత, వారు చాకచక్యంగా భారతీయుల మేధాపరమైన స్వావలంబనపై దెబ్బ తీసారు, పాలకుల మధ్య, పాలితుల మధ్య, ప్రజలలోనూ పరస్పర కలహాలను పెంచి, అంతకు ముందున్న వర్ణ వ్యవస్థ స్థానంలో కులవ్యవస్థ తీసుకువచ్చి మన సమాజాన్ని విడదీసి, సంస్కృతిని నాశనం, ధర్మాన్ని కలుషితం చేసారు. ప్రజల ఆచారవ్యవహారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. పాశ్చాత్య ధోరణులు ప్రజలపై ప్రభావం చూపగా, హిందూ ధర్మం క్రమంగా బలహీనపడింది.
ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులలో, ధర్మపునస్థాపనకై ప్రత్యేక మార్గాలను చూపించడానికి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని వెలుగొందించడానికి శ్రీ వాసుదేవానంద సరస్వతివారి జననం సంభవించింది.
********
గురుచరిత్ర కొద్దిగా సంక్షిప్తం చేస్తే ఈ రోజులలో చదువుకునే వాళ్ళకి తేలిగ్గా ఉంటుందని ఆ ప్రయత్నం మొదలుపెట్టాను. ఆ సందర్భంగా వీలున్నన్ని పుస్తకాలు, సైట్లు చూస్తుండగా వాసుదేవనివాస్ అనే వెబ్సైట్ చూడటం జరిగింది. అందులో తెంబే స్వామివారి పుస్తకాలు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ లిస్ట్ చూడగానే ముందు ఒక్క క్షణం ఆశ్చర్యంతో కళ్ళు బైర్లు కమ్మాయి.ఆ లిస్ట్ పుస్తకాల షాప్ వాళ్ళ క్యాటలాగ్లా ఉందే తప్ప, ఒక్క వ్యక్తి అన్ని పుస్తకాలు వ్రాయడం మన ఊహకే అందని విషయం.
ఒక్క గురుచరిత్రయే దాదాపు పది రకాలుగా—200, 300, 700, 2000, శ్లోకాలతో—ఇవి కాక వాటి చూర్ణికలు, చంపూ కావ్యాలు; కొన్ని మరాఠీ భాషలో రచించారు. ఇందులో ద్విసాహస్రీ గురుచరిత్ర అంటే 2వేల శ్లోకాలు, కేవలం పన్నెండు రోజులలో సంస్కృతంలో లిఖించారు. ఇది ఒక అద్భుతం కదా! దత్త పురాణం, దత్త మహాత్మ్యం—ఇలా ఎన్నో పుస్తకాలు! దాదాపు 60కి పైగా ఉన్నాయి.
ఇక శ్లోకాల లిరిక్స్ కోసం చూస్తుంటే, Sanskrit Documents వెబ్సైట్లో పెద్ద లిస్ట్ ఉంది.
(https://sanskritdocuments.org/itrans/vasudevananda-sarasvati/)
వీరు స్తుతించని దేవుడు కాని దేవత కాని లేరు. ఆదిశంకరాచార్యులవారి స్తోత్రాలు ఎలానో, వీరి రచనలూ అలానే ఉన్నాయి అనిపిస్తుంది. వీరు 60వ ఏటనే సమాధి పొందారు, కానీ ఇన్ని పనులు ఎలా సాధించారు? ఒక్క స్తోత్రసంగ్రహం లోనే 148 స్తోత్రాలు ఉన్నాయి. అందులో "దకారాది దత్త సహస్రనామ స్తోత్రం" చివరిది. ప్రతి నామం “ద” తో ప్రారంభమవుతూ, ఆభాషలో పాండిత్యాన్ని ప్రతిబింబిస్తోంది. సరస్వతీదేవి నాలుక మీద నాట్యం చేస్తుంటే తప్ప ఇలాంటివి సాధ్యం కావు. చిన్నా,పెద్ద అన్ని నదీమతల్లులపైన స్తుతులు వ్రాసారు. ఒక్కొక్కసారి ఆ నదీమాతలు వచ్చి వినేవారట వీరు తన్మయత్వంతో పాడుతుంటే. ఈ స్తోత్రాలన్ని ఈ క్రింది వెబ్ సైట్ లో ఉన్నాయి.
(https://vasudevniwas.org/Books/Free/STOTRASANGRAH.pdf) అన్ని సంస్కృత లిపిలోనే ఉన్నాయి, అయినా ఒక్కసారి చూడండి, మన మహనీయులపై మనమే శీతకన్ను వేస్తే ఎలా? ఇలాంటి వారిని గౌరవించడం, వారి రచనలతో మన దైవాన్వేషణను ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యత.
ఇవి కాక ఎక్కద వెతికినా వీరి బయోగ్రఫీ కి ఒక్క ఇంగ్లీష్ సోర్స్ మాత్రమే ఉంది. దానినే వేరే సైట్లలో, ఫేస్ బుక్కులలో చూసాను, నేనూ అదే మూలంగా తీసుకొని ఆ మహానుభావుల చరిత్ర అందరికి, ముఖ్యంగా మన తెలుగువారికి తెలియాలి అని వ్రాయడం జరిగింది. ఏవైనా తప్పులు చేసిఉంటే సహృదయంతో మన్నించండి. ఆ లింకులు కింద ఇస్తున్నాను.
https://vasudevniwas.org/free-download-books-by-shri-vasudevanand-saraswati-tembe-swami-maharaj/
సాక్షాత్ దత్తస్వరూపులు అయిన స్వామీజీవంటి వారి గ్రంథాలను ఉచితంగా అందరు చదవడానికి, download చేసుకోవచ్చు.
https://vasudevniwas.org/guru-parampara-at-vasudev-niwas/ ఇందులో గురుపరంపర లో గురువుల ఫోటోలు అన్నీ ఉన్నాయి.
https://www.shrivasudevanandsaraswati.com/English/Compact_Biography2016.pdf
https://shreedattamandirmangaon.org
https://mydattatreya.com/tembe-swami/
https://www.sreedattavaibhavam.org/sree-vasudevananda-saraswati-swamy/
ప్రసన్న కుమారి
*******